Share News

I Did What Elders Told Me: పెద్దాయన చెప్పిందే చేశా!

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:43 AM

కల్తీ నెయ్యి కేసు నిందితుడు కడూరు చిన్న అప్పన్న కస్టడీ విచారణలో రెండో రోజు కూడా డొంక తిరుగుడు సమాధానాలే ఇచ్చాడు. పెద్దాయన ఏమి చెబితే అదే చేశానంటూ విచారణ సందర్భంగా చెప్పాడని తెలిసింది. చిన్న అప్పన్న పలు సందర్భాలలో....

I Did What Elders Told Me: పెద్దాయన చెప్పిందే చేశా!

  • నెయ్యి కల్తీతో నాకేంటి సంబంధం?

  • అది చూసుకోవాల్సింది టీటీడీ అధికారులు

  • నా సేవలకు మెచ్చి కొందరు డబ్బులిచ్చారు

  • సిట్‌ విచారణలో చిన్న అప్పన్న డొంక తిరుగుడు సమాధానాలు

  • పెద్దాయన పేరు మాత్రం వెల్లడించని నిందితుడు

తిరుపతి/తిరుపతి (నేరవిభాగం), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసు నిందితుడు కడూరు చిన్న అప్పన్న కస్టడీ విచారణలో రెండో రోజు కూడా డొంక తిరుగుడు సమాధానాలే ఇచ్చాడు. ‘పెద్దాయన’ ఏమి చెబితే అదే చేశానంటూ విచారణ సందర్భంగా చెప్పాడని తెలిసింది. చిన్న అప్పన్న పలు సందర్భాలలో ‘పెద్దాయన’ ప్రస్తావన తెచ్చాడని, అయితే ఆ పెద్దాయన ఎవరనేది మాత్రం వెల్లడించలేదని సమాచారం. మంగళవారం సిట్‌ విచారణలో టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను రోజంతా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్‌ అధికారుల ప్రశ్నలకు చిన్న అప్పన్న సరైన సమాధానాలు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశాడు. తాను పెద్దాయనకు పీఏనని, నెయ్యి కల్తీ జరిగిందా? లేదా? అన్నదానితో తనకేం సంబంధం అని ప్రశ్నించాడు. కల్తీ నెయ్యిని అనుమతించడం అనేది తమకు సంబంధం లేని విషయమని, నెయ్యి నాణ్యమైందా? కాదా? అనేది పెద్దాయనకు ఎలా తెలుస్తుందన్నాడు. నాణ్యత గురించి చూసుకోవాల్సింది టీటీడీ అధికారులేనని, ఏదైనా జరిగిఉంటే సంబంధిత విభాగాల అధికారులు, ఉద్యోగులే బాధ్యులన్నాడు. అయితే గత ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రమణ్యంతో తనకు పరిచయం ఉన్నట్లు అంగీకరించాడు.

ఖాతాల్లో డబ్బులు ముడుపులేనా?

ఢిల్లీ ఏపీ భవన్‌లో పనిచేసినపుడు పెద్దాయన చెప్పిన వారికి బస వంటి అవసరమైన సదుపాయాలు కల్పించేవాడినని చిన్న అప్పన్న వెల్లడించాడు. అయితే ఎవరెవరికి సదుపాయాలు కల్పించిందీ మాత్రం చెప్పలేదు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నెయ్యి సరఫరా ముడుపులే కదా అని ప్రశ్నించగా.. పెద్దాయన చెప్పిన వారికి ఏపీ భవన్‌లో సదుపాయాలు కల్పించినపుడు వారు తన సేవలకు మెచ్చి డబ్బు ఇచ్చేవారని, ఆ డబ్బు తన ఖాతాల్లో దాచుకున్నానని వివరించాడు. తనకు వ్యక్తిగతంగా పది వరకూ బ్యాంకు ఖాతాలున్నాయని తెలిపాడు. తెలుగుతో పాటు ఇంగ్లిష్‌, హిందీ, కన్నడ, తమిళం వంటి భాషలు తనకు తెలుసునని చెప్పాడు.

పదే పదే ప్రశ్నించినా..

సిట్‌ విచారణలో పలు సందర్భాల్లో పెద్దాయన ప్రస్తావన తెచ్చిన చిన్న అప్పన్న పెద్దాయన పేరు మాత్రం వెల్లడించలేదు. పెద్దాయన ఎవరు? పేరేమిటి? అని సిట్‌ అధికారులు తరచితరచి ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. అలాగే ముడుపులపై, బ్యాంకు ఖాతాలపై, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రమేయంపై ప్రశ్నలకు సమాధానాలు దాటవేశాడు. కాగా, ఐదు రోజుల కస్టడీలో ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయాయి. చిన్న అప్పన్న నుంచీ దర్యాప్తునకు ఉపకరించే చెప్పుకోదగ్గ సమాచారమేదీ సిట్‌ రాబట్టలేకపోయింది. కస్టడీ గడువు ఈనెల 21తో ముగియనుంది. ఆలోపు చిన్న అప్పన్ను నుంచి నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరన్నది రాబట్టాల్సి వుంది. చిన్న అప్పన్న ఇచ్చే సమాచారం ఆధారంగానే వైవీ సుబ్బారెడ్డిని విచారించాలని సిట్‌ భావిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Nov 19 , 2025 | 05:43 AM