Share News

CID Intensifies: లోక్‌అదాలత్‌లో రాజీ చేయించిన పెద్దలెవరు

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:28 AM

దేవుడి సొమ్ము అపహరించాలని ఎందుకనుకున్నావు ఇంత పెద్దం నేరం చేసినా లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ చేయించిన పెద్దలెవరు అంటూ తిరుమల శ్రీవారి పరకామణి కేసులో...

CID Intensifies: లోక్‌అదాలత్‌లో రాజీ చేయించిన పెద్దలెవరు

  • దేవుడి సొమ్ము అపహరించాలని ఎందుకనుకున్నావు?

  • ‘పరకామణి’ కేసులో రవికుమార్‌ను విచారించిన సీఐడీ

  • నేడూ విచారణకు రావాలని ఆదేశించిన అధికారులు

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘దేవుడి సొమ్ము అపహరించాలని ఎందుకనుకున్నావు? ఇంత పెద్దం నేరం చేసినా లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ చేయించిన పెద్దలెవరు?’ అంటూ తిరుమల శ్రీవారి పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాపునకు రంగంలోకి దిగిన సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆధ్వర్యంలోని 20మంది అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి శుక్రవారం నుంచి విచారణలో వేగం పెంచారు. రవికుమార్‌, ఆయన భార్య రమ్య, కుమార్తె ప్రనూషను శుక్రవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి పిలిపించారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం వరకు రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఎస్పీ గంగాధర రావు, లీగల్‌ టీమ్‌ లక్ష్మణరావు తదితరులు సుదీర్ఘంగా విచారించారు. మొదట రవికుమార్‌ భార్య, కుమార్తె విచారణకు హాజరుకాగా.. కాసేపటికి ఆయన్ను కూడా లోపలకు పిలిపించారు. ఈ ముగ్గురినీ వేర్వేరుగా విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వ్యక్తిగత వివరాలు, కుటుంబం, బంధువులు, మిత్రుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ‘పెద్దజియ్యర్‌ మఠంలో ఉద్యోగంలో ఎప్పుడు చేరావు? అక్కడ్నుంచి పరకామణిలో చేరడానికి సహకరించిన వారెవరు? ఎప్పటి నుంచి టీటీడీ అధికారులు పరకామణిలో విధులు కేటాయించారు? చోరీ ఘటనలో ఇంకెవరైనా ఉన్నారా? మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి స్థిర, చరాస్తులు ఎక్కడెక్కడ.. ఎవరి పేర్లపై ఉన్నాయి’ అని అధికారులు ఆరా తీశారు.


తన ఆస్తులన్నీ రాయించుకున్నారని రవికుమార్‌ చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్న వారికి కుటుంబం ఎలా గడుస్తోందని ప్రశ్నించారు. ఈ చోరీ కేసు వెనుక టీటీడీ, మఠం, పోలీసు అధికారులు ఎవరున్నారో తెలుసుకునే దిశగా విచారణ చేసినట్లు సమాచారం. వారిని అత్యంత భద్రత మధ్య తిరుపతిలో ఉంచినట్లు తెలిసింది. శనివారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. కాగా, కొంతమంది టీటీడీ అధికారులను కూడా శనివారం విచారించే అవకాశాలున్నాయి. అతిథి గృహం బయట మీడియా ప్రతినిధులు వేచి ఉండటంతో రవికుమార్‌ కుటుంబీకులకు మాస్క్‌ వేసి వెనుక నుంచి పంపించేశారు.


దొంగను దాతను చేశారు: భానుప్రకాశ్‌

విజయవాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారికి భక్తులు సమర్పించిన డాలర్లను పరకామణిలో చోరీ చేసిన దోషులు జైలుకు వెళ్లక తప్పదని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’తో శుక్రవారం మాట్లాడారు. ‘పరకామణిలో డాలర్లను కాజేసిన దొంగను దాతగా చేశారు. దొంగతనాన్ని కానుకగా మార్చారు. పరకామణిలో పాపపు పనులు చేసిన వాళ్లంతా ఇప్పుడు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు. దొంగలను తీసుకెళ్లి లోక్‌ఆదాలత్‌లో ఎలా రాజీ చేస్తారు? శ్రీనివాసుడు ఉగ్ర నరసింహుడయ్యాడు. ఖజానాను దోచుకున్న వారిని శిక్షిస్తాడు. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఆరోజు తీర్మానాలు చేసి, సంతకాలు చేసింది భూమన కాదా? పరకామణిలో చోరీ చాలా సున్నితమైన అంశం. వైసీపీ నేతల అబద్ధాలను భక్తులు నమ్మవద్దు.’ అని భానుప్రకాశ్‌రెడ్డి కోరారు.

Updated Date - Nov 08 , 2025 | 06:29 AM