Share News

Parkamani Case: కేసును ఎలా రాజీ చేశారు

ABN , Publish Date - Nov 11 , 2025 | 04:09 AM

తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు లోక్‌ అదాలత్‌లో రాజీ అయిన సమయంలో తిరుమలలో పనిచేసిన సీఐ జగన్మోహన్‌ రెడ్డి...

 Parkamani Case: కేసును ఎలా రాజీ చేశారు

  • మీకు తెలియకుండా జరిగే వీలు లేదు

  • ఎవరైనా అధికారి లేక నేత ఒత్తిడి చేశారా?

  • దొరికింది 12 నోట్లయితే, తొమ్మిదే చూపారే?

  • డాలర్‌ విలువ పెంచి నమోదు చేశారేం?

  • ‘పరకామణి’ కేసులో అప్పటి సీఐ జగన్మోహన్‌ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి, వీజీవో గిరిధర్‌పై సీఐడీ ప్రశ్నల వర్షం

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల ‘పరకామణి’ చోరీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు లోక్‌ అదాలత్‌లో రాజీ అయిన సమయంలో తిరుమలలో పనిచేసిన సీఐ జగన్మోహన్‌ రెడ్డి (ప్రస్తుతం వీఆర్‌), వన్‌టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి (ఇప్పుడు వీఆర్‌), విజిలెన్స్‌ ఆఫీసర్‌ (వీజీవో) గిరిధర్‌ (ప్రస్తుతం నెల్లూరు పీటీసీ డీఎస్పీ)లను సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో వేర్వేరుగా విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసును రాజీ చేయడంలో అధికారులు లేక రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా అని ముగ్గురినీ సీఐడీ అధికారులు ప్రశ్నించారు. తొలుత జగన్మోహన్‌రెడ్డిని దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ‘జిల్లాలో ఎంతకాలం పనిచేశారు...గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ పనిచేశారు...తిరుమలకు మిమ్మల్ని సిఫారసు చేసింది ఎవరు... అక్కడకు సీఐగా వచ్చాక ఎన్నాళ్లకు పరకామణి కేసు బయటకు వచ్చింది...అప్పుడు ఎస్పీ ఎవరు...ఆయన ప్రోద్బలంతోనే రాజీ చేశారా...ఈ కేసు ఎవరు నమోదు చేశారు...అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అప్పటి వన్‌టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి కేసు నమోదు చేసి, విచారించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. దీనిపై ఏకీభవించని దర్యాప్తు అధికారులు.. ‘‘మీరు అక్కడ ఎస్‌ఐ కంటే పెద్ద అధికారి.. మీ పరిధిలోనే అతను పనిచేస్తున్నారు..అలాంటి సమయంలో లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ జరిగిన తతంగం మీకు తెలియకుండా ఎలా ఉంటుంది’’ అంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.


రవికుమార్‌తో మీకెలా పరిచయం.. కేసు రాజీ విషయంలో ఎంతమొత్తం చేతులు మారాయని ప్రశ్నించినట్లు సమాచారం. రవికుమార్‌ ఒకసారి స్టేషన్‌కు వచ్చారని, అంతకుమించి తనకు పరిచయం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. తిరుమలలో, వన్‌టౌన్‌లో ఎంత కాలం పనిచేశారంటూ ఎస్‌ఐ లక్ష్మీరెడ్డిని సీఐడీ ప్రశ్నించారు. పరకామణి కేసును మీరేనా రిజిస్టర్‌ చేసిందని అడిగారు. అప్పటి ఏవీఎ్‌సవో సతీశ్‌కుమార్‌ సీఐ జగన్మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారని, సీఐ ఎండార్స్‌ చేయడంతో కేసు నమోదు చేశానని లక్ష్మీరెడ్డి చెప్పినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా రవికుమార్‌ను పిలిపించి మాట్లాడానని, అందరినీ విచారించాక చార్జిషీటు వేసినట్లు తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఆ సెక్షన్లు ఏం చెబుతున్నాయి? కేసు రాజీకి మీపై ఒత్తిడి వచ్చిందా? అని ప్రశ్నించారు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని, వాళ్లు రాజీకి పోయినట్టుగానీ, కేసు క్లోజ్‌ చేసినట్టుగానీ తనకు తెలియదని ఎస్‌ఐ చెప్పినట్లు తెలిసింది.


ఎందుకలా చూపారు?

తనిఖీల్లో రవికుమార్‌ వద్ద 112 నోట్లు దొరికినట్టు ఫిర్యాదులో ఉండగా, రికార్డుల్లో మాత్రం తొమ్మిది నోట్లే ఎలా చూపించారని జగన్మోహన్‌రెడ్డి, లక్ష్మీరెడ్డిలను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. పరకామణిలో కాజేసిన సొమ్ముతో రవికుమార్‌ రూ.కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్న నేపథ్యంలో అప్పటి నేతలు, ప్రజాప్రతినిధుల కల్పించుకుని లోక్‌ అదాలత్‌లో కేసును రాజీ చేయించారా అని అడిగినట్లు తెలిసింది. అయితే, పలు ప్రశ్నలకు జగన్మోహన్‌ రెడ్డి, లక్ష్మీరెడ్డి ఇచ్చిన సమాధానాలకు పొంతన లేదు. దీంతో ‘మీ మాటల్లో చాలా అనుమానాలున్నాయ’ని దర్యాప్తు అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేసినట్లు తెలిసింది. కాగా, తాను భగవంతుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఈ కేసుతో తనకేమీ సంబంధం లేదని దర్యాప్తు అధికారులకు జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడితో తనను ఇరికించాలని చూస్తే భగవంతుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.


ఏవీఎస్‌వో ఫిర్యాదుపై ఎలా రాజీ చేశారు? గిరిధర్‌ను ప్రశ్నించిన అధికారులు

తిరుమలలో వీజీవోగా ఎన్నేళ్లు పనిచేశారు...మీకు పోస్టింగ్‌ ఇప్పించింది ఎవరు..విజిలెన్సు అధికారులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు, రాజకీయ నాయకులు కలసి లోపాయకారీ ఒప్పందంతో ఎలా రాజీ చేశారు’ అంటూ నాటి వీజీవో గిరిధర్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, తనకేం తెలియదని ఆయన సమాధానమిచ్చినట్టు సమాచారం. రవికుమార్‌ ఆస్తుల వివరాలు, ఆయన టీటీడీకి రాసిచ్చిన ఆస్తుల విలువ ఎంత...లోక్‌ అదాలత్‌లో రాజీ చేసిన వారెవరనే విషయాలపై సమగ్రంగా ఈవోకు నివేదిక అందచేశానని, మిగిలిన విషయాలు తనకు తెలియదని ఆయన చెప్పినట్లు తెలిసింది.

Updated Date - Nov 11 , 2025 | 04:12 AM