Child Trafficking: అంగట్లో బాల్యం
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:10 AM
ఢిల్లీ, ముంబై నుంచి చిన్నారులను కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.
ఢిల్లీ, ముంబైల నుంచి తెచ్చి అమ్ముతున్నారు!
పసి మొగ్గలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు
ఐదుగురు బాలలను రక్షించిన టాస్క్‌ఫోర్స్
నిందితులపై పీడీ యాక్ట్: విజయవాడ సీపీ
విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ, ముంబై నుంచి చిన్నారులను కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వివరాలను పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీ సరిత, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీలు లతాకుమారి, దుర్గారావు, స్రవంతిరాయ్‌తో కలిసి గురువారమిక్కడ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. విజయవాడ భవానీపురం సితార సెంటర్‌కు చెందిన బగళం సరోజిని అలియాస్ బలగం సరోజిని చిన్నారులను కొనుగోలు చేసి సంతానం లేని దంపతులకు విక్రయించడంలో దిట్ట. ఢిల్లీ, ముంబైలలో ఒక్కో చిన్నారిని రూ.లక్షకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రూ.24-28 లక్షలకు విక్రయిస్తోంది. విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లాలో శిశువులను విక్రయిస్తుండగా ఈ ఏడాది మార్చిలో ఇక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు చిన్నారులను స్వాధీనం చేసుకుని సంరక్షణ కేంద్రాలకు పంపారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న సరోజిని గడచిన నెలలో బెయిల్‌పై విడుదలైంది. బయటికి రాగానే మళ్లీ శిశువుల కొనుగోలు, అమ్మకాలు మొదలుపెట్టింది. శిశువులను విక్రయించే ఉత్తరాది ముఠాను సంప్రదించింది. ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భారతి, ముంబైకి చెందిన సతీశ్, కవిత, సూరి నుంచి ఐదుగురు శిశువులను కొనుగోలు చేసింది. నలుగురు ఆడ శిశువులు, ఒక మగ శిశువును కొనుగోలు చేసి భవానీపురం, నున్న, కొత్తపేటలో ఉన్న ముఠా సభ్యులకు అప్పగించింది. ఒక శిశువును ఖమ్మంలోని సత్తుపల్లిలో ఉన్న బ్రోకర్‌కు అప్పగించింది. బుధవారం తెల్లవారుజామున భవానీపురంలో ఒక ఇంటి వద్దకు శిశువులను తీసుకెళ్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి సరోజినిని అదుపులోకి తీసుకోగా.. ముఠా గుట్టు బయటపడింది. సరోజినితోపాటు గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మి, కుమ్మరిపాలేనికి చెందిన మాజీ ఆశ వర్కర్ వాడపల్లి బ్లెస్సీ, ముక్తిపేట నందిని, షేక్ బాబా వలీ, ఆమదాల మణి, షేక్ ఫరీనా, ఐరి వంశీ కిరణ్‌కుమార్, శంక యెహాన్, పతి శ్రీనివాసరావును అరెస్టు చేశారు. వారి నుంచి ఐదుగురు శిశువులను, రూ.3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్న సరోజినితోపాటు నందిని హైదరాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులుగా ఉన్నారు. సరోజిని నాలుగేళ్లకు పైగా ఇలా శిశు విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సరోజిని, విజయలక్ష్మి, బ్లెస్సీ, నందిని, బాబావలిపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో, మణి, ఫరీనా, వంశీ కిరణ్‌కుమార్‌పై నున్న పోలీస్ స్టేషన్‌లో, యెహాన్, శ్రీనివాసరావుపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లోకేసులు నమోదు చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో త్వరితగతిన కేసుల విచారణ సాగేలా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.