Share News

AP CM Chandrababu Orders: నకిలీ మద్యంపై సిట్‌

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:35 AM

నకిలీ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

AP CM Chandrababu Orders: నకిలీ మద్యంపై సిట్‌

  • త్వరలోనే కుట్ర బయటపడుతుంది: సీఎం

  • ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు

  • నకిలీ గుట్టు తేల్చేలా ఎక్సైజ్‌ సురక్ష యాప్‌

  • ఈనెల 16 నుంచి అందుబాటులోకి

  • ప్రజారోగ్యమే నాకు ముఖ్యం

  • యాచకుల మరణాలనూ ‘నకిలీ’ ఖాతాలో వేస్తున్నారు

  • తప్పుడు ప్రచారం సహించం

  • సీఎం చంద్రబాబు హెచ్చరిక

  • ‘సిట్‌’లో ఏలూరు ఐజీ అశోక్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌

అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదని... భారీ కుట్ర ఉందని తెలిపారు. కుట్రదారులెవరో త్వరలోనే బయటపడుతుందని అన్నారు. ఇందులో దిగ్ర్భాంతికరమైన అంశాలు వెలుగు చూసే అవకాశముందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘ఎక్సైజ్‌ సురక్ష’ పేరుతో కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. మద్యం సీసాపై ఉన్న బార్‌ కోడ్‌ను యాప్‌ ద్వారా స్కాన్‌ చేస్తే ఆ సీసా ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు అన్ని వివరాలు తెలుస్తాయని... కోడ్‌ స్కాన్‌ కాకపోతే అది నకిలీగా నిర్ధారణ అవుతుందని వివరించారు. ఈ యాప్‌ పనిచేసే తీరుపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. మరిన్ని వివరాలు చంద్రబాబు మాటల్లోనే...


గత ప్రభుత్వ పాపం...

నకిలీ మద్యం అనేది కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్య. 2019-24 మధ్య నకిలీ మద్యంప్రారంభమైంది. దాంతోపాటు గంజాయి, డ్రగ్స్‌ కూడా విచ్చలవిడిగా విస్తరించాయి. వాటిపై ఈ ప్రభుత్వం ప్రక్షాళన ప్రారంభించింది. ‘ఈగల్‌’ ద్వారా గంజాయిని నియంత్రించాం. వైసీపీ ప్రభుత్వంలో డిస్టిలరీలను బలవంతంగా లాక్కున్నారు. నచ్చిన బ్రాండ్లు అమ్ముకున్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు లేకుండా చేశారు. వాటన్నిటిపై మేం వచ్చాక విచారణ ప్రారంభించాం. అయినప్పటికీ భయం లేకుండా నకిలీ మద్యమంటూ బరితెగించారంటే దీని వెనుక కుట్ర ఉందని అర్థమవుతోంది. నేరస్ధులు ఎవరైనా సరే, ఎలాంటి ముసుగు కప్పుకొన్నా, ముసుగు తొలగించి కొరడా ఝులిపిస్తాం!


ఈ పరిస్థితి ఇదే తొలిసారి...

నేను సీఎంగా 15ఏళ్లు పూర్తిచేసుకున్నా. 15ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. మొత్తం టీడీపీ ప్రభుత్వం 22ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఎప్పుడూ చూడని వింత ధోరణి ఇప్పుడు కనిపిస్తోంది. 1995 నుంచి ఇప్పటిదాకా నేను సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ నకిలీ మద్యం చూడలేదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు వైసీపీ వల్లే ఆ పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో నాణ్యత లేకపోవడం, ధరలు పెంచడం వల్ల పక్క రాష్ర్టాల మద్యం రాష్ట్రంలోకి వచ్చింది. మేం ఇవన్నీ నియంత్రించాం. ములకలచెరువు ఘటనలో 16 మందిని, ఇబ్రహీంపట్నం ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మా పార్టీకి చెందినా చర్యలు తీసుకున్నాం. ములకలచెరువు నకిలీ మద్యం బయటపెట్టిందే మా ప్రభుత్వం. దాని లోతుల్లోకి వెళ్లేకొద్దీ షాకింగ్‌ విషయాలు తెలుస్తున్నాయి. త్వరలో అవి బయటపెడతాం.


వీరితోనే సిట్‌...

