Share News

Tirumala: పరకామణి చోరీ కేసు..సీఐడీ దర్యాప్తు ప్రారంభం

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:28 AM

తిరుమల శ్రీవారి పరకామణి(హుండీ) చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించినట్టు సీఐ డీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు.

Tirumala: పరకామణి చోరీ కేసు..సీఐడీ దర్యాప్తు ప్రారంభం

  • నిందితుడితో సంబంధాలున్న ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ

  • డిసెంబరు 2లోగా హైకోర్టుకు నివేదిక

  • చోరీ వ్యవహారంపై సమాచారం తెలిస్తే 9440700921కు కాల్‌ చేయండి

  • సీఐడీ డీజీ అయ్యన్నార్‌ సూచన

తిరుపతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణి(హుండీ) చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించినట్టు సీఐ డీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. తిరుపతిలో సీఐ డీ ఎస్పీ గంగాధరంతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘‘పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు తిరుపతి కేంద్రంగా దర్యాప్తు మొదలు పెట్టాం. ఎస్పీ గంగాధరం నేతృత్వంలో 20 మందితో 5 బృందాలను ఏర్పాటు చేశాం. దీనికి అదనంగా విజయవాడలో మరో 10 మందితో టెక్నికల్‌, లీగల్‌, ఫోరెన్సిక్‌ బృందాలను ఏర్పాటు చేశాం. టీటీడీ చైర్మన్‌, ఈవోలు పూర్తి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.’’ అని అయ్యన్నార్‌ తెలిపారు.

నిందితుడి వ్యవహారంపై ఆరా తీస్తాం!

పరకామణి చోరీ కేసులో నిందితుడైన రవికుమార్‌ 1985 లో టీటీడీలో చేరాడని అయ్యన్నార్‌ తెలిపారు. అప్పటి నుం చీ ఆయన పనితీరు, అవినీతి, అక్రమాలు ఏమిటనే విషయాలపై లోతుగా విచారిస్తామన్నారు. ‘‘అక్రమాలలో అతనికి సహకరించిన వారు ఎవరన్నది గుర్తించి వారినీ విచారిస్తాం. నిందితుడు రవికుమార్‌తో సంబంధాలున్న అందరికీ నోటీసులు జారీ చేశాం. అతనితో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తాం. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎవరి పేరిట గిఫ్ట్‌ డీడ్‌ లు రిజిస్టర్‌ అయ్యాయో తేల్చాల్సి ఉంది. దీనికి సంబంధించి రికార్డులతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా సేకరిస్తాం. పరకామణి చోరీ కేసుకు సంబంధించి బుక్‌ వాల్యూ రూ.14 కోట్ల టీటీడీ నిధులు దుర్వినియోగమైనట్టు ప్రాథమికంగా అంచ నా వేశాం. దీని మార్కెట్‌ విలువ రూ.45 కోట్ల వరకు ఉం టుంది.’’ అని తెలిపారు. నిందితుడు రవికుమార్‌ ఆదాయ వనరులపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, అతనికి తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌, తిరుపతిలో ఆస్తులున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు పేర్కొన్నారు. దర్యాప్తును త్వర గా ముగించి డిసెంబరు 2వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక అందజేస్తామని చెప్పారు.


పరకామణిలో పర్యవేక్షణా లోపం

పరకామణి దగ్గర పర్యవేక్షణ లోపం ఉందని రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్పష్టం చేశారు. పరకామణిలో స్వచ్ఛందంగా పనిచేసే వలంటీర్లను కఠినంగా తనిఖీ చేస్తున్నారని, అదేసమయంలో టీటీడీ ఉన్నతాధికారులు, పీఠాధిపతులతో సన్నిహితంగా ఉండే ఉద్యోగులను మాత్రం తనిఖీలు చేయడం లేదని గుర్తించామన్నారు. కాగా, పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి సమాచారం తెలిసిన వారెవరైనా 94407 00921 నంబరుకు కాల్‌ వివరాలు అందజేయవచ్చని అయ్యన్నార్‌ సూచించారు.

Updated Date - Nov 06 , 2025 | 04:28 AM