AP Government: చైల్డ్‌కేర్ లీవ్‌లు ఎప్పుడైనా వాడుకోవచ్చు
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:19 AM
రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చైల్డ్‌కేర్ లీవ్‌లను ఉద్యోగ విరమణలోగా ఎప్పుడైనా వాడుకునే అవకాశం....
ఉద్యోగ విరమణలోగా వినియోగించుకునే అవకాశం
మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చైల్డ్‌కేర్ లీవ్‌లను ఉద్యోగ విరమణలోగా ఎప్పుడైనా వాడుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మహిళా ఉద్యోగులతోపాటు, ఒంటరి పురుష ఉద్యోగులకూ దీన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇకపై మహిళా ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోగులు 180 రోజుల చైల్డ్‌కేర్ లీవ్‌లను తమ సర్వీసు పూర్తయ్యేలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే పిల్లల వయస్సు ఎంతైనా సరే, దివ్యాంగ పిల్లల సంరక్షణతో సహా వివిధ అవసరాలకు ఈ సెలవులు వినియోగించుకోవచ్చని తెలిపింది. గతంలో పిల్లల వయస్సు 18 ఏళ్లు (దివ్యాంగులైన పిల్లల సంరక్షణకు 22 ఏళ్లు) దాటితే చైల్డ్‌కేర్ లీవ్‌లు వాడుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిమితిని ప్రభుత్వం ఎత్తివేసింది. ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ సెలవుల వినియోగంపై హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా చైల్డ్‌కేర్ లీవ్‌లు వాడుకునే వెసులుబాటు కల్పించడంపై మహిళా ఉద్యోగులు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు హర్షం వ్యక్తం చేశారు.