Share News

Medical Alert: గుంటూరులో నాలుగు కలరా కేసులు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:52 AM

భయపడినట్టే గుంటూరులో కలరా నిర్ధారణ అయింది..! జిల్లాలో సోమవారం నాలుగు కలరా కేసులు బయటపడ్డాయి. ఇందులో గుంటూరు నగరంలో...

Medical Alert: గుంటూరులో నాలుగు కలరా కేసులు

4 నమూనాల్లో విబ్రియో బ్యాక్టీరియా, 16 నమూనాల్లో ఈ.కోలి

గుంటూరు మెడికల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): భయపడినట్టే గుంటూరులో కలరా నిర్ధారణ అయింది..! జిల్లాలో సోమవారం నాలుగు కలరా కేసులు బయటపడ్డాయి. ఇందులో గుంటూరు నగరంలో మూడు, తెనాలిలో ఒకటి ఉన్నాయి. గుంటూరులో ఐదు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 146 మంది డయేరియా బారినపడ్డారు. వీరంతా గుంటూరు జీజీహెచ్‌తో పాటు ప్రైవేటు వైద్యశాలల్లో చేరారు. ఇప్పటి వరకు 62 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగుల నుంచి 114 నమూనాలను సేకరించి గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా సోమవారం 91 నమూనాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మూడు నమూనాల్లో ‘విబ్రియో కలరే’ బ్యాక్టీరియా, 16 నమూనాల్లో ఈ.కోలి బ్యాక్టీరియా, ఒకదానిలో షిగెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. 71 నమూనాల్లో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలింది. తెనాలి మండలం అంగలకుదురులో ఒక యువతి కలరా బారినపడినట్టు ప్రైవేటు వైద్యశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది.

పాత గుంటూరులో ఇంటింటి సర్వే..

కలరా వేగంగా వ్యాపించే అంటువ్యాధి కావడంతో అధికార యంత్రా ంగం అప్రత్తమైంది. వైద్యఆరోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ హుటాహుటిన గుంటూరు కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కలరా ప్రబలిన పాతగుంటూరు బాలాజీ నగర్‌ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. గుంటూరులో ప్రబలిన కలరాకు కలుషిత నీరే ప్రధాన కారణమని భావిస్తున్నారు. వర్షాల కారణంగా నీరు కలుషితమై ఉంటుందని, ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యవర్గాలు విజ్ఞప్తి చేశాయి.

Updated Date - Sep 23 , 2025 | 05:54 AM