Share News

Chandrababu Naidu: నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపండి

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:06 AM

రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని ఏమాత్రం ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నకిలీతో ప్రజల ప్రాణాలు హరించే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.

Chandrababu Naidu: నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపండి

  • రాష్ట్రంలో ఆ మద్యం ఎక్కడా కనిపించకూడదు

  • తయారీదారులను ఏమాత్రం ఉపేక్షