Share News

CM Chandrababu: నెలలో ఫ్రీ హోల్డ్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:01 AM

ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇక ఎదురుచూసే పరిస్థితి లేదు. ఫ్రీ హోల్డ్‌ అసైన్డ్‌ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

CM Chandrababu: నెలలో ఫ్రీ హోల్డ్‌

  • ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే: సీఎం

  • ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు

  • ఇక ఎదురుచూసే పరిస్థితి లేదు

  • ఇంకా ఎంత సమయం నాన్చుతారు?

  • రెవెన్యూపై సమీక్షలో సీఎం అసహనం

  • సాయిప్రసాద్‌కు ‘ఫ్రీ హోల్డ్‌’ బాధ్యత

  • 2027 డిసెంబరు నాటికి రీ సర్వే పూర్తి

  • రిజిస్ట్రేషన్ల ఆదాయం 10 వేల కోట్లు పెరగాలి

  • జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం జేసీలదే

  • జేసీల పనితీరుకు ఇదే కొలమానం

  • ఇక ప్రతి నెలా రెవెన్యూపై సమీక్షిస్తా

  • భూ కబ్జా నిరోధక చట్టం బిల్లుపై

  • కేంద్రంతో సంప్రదింపులు: చంద్రబాబు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనం ‘రెవెన్యూ రాంగ్‌ రూట్‌’

  • అంశాలను భేటీలో ప్రస్తావించిన సీఎం

అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇక ఎదురుచూసే పరిస్థితి లేదు. ఫ్రీ హోల్డ్‌ అసైన్డ్‌ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి రెండు నెలల సమయం పడుతుందా? అని ప్రశ్నించగా, ఒక్క నెలలో సెటిల్‌ చేస్తామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ నివేదించారు. దీంతో నెలరోజుల్లోగా ఫ్రీహోల్డ్‌ అసైన్డ్‌ భూములపై స్పష్టత ఇవ్వాలని, సబ్‌కమిటీకి ఇదే చివరి అవకాశమని సీఎం స్పష్టం చేశారు. నెలరోజుల్లోగా తేల్చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కూడా తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం అనగాని నేతృత్వంలోని మంత్రివర్గ ఉపపంఘం సచివాలయంలో భేటీ కానుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించారు. మంగళవారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనగాని సత్యప్రసాద్‌, ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి. సాయుప్రసాద్‌, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘రెవెన్యూ రాంగ్‌ రూట్‌’ శీర్షికతో ’ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తలో ప్రస్తావించిన ప్రజా ఫిర్యాదులు, ఫ్రీహోల్డ్‌ భూములు, 22(ఏ) అంశాలు, ఇంకా కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న భూ కబ్జా నిరోధక చట్టం-2024కు సంబంధించిన బిల్లు వంటి కీలక విషయాలపై సీఎం ఆరా తీశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం....రెవెన్యూలో ఉన్న అనేకానేక అంశాలపై సాయుప్రసాద్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్‌ భూముల అంశం చర్చకొచ్చినప్పుడు సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసైన్డ్‌ భూములకు సంబంధించి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవీ


  • మున్సిపల్‌ ప్రాంతాల పరిధిలో అసైన్డ్‌ భూములను కే టాయించిన కేసుల్లో 250 చదరపు గజాల వరకు బేసిక్‌ విలువలో 50 శాతం ధరకు క్రమబద్ధీకరించాలి.

  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములు దురాక్రమణకు గురయితే ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం-1977 (పీఓటీ) ప్రకారం చర్యలు తీసుకోవాలి.

  • అక్వాసాగులో ఉన్న రైతులు తమ భూముల వెంటే ఉన్న ప్రభుత్వ భూమి లేదా అసైన్డ్‌ భూమిని సాగులో కలుపుకుంటే , ఆ భూమి విస్తీర్ణం తక్కువగా ఉంటే, వెంటనే గుర్తించి స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలి. ఒకవేళ కబ్జాకు గురయిన భూమి పెద్ద విస్తీర్ణంలో ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలి.

  • అనంతపురంతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న బంజరు భూములు 1954కు ముందే రిజిస్టర్‌ ఆఫ్‌ హోల్డింగ్స్‌ పరిధిలో ఉండి, వాటిపై అనేక లావాదేవీలు ఇప్పటికే జరిగి ఉంటే, ఆ భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించాలి.

