CID Investigation: ఫైబర్‌నెట్ కేసులో గౌతంరెడ్డి ఫిర్యాదుదారుడే కాదు
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:27 AM
ఫైబర్‌నెట్ కార్పోరేషన్‌లో అవినీతి జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ఆ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి అసలు ఫిర్యాదుదారుడే కాదు.
థర్డ్ పార్టీకి రికార్డు ఎలా ఇస్తారు?: సీఐడీ వాదనలు
పిటిషన్ విచారణకు స్వీకరించే అంశంపై రేపు తీర్పు
విజయవాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘ఫైబర్‌నెట్ కార్పోరేషన్‌లో అవినీతి జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ఆ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి అసలు ఫిర్యాదుదారుడే కాదు. అప్పటి ఎండీ మధుసూదనరెడ్డి ఈ కేసులో ఫిర్యాదుదారుడు’’ అని సీఐడీ సీనియర్ కౌన్సిల్ యు.అఖిల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఫైబర్‌నెట్ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలు వినాలని వైసీపీ నేత, కార్పోరేషన్ మాజీ చైర్మన్ గౌతంరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న అంశంపై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. గౌతంరెడ్డి తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రాసిక్యూషన్స్ మాజీ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అఖిల్ వాదనలు వినిపిస్తూ.. రాజకీయ దురుద్దేశంతో వైసీపీ హయాంలో 2021లో ఫైబర్‌నెట్ కేసు నమోదు చేశారన్నారు. అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇందులో ఎక్కడా గౌతంరెడ్డి ఫిర్యాదు చేయలేదన్నారు. కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని మూడో వ్యక్తి పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్నారు. వారికి రికార్డులు ఎలా ఇస్తారని వాదించారు. వాదనలు పూర్తవడంతో గౌతంరెడ్డి పిటిషన్‌పై గురువారం తీర్పు వెలువరిస్తానని న్యాయాధికారి పి.భాస్కరరావు తెలిపారు.