నకిలీ మద్యంపై విచారణకు సిట్‌ను నియమిస్తున్నాం. ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ, సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తి, టెక్నికల్‌ ఎస్పీ మల్లికా గార్గ్‌, ఎక్సైజ్‌లో ఒక అధికారితో సిట్‌ ఏర్పాటుచేస్తున్నాం. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీ నేర్చుకుని, దానిని ఏపీలో అమలుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇకపై ప్రతి మద్యం షాపులో ప్రతి సీసాను స్కాన్‌ చేసిన తర్వాతే అమ్మాలి. ఈనెల 16 నుంచి అన్ని మద్యం షాపుల్లో సురక్ష యాప్‌ అమల్లోకి వస్తుంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసిన సీసాలను స్కాన్‌ చేసి పరిశీలించాలి. ఏవైనా ఫిర్యాదులుంటే 14405 నంబరుకు కాల్‌ చేసి చెప్పవచ్చు. షాపులో స్కాన్‌ చేసిన తర్వాత దానిని బెల్టులకు పంపినా తెలిసిపోతుంది. ఎక్కడైనా బెల్టుల్లో అమ్మితే బెల్టు తీస్తాం!


కుట్రలో భాగంగా శవ రాజకీయాలు

కుట్రలో భాగంగా శవ రాజకీయాలు మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో 30వేల మంది నాసిరకం మద్య వల్ల తీవ్ర వ్యాధులకు గురయ్యారు. జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం తాగి 27 మంది చనిపోతే చిన్న విచారణజరపలేదు. చివరికి మృతులకు పోస్టుమార్టం కూడా చేయించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యం వల్లే అని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో భయం, అలజడి సృష్టించి, ప్రభుత్వం విఫలమైందనే ముద్ర వేయాలనే కుట్ర చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎవరితో లాలూచీ పడదు. నకిలీ మద్యం పేరుతో కుట్రలు చేయాలని చూస్తే సాగవు. ఫేక్‌ వార్తలు వ్యాప్తి చేస్తే సీరియస్‌ చర్యలుంటాయి. ఆ వార్తల సోర్స్‌పైనా విచారణ చేస్తాం. నిజాలు చెబితే అభినందిస్తాం.


అదే మీకూ మాకూ తేడా

వైసీపీ హయాంలో నకిలీ మద్యంతో 27 మంది చనిపోయినా పట్టించుకోలేదు. అదే మా ప్రభుత్వంలో ఏలూరులో ఒకరు చనిపోతే వెంటనే పరీక్షలు చేయించాం. అతను ఇతర కారణాల వల్ల చనిపోయారని తేలినప్పటికీ అది నకిలీ మద్యం వల్లే అని ప్రచారం చేసి పైశాచికానందం పొందుతున్నారు. యాచకుల మరణాలనూ నకిలీ మద్యం ఖాతాలో వేసి శవ రాజకీయం చేస్తున్నారు. తప్పుచేసిన వారిలో రాజకీయ నాయకులు, అధికారులు, ఇంకా ఎవరున్నా వదిలిపెట్టం. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూసేవారిని కూడా వదలం.


నేరాల్లో ఇరుక్కున్నవారికే అలవాటు

నేరాల్లో ఇరుక్కుపోయినవారికే ఇలాంటి నకిలీ మద్యం నేరాలు చేయడం అలవాటుగా ఉంటుంది. వారు నేరం చేసి ఆ నెపం ఎదుటివారిపై మోపాలని చూస్తారు. గతంలో వివేకాహత్య కేసు ఎలా చేశారో చూశాం. ఇప్పుడు ఎక్సైజ్‌ మంత్రిని, కార్యదర్శిని విచారించాలని పిచ్చి డిమాండ్లు చేస్తున్నారు. నకిలీ మద్యంపై సీబీఐ దర్యాప్తు కోరడం... కేసుల డైవర్షన్‌ కోసం కూడా కావొచ్చు. ఎక్సైజ్‌ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేస్తే కఠిన చర్యలుంటాయి. ఇకపై మీరు తప్పు చేయలేని విధానం తీసుకొస్తాం. మద్యం నాణ్యత పరిశీలన వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. నాణ్యతలో చిన్న తేడా వచ్చినా ఊరుకోం.

Updated Date - Oct 13 , 2025 | 04:36 AM