Share News

Chinna Appanna Key Suspect: వైవీ వద్ద నమ్మకంగా.. ఉంటూ..

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:41 AM

టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న పెద్ద ముదురని కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకూ ఆయనను కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు....

Chinna Appanna Key Suspect: వైవీ వద్ద నమ్మకంగా.. ఉంటూ..

  • వైసీపీ హయాంలో ఢిల్లీ కేంద్రంగా బడా దందాలు

  • ‘భోలేబాబా’తో చిన్నఅప్పన్న బేరాలు

  • ఒప్పుకోనందునే నెయ్యి శాంపిల్స్‌ ల్యాబ్‌కు

  • ‘ప్రీమియర్‌’ నుంచి హవాలా మార్గంలో 50 లక్షలు వసూలు.. అప్పన్నను లోతుగా విచారిస్తున్న సిట్‌

  • బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

తిరుపతి/తిరుపతి (నేరవిభాగం), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న పెద్ద ముదురని కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకూ ఆయనను కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతించిన నేపఽథ్యంలో సిట్‌ అధికారులు నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి చిన్న అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తిరుపతి చేరుకుని రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ధ్రువీకరించడంతో నేరుగా సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణలో వైవీ సుబ్బారెడ్డికి చిన్నఅప్పన్న ఎలా పరిచయమయ్యారు...అంతకుముందు ఏం చేసేవారు....వైవీతో పరిచయానికి ముందు, తర్వాత ఆయన ఆస్తుల స్థాయి ఏమిటనే అంశాలపై సిట్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు, విశాఖ పరిసరాల్లో ఆస్తులు ఎలా సమకూరాయన్న ప్రశ్నకు తనకు అంత స్థోమత లేదని చిన్న అప్పన్న సమాధానమిచ్చినట్టు తెలిసింది. అంత స్థోమత లేనప్పుడు ఇన్ని వ్యవహారాలు ఎలా నడిపావని, టీటీడీకి నెయ్యి సరఫరాచేసే డెయిరీల డైరెక్టర్లు, వారి కుటుంబసభ్యులు, వారి ఫోన్‌ నంబర్లు ఎలా తెలిశాయంటూ సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. నెయ్యి సరఫరా వ్యవహారం వెనుక చాలా మంది ఉన్నారని, తనను పావుగా వాడుకున్నారని చిన్న అప్పన్న సమాధానమిచ్చినట్టు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా తాను ఏ పనీ చేయలేదని చెప్పినట్టు సమాచారం.


వైవీ వద్ద పనివాడిగా చేరి.... ఢిల్లీలో రాజభోగాలు

హైదరాబాద్‌లో ఓ అధికారి చిన్న అప్పన్నను వైవీ సుబ్బారెడ్డికి పరిచయం చేశారని తెలుస్తోంది. ‘నమ్మకంగా ఉంటాడు... దగ్గర పెట్టుకోండి’ అని సిఫారసు చేసినట్టు తెలిసింది. అలా వైవీ వద్ద చేరిన చిన్న అప్పన్న 2014-19 నడుమ ఆయన చెప్పే పనులు చేసేవారని సమాచారం. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో చిన్న అప్పన్న స్థాయి అమాంతం పెరిగినట్టు సిట్‌ గుర్తించింది. ముఖ్యంగా ఆ ఐదేళ్లూ ఢిల్లీ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి తరఫున పెద్దపెద్ద పనులు చేశారని తెలుస్తోంది. 2019-24 మధ్య ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎ్‌సడీ కమ్‌ స్పెషల్‌ లైజన్‌ ఆఫీసర్‌ హోదాలో చిన్న అప్పన్నను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రొటోకాల్‌ వాహనం, బంగ్లా, విమాన చార్జీలు... ఇలా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాజభోగాలు అనుభవించినట్టు సిట్‌ గుర్తించింది. నాలుగేళ్లలో ఇతర సదుపాయాలు కాకుండా కేవలం వేతనం కింద రూ.64 లక్షలదాకా ఆయన ఖాతాలో జమ అయినట్టు సమాచారం. ఢిల్లీలోనే కాకుండా చెన్నై, తిరుపతి... ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్‌ వాహనం ఉపయోగించేవారని, ఎక్కువ హడావిడి చేసేవారని సమాచారం. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలు, పరిమాణం, ధరలు వంటి వివరాలన్నింటినీ అప్పటి టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎం ఒకరు చిన్నఅప్పన్నకు అందజేసినట్టు సిట్‌ గుర్తించింది. 2019 నుంచి 2023వరకూ ఆ విభాగానికి జీఎంగా సుబ్రమణ్యం పనిచేశారని, ఆయనే 2022 ఏప్రిల్‌లో టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న డెయిరీల పేర్లు, వాటి తయారీ సామర్థ్యం, టీటీడీకి సరఫరా చేస్తున్న పరిమాణం, టెండర్ల గడువు, నెయ్యి ధరల సమాచారాన్ని చిన్నఅప్పన్నకు అందజేసినట్టు సిట్‌ గుర్తించింది.

