Vivekananda Reddy Demise Case: సీఐ శంకరయ్య డిస్మిస్
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:13 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన రోజు సాక్ష్యాలు చెరిపేసినా వారించలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదనే ఆరోపణలు...
విచారణ కమిటీ ముందుకు రాని ఫలితం.. సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
వివేకా హత్య సాక్ష్యాలు చెరిపేసినా సీఐ వారించలేదని అప్పట్లో చంద్రబాబు ఆరోపణ
తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఇటీవల సీఎంకే నోటీసులిచ్చిన శంకరయ్య
వివేకా కేసు దర్యాప్తు సక్రమంగా చేయలేదని శంకరయ్యపై అభియోగాలు
కర్నూలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన రోజు సాక్ష్యాలు చెరిపేసినా వారించలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యపై పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శంకరయ్య ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో వివేకానందారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. హత్యాస్థలిలో రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నా.. సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్నా అక్కడే ఉన్న శంకరయ్య అడ్డుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు బహిరంగ వేదికలపై ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లోనూ, కలెక్టర్లు, ఎస్పీల సదస్సుల్లోనూ శాంతి భద్రతలపై సమీక్షించే సమయంలో ఈ కేసును ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కగిలించాయంటూ శంకరయ్య సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం.. 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా.. లేదంటే వివరణ ఇవ్వకపోయినా.. రూ.1.45 కోట్లకు కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడం తెలిసిందే. ఓ సీఐ స్థాయి అధికారి ఏకంగా సీఎంకు లీగల్ నోటీసులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కమిటీ విచారణకు రాకుండా..
వివేకా హత్య జరిగిన రోజు సీఐ శంకరయ్య విధులు సక్రమంగా నిర్వర్తించలేదని, కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదని అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ శంకరయ్యను అప్పట్లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2020 జూలైలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. వివేకా హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య నాడు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపకుండా, మృతదేహంపై గాయాలున్నాయని కూడా ఎవరికీ చెప్పకూడదంటూ తనను భయపెట్టారనీ ఆయన అందులో తెలిపారు. తీరా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ ఆయన తప్పించుకున్నారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే (2021 అక్టోబరు 6న) ఆయనపై సస్పెన్షన్‌ను నాటి జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ అప్పట్లోనే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా విచారణ కమిటీని నియమించింది. అయితే ప్రస్తుతం వేకెంట్ రిజర్వ్ (వీఆర్)లో ఉన్న శంకరయ్య.. దాని ముందు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులిచ్చారు.