Share News

అటకెక్కిన బాలల బీమా!

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:15 AM

బాలల భవితకు భరోసా కరువైంది. ఆడి పాడే వయస్సులో దురదృష్టవశాత్తు చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి జీవితాలకు అండగా నిలిచే బాలల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 52,960 మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థి ఏడాదికి కేవలం రూ.5 చెల్లించి రూ.లక్ష బీమా సౌకర్యం పొందేవారు. 11 ఏళ్లుగా ఈ పథకం అమలుకు నోచుకోవడంలేదు.

అటకెక్కిన బాలల బీమా!

- 2009లో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

- ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.5 వసూలు

- ప్రమాదంలో మరణిస్తే రూ.లక్ష సాయం

- అంగవైకల్యం సంభవిస్తే రూ.75 వేలు

- గాయపడితే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం

- 11 ఏళ్లుగా అమలుకు నోచుకోని పథకం

- విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టి సారించాలని తల్లిదండ్రుల వినతి

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

బాలల భవితకు భరోసా కరువైంది. ఆడి పాడే వయస్సులో దురదృష్టవశాత్తు చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి జీవితాలకు అండగా నిలిచే బాలల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 52,960 మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థి ఏడాదికి కేవలం రూ.5 చెల్లించి రూ.లక్ష బీమా సౌకర్యం పొందేవారు. 11 ఏళ్లుగా ఈ పథకం అమలుకు నోచుకోవడంలేదు.

బాలలకు భరోసా కోసం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంక్షేమ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బాలల బీమా పథకాన్ని 2009లో ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో బీమా పథకం కోసం విద్యార్థు నుంచి పాఠశాల ప్రారంభంలో నగదు వసూలు చేసేవారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం ఈ పథకం ఊసేలేదు. ఏడాదికి అతి తక్కువ ప్రీమియంతో ప్రమాదాల్లో క్షతగాత్రులైన, మరణించిన చిన్నారులకు, వారి కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక ఆసరా కల్పించేది.

ఏడాదికి రూ.5 చెల్లిస్తే..

ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థుల నుంచి బీమా పథకంలో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.5 చొప్పున వసూలు చేసేవారు. సదరు మొత్తాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రారంభంలో విద్యార్థుల నుంచి వసూలు చేయడం లేదా ఈ మొత్తాన్ని దాతల నుంచి సమకూర్చడం చేసేవారు. అలా వసూలు చేసిన నగదును జిల్లా అధికారులకు చెల్లించేవారు. జిల్లా అధికారులు బీమా సంస్థకు పంపేవారు. విద్యార్థి ప్రమాదానికి గురైన లేదా సహజంగా మరణించినా రూ.లక్ష పరిహారాన్ని బీమా సంస్థ చెల్లించేది. ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే ప్రమాదపు తీవ్రత ఆధారంగా రూ.75 వేలు, గాయపడితే రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు బీమా పరిహారం బాధిత కుటుంబాలకు అందేది.

విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టి సారించాలి

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు బాలల బీమా పథకం ఎంతో ప్రయోజనకరం. 11 ఏళ్ళుగా అటకెక్కిన ఈ పథకంపై విద్యాశాఖ అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. కొందరు అధికారులైతే అసలు ఇటువంటి పథకం ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నుంచి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు వరం లాంటి బాలల బీమా పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 01:15 AM