  • రాష్ట్రంలో 1999 వరకు రైతు సహకార సొసైటీలు రుణాల కోసం అసైన్డ్‌ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నాయి. సొసైటీలు రుణాలు చెల్లించని పక్షంలో కోర్టు ఆదేశాలతో ఆ భూములను వేలం వేశారు. వేలం వేసిన భూములను ఇప్పటికీ 22(ఏ)లో ఉంచారు. వాటిని నిషేధ జాబితా నుంచి తొలగించాలని కోర్టులు అనేక సందర్భాల్లో ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ నేపధ్యంలో వేలం వేసిన భూములను వెంటనే నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించాల్సిందే.


  • ఇనాంలో దేవుడి భూములు మినహా, మిగిలిన సేవల పరిధిలోని భూములపై అమల్లో ఉన్న ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలి. ఇంకా 2013 వరకు అనేక రకాల ఇనాం భూములపై రిజిస్ట్రేషన్లు జరిగాయి. అమల్లో ఉన్న ఉత్తర్వుల ఆధారంగా ఇనాం భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలి.

  • పట్టణ గరిష్ఠ భూపరిమితి(యూఎల్‌సీ) భూములపై నిర్ణయాలను ప్రతీసారి మంత్రివర్గ ఆమోదం కోసం పంపిస్తున్నారు. సీసీఎల్‌ఏ స్థాయిలోనే ఆ నిర్ణయం తీసుకోవాలి.

  • పట్టా భూములను నిబంధనలకు విరుద్దంగా అసైన్‌మెంట్‌ భూములుగా (5,433 ఎకరాలు) చూపించారు. వాటిని ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఇది పూర్తిగా తప్పు. తక్షణమే ఆ భూములను తిరిగి అసైన్డ్‌ జాబితా నుంచి తొలగించి, పట్టా భూములుగా మార్చాలి.

  • కలెక్టర్‌ ఉత్తర్వులు లే కుండానే 64,151 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఈ భూముల విషయంలో రైతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.

  • చుక్కల భూముల పరిధిలో 17,901 ఎకరాల భూమిని లోగడ ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఇవి నిబంధనల ప్రకారమే ఉన్నాయి. కాబట్టి రైతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.

  • రైతులభూముల కొలతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రికార్డు ప్రకారం వారున్న హద్దుల మేరకే విస్తీర్ణం ఖరారు చేయాలి. భూమి తగ్గిందనే పేరిట కొత్త సమస్యలు తీసుకురావొద్దు.

  • 22(ఏ) చిక్కులకు పరిష్కారం

  • నిషేధ భూముల జాబితా విషయంలో రెవెన్యూశాఖ చేసిన పలు ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఆ నిర్ణయాలివే..

  • నిబంధనల మేరకు ఉన్న మాజీ సైనికుల భూములను నిషేధ గడువు ముగిసిన తర్వాత 22(ఏ) జాబితా నుంచి తొలగించాలి.

  • రాష్ట్రంలో 18-06-1954కు ముందు అసైన్‌మెంట్‌ అయిన భూములపై నిర్దిష్ట డాక్యుమెంట్లను పరిశీలించి నిషేధ జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలి.

  • ఆ భూముల వివరాలు రీ సర్వే రికార్డుల్లో చేర్చాలి

  • గ్రామ సర్వీసు ఇనాంలపై కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూశాఖ ఇచ్చిన జీవో 310 ప్రకారం గ్రామ సర్వీసు ఇనాం భూములపై జారీ అయిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయి. కాబట్టి, ఆ పట్టాలు కలిగిన వారు, లేదా వారి వారసులు, ఇంకా వారి నుంచి అధికారికంగా కొనుగోలు చే సిన వారికి హక్కులు ఉంటాయి.

  • అలాంటి భూముల వివరాలను రీ సర్వే రికార్డుల్లో చేర్చాలి. ఇంకా 2013కు ముందే రైత్వారీ పట్టాలు పొందిన భూములను 2023లో ఇచ్చిన జీవో 310 ప్రకారం పునరుద్ధరించారు. కాబట్టి, ఆ పట్టాలున్న భూములను మళ్లీ 22(ఏ)లో పెట్టడానికి వీల్లేదు. ఒక వేళ అలాంటి భూములను రీ సర్వేలో తిరిగి సర్వీస్‌ ఇనాం, ఇనాంగా నమోదు చేసి, వాటిని 22(ఏ) లో పెడితే వెంటనే సరిచేయాలి. అంటే, ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి జీవో 310 ప్రకారం రైత్వారీ పట్టాలుగానే గుర్తించాలి.

  • రైతుల పట్టా భూములను సుమోటోగానే నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించేలా రెవెన్యూ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి.

  • రైతుల సాగు భూమి ఉన్న నిర్దిష్ట భూమిని కాకుండా, మొత్తం సర్వే నంబరు పరిధిలో ఉన్న భూములను నిషేధ జాబితాలో చేర్చినట్టు ఫిర్యాదులున్నాయి. వాటిని వెంటనే సెటిల్‌ చేయాలి.

  • చుక్కల భూములు, అనాధీనం, షరతుగల పట్టా భూములపై చట్టం, నిబంధనల మేరకు రైతులకు హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా లోగడ అనేక ఉత్తర్వులు, ఇదేశాలు ఇ చ్చింది. కానీ జగన్‌ సర్కారు చేపట్టిన రీసర్వే సం దర్భంగా ఆ కేటగిరీ భూములను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చి, నిషేధ జాబితాలో చేర్చా రు. వాటికి నిషేధ విముక్తి కల్పించాలి.


జేసీ నుంచి అధికారాల బదలాయింపు

కీలకమైన రెవెన్యూ అధికారాలు జాయింట్‌ కలెక్టర్‌ వద్దే ఉండటం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయని సీఎం వద్ద రెవెన్యూశాఖ ప్రస్తావించింది. ఈనేపధ్యంలో వెబ్‌ల్యాండ్‌లో కీలక మార్పులు, సవరణలు మినహా మిగిలిన కొన్ని అధికారాలను ఆర్‌డీఓకు, మరి కొన్ని తహసీల్దార్లకు బదలాయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భూమి, దాని అనుబంధ అంశాల్లో పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి లక్షల సంఖ్యలో పిటిషన్లు వచ్చాయి. మ్యుటేషన్‌, పట్టాదారు పాసుపుస్తకాల మీద 1.97 లక్షలు భూమి తీరు, స్వభావ సంబంధిత వివాదాల పరిష్కారం కోరుతూ లక్ష, రీ సర్వే తర్వాత తమ భూమి తగ్గిందని మరో లక్ష, జాయింట్‌ ఎల్‌పీఎమ్‌లపై 2.40 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అధికారులే సీఎంకు నివేదించారు. ఈ గణాంకాలు చూసి సీఎం ఆశ్చర్యపోయారు. ఇన్ని సమస్యలు వస్తుంటే, మీరు చూపించిన పరిష్కారం ఏమిటంటూ సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సాగుతున్న భూముల సర్వేను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జాయింట్‌ ఎల్‌పీఎమ్‌ల సమస్యను సత్వరమే పరిష్కరించాలన్నారు.

రిజిస్ట్రేషన్లతో 10వేల కోట్ల ఆదాయం

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం పెరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.10,169 కోట్ల ఆదాయం తీసుకురావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. మార్కెట్‌ విలువ ఆధారంగా భూమి ధరలు అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెన్త్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా కుల ధృవీకరణ పత్రాల జారీపై సీఎం ఆరాతీశారు. విద్యార్ధుల పదవ తరగతి సర్టిఫికెట్‌ ఆధారంగా కుల ధృవీకరణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.

జేసీలదే బాధ్యత

జిల్లా స్థాయిలో రెవెన్యూశాఖ సమస్యల పరిష్కారంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌లదే నైతిక బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం అనేది జేసీల పనితీరుకు, పోస్టింగ్‌లకు కొలమానంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు, ఈ విషయంలో జేసీలకు స్పష్టమైన మెసేజ్‌ పంపించాలని స్పెషల్‌ సీఎస్‌ను సీఎం ఆదేశించారు.

Updated Date - Dec 10 , 2025 | 04:03 AM