Share News

బాల్యానికి.. భరోసా..!

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:00 AM

మంచీ, చెడులను పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి? అనుకుంటున్నారా..?

   బాల్యానికి.. భరోసా..!
ఆనందానికి అవధుల్లేని బాల్యం

హక్కులతో ఆకాంక్షను నేరవేర్చుకునే మార్గం

సక్రమంగా అమలుకు నోచుకొని బాలల హక్కులు

నేడు ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం

ఆత్మకూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మంచీ, చెడులను పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి? అనుకుంటున్నారా..? కానీ సమాజంలో బలహీనులూ, దోపిడికి గురయ్యే వారిలో పిల్లలూ ఉన్నారు. పిల్లల స్వేచ్చను దోచుకునే పెద్దలున్న చోట వారి కోసం హక్కులుండటం తప్పనిసరి. దీంతో బాల్యానికి బలమైన శక్తిని చేకూర్చలన్న సంకల్పంతో ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల కోసం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. చైల్డ్‌రైట్స్‌ కన్వెన్షన్‌ (సీఆర్‌సీ)గా పేర్కొనే ఈ ఒప్పందం గురించి అందులో పేర్కొన్న హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి ప్రతిఏటా నవంబరు 20వ తేదిన ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో బాలల రక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రతిఏటా ఓ నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘నారోజు.. నాహక్కులు’ అనే నినాదాన్ని ఎంపిక చేశారు.

బాలల హక్కులు ఇవే

భారత రాజ్యాంగం 18ఏళ్లలోపు బాలలందరికి పలు హక్కులను కల్పించింది. సమానత్వం, కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లను చూపరాదు. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి ఉండటం, తల్లిదండ్రులతో కలిసి జీవించడం బాలల హక్కు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, వ్యభిచార వృత్తిలో దించడం, జీతాలకు పెట్టడం నేరం. అలాగే బాలలు వారి అభిప్రాయాలను పాటలు, బొమ్మలు, ఆటలు, రచనల ద్వారా వ్యక్తం చేయవచ్చు. బాలలు తమకు నచ్చిన మతాన్ని కలిగి వుండవచ్చు. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశుసంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్లినట్లయితే ఆ బాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా, దౌర్జన్యం చేసినా, వేధించినా నేరమే. శరణార్థులుగా మారిన బాలలకు మానవత్వంతో సాయం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఎంతైనా ఉంది. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన వారి వృధ్దికి వారిలో ఆత్మవిశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఉచిత నిర్భంధ విద్యను పొందడం బాలల హకు. ప్రమాదకరమైన పనులు, గనుల్లో, పేలుడు పదార్థాల తయారీలో, హోటళ్లలో బాలల్ని పనిలో వుంచుకోరాదు. మాదకద్రవ్యాల నుంచి బాలలను దూరం చేయాలి. బాలల్ని నిర్భంధించరాదు. లైంగిక ఽధూషణ చేయరాదు. 18ఏళ్లలోపు వయస్సు బాలల్ని విడుదల చేయడానికి వీలులేని నేరాలకు ఉరిశిక్ష గాని, యావజ్జీవశిక్ష గాని విధించరాదు.

బాల కార్మికుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానం

బాల కార్మికుల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో వున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రోజుకు 6గంటలు పనిచేసే 6నుంచి14ఏళ్ల మధ్య ఉన్న బాల కార్మికులు సుమారు 70వేల మంది వరకు ఉన్నట్లు తెలిసింది. అలాగే మరో 30వేల మందికి పైగా బడిబయట పిల్లలుగా ఉన్నట్లు గుర్తించారు. కాగా ప్రత్యేకించి ఎమ్మిగనూరు మండలం బాలకార్మికులు ఎక్కువ ఉన్న మండలంగా గుర్తింపు ఉంటే ఆ తర్వాతి స్థానాలను నందవరం, హోళగుంద, కొసిగి, గోనెగండ్ల, దేవనకొండ, పెద్దకడబూరు మండలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పిల్లల్ని బడికి పంపించాలి

- వెంకటేష్‌, ఉపాధ్యాయుడు, కొట్టాలచెరువు గ్రామం, ఆత్మకూరు మండలం.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి పిల్లల్ని బడికి పంపించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. అలాంటప్పుడే బాలల హక్కులను కాపాడవచ్చు. తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను గుర్తించి పిల్లల్ని పాఠశాలలకు పంపాలి. ప్రభుత్వం కూడా పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. కొట్టాలచెరువు గ్రామంలో గతంలో డ్రాపౌట్స్‌ అధికంగా ఉండేవి. కానీ పిల్లల తల్లిదండ్రులకు విద్య పట్ల అవగాహన కల్పించి గ్రామంలోని విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ప్రయత్నం చేసి వందశాతం జీఈఆర్‌ను సాధించడం జరిగింది.

Updated Date - Nov 20 , 2025 | 12:00 AM