తిరుపతికి భోలేబాబా ప్రతినిధిని రప్పించి..

అప్పటి టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం నుంచి సమాచారాన్ని సేకరించిన చిన్న అప్పన్న, ఆ మరుసటి నెలలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న డెయిరీలలో ఒకటైన భోలేబాబా డెయిరీ అధికారిక ప్రతినిధి కైలేశ్‌ చాంద్‌మాంగ్లాను సంప్రదించినట్టు సమాచారం. ఆయనను తిరుపతికి పిలిపించి కమీషన్ల గురించి బేరసారాలు ఆడినట్టు సమాచారం. ఆ తర్వాత చిన్న అప్పన్న ఫోన్‌ చేసి ఆరా తీయగా, తమ యజమానులు కమీషన్‌ ఇవ్వడానికి అంగీకరించలేదని కైలేశ్‌ చెప్పారని, దాంతో చిన్న అప్పన్న నేరుగా పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లకే ఫోన్‌ చేసి మాట్లాడినట్టు తెలిసింది. అయితే పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌ కూడా కమీషన్‌ చెల్లించడానికి ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అదే ఏడాది ఆగస్టులో భోలేబాబా నెయ్యి శాంపిల్స్‌ మైసూరు ల్యాబ్‌కు పంపారు. ఎక్కువ శాతం రసాయనాలతో నెయ్యి తయారు చేశారంటూ రిపోర్టు వచ్చింది. దాన్ని అడ్డుపెట్టుకుని భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేసినట్టు తెలిసింది. ఆ తర్వాత చిన్న అప్పన్న ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ డెయిరీతో సంప్రదింపులు జరిపి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు వారికి దక్కేలా చేశారని, దానికి ప్రతిఫలంగా హవాలా మార్గంలో ఒకసారి రూ.20 లక్షలు, మరోసారి రూ.30 లక్షలు చొప్పున చిన్న అప్పన్నకు మొత్తం రూ.50 లక్షలు అందినట్టు సిట్‌ గుర్తించింది.


కోర్టులో చిన్న అప్పన్నకు చుక్కెదురు

చిన్న అప్పన్న బెయిల్‌ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు సోమవారం కొట్టివేసింది. కల్తీ నెయ్యి సరఫరాలో చిన్న అప్పన్నదే కీలకపాత్ర అని సిట్‌ బృందం, ఏపీపీ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో ఏ 24 నిందితుడిగా ఉన్న చిన్న అప్పన్నను గత నెల 29న సిట్‌ అరెస్టు చేసింది. అదే రోజు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించడంతో నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. గత నెల 30న చిన్న అప్పన్నకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది యుగంధర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఈనెల 12న కోర్టులో ఇరుపక్షాలూ తమ వాదనలు వినిపించాయి. సిట్‌ తరపున ఏపీపీ జయశేఖర్‌ వాదనలు వినిపించారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించారని, కేసు దర్యాప్తు కీలకదశలో ఉన్న ప్రస్తుత తరుణంలో బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను, ఇతర అంశాలను ప్రభావితం చేసే ప్రమాదముందని కోర్టును అభ్యర్థించారు.

Updated Date - Nov 18 , 2025 | 06:38 AM