Urban SI Suspension: చిలకలూరిపేట అర్బన్ ఎస్‌ఐపై వేటు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:24 AM
చిలకలూరిపేట అర్బన్ ఎస్‌ఐ రహంతుల్లాను సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
‘బైపాస్’ గ్యాంగ్‌కు అన్ని విధాలా రహంతుల్లా అండ
సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు
చిలకలూరిపేట, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట అర్బన్ ఎస్‌ఐ రహంతుల్లాను సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన ఏఎ్‌సఐ కుమారుడు, అతడి గ్యాంగ్ చేసే అక్రమ వసూళ్లకు అండగా ఉండడమే కాక, ఆ గ్యాంగ్‌కు పూర్తిస్థాయిలో సహకరించినట్టు తేలడంతో రహంతుల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ గ్యాంగ్ దొంగిలించిన నాలుగు కార్లను రహంతుల్లా కుటుంబసభ్యులు, సన్నిహితులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వీటిలో రెండింటిని ఈ బైపాస్ గ్యాంగ్ నిత్యం వాడుతూ రోడ్లపై రవాణాశాఖ అధికారుల పేరుతో లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. గ్యాంగ్ సభ్యులతో నిత్యం సమాచారం పంచుకుంటూ, వారి ఆగడాలకు అడ్డు లేకుండా ఎస్‌ఐ రహంతుల్లా వ్యవహరించినట్టు గుర్తించారు. ఇంతకాలం ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం రాకపోవడం చర్చనీయాంశంగా ఉంది. ప్రమాదంలో విద్యార్థులు మృతిచెందిన ఘటన తర్వాత మాత్రమే ఎస్‌ఐ రహంతుల్లా ప్రమేయం వెలుగులోకి వచ్చింది. కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పోలీసు శాఖలో అంతర్గత నిఘా వైఫల్యనికి అద్దం పడుతోంది.