Share News

చీకట్లో చకచకా!

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:25 AM

జక్కంపూడిలో మళ్లీ అక్రమ తవ్వకాలు ఆరంభమయ్యాయి. వడ్లకొండను రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తవ్వుకున్న మాఫియానే మళ్లీ రంగంలోకి దిగి లారీల్లో భారీగా గ్రావెల్‌ను తరలించుకుపోతోంది. స్థానికులు అడ్డుకున్న లెక్కచేయకుండా ముందుకు సాగుతోంది. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చీకట్లో చకచకా!

- జక్కంపూడి వడ్లకొండపై గ్రావెల్‌ మాఫియా కన్ను

- రాత్రి వేళ యథేచ్ఛగా తవ్వకాలు

- లారీల్లో భారీగా గ్రావెల్‌ తరలింపు

- అడ్డుకున్న స్థానికులు.. లెక్కచేయని అక్రమార్కులు

- జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

జక్కంపూడిలో మళ్లీ అక్రమ తవ్వకాలు ఆరంభమయ్యాయి. వడ్లకొండను రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తవ్వుకున్న మాఫియానే మళ్లీ రంగంలోకి దిగి లారీల్లో భారీగా గ్రావెల్‌ను తరలించుకుపోతోంది. స్థానికులు అడ్డుకున్న లెక్కచేయకుండా ముందుకు సాగుతోంది. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి గ్రామంలోని సర్వే నెంబర్‌ 88లో వడ్లకొండ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వడ్లకొండను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేశారు. కోట్లాది రూపాయల మట్టిని దర్జాగా తరలించుకుపోయారు. అప్పట్లో మైనింగ్‌, రెవెన్యూ, ఫారెస్ట్‌, ఇరిగేషన్‌ వంటి అధికార వ్యవస్థలన్నీ కూడా అక్రమార్కులకు సహకరించటంతో.. హద్దూ, అదుపు లేకుండా తవ్వకాలు జరిగిపోయాయి. గతేడాది బుడమేరుకు వరదలు వచ్చిన సమయంలో కురిసిన వర్షాల కారణంగా ఈ వడ్లకొండలో కొంత భాగం గ్రావెల్‌ పెళ్లలు విరిగి పడ్డాయి. ఈ గ్రావెల్‌ పెళ్లలను కూడా వైసీపీ హయాంలో తవ్వుకున్న అక్రమార్కులే రాత్రికి రాత్రి తరలించి సొమ్ము చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో అక్రమ సంపాదనకు అవకాశం లేకపోవటంతో అక్రమార్కులు అదనుచూసి మళ్లీ ఇప్పుడు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. వడ్లకొండను లక్ష్యంగా చేసుకుని గ్రావెల్‌ను తన్నుకుపోతున్నారు. ఇప్పుడు కూడా మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ వంటి వ్యవస్థలను అడ్డుపెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. రాత్రికి రాత్రి పెద్ద సంఖ్యలో ప్రొక్లెయిన్లతో గ్రావెల్‌ను తవ్విస్తున్నారు. తవ్విన మట్టిని పెద్ద లారీల్లో తరలిస్తున్నారు. స్థానికులు అడ్డుకున్నా కూడా తగ్గేది లేదంటూ తవ్వేస్తున్నారు. దీంతో గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైలవరం మండలం వెలగలేరు, జీ కొండూరు మండలం చేగిరెడ్డిపాడు రెవెన్యూ పరిధిలో కూడా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి.

Updated Date - Jul 02 , 2025 | 01:25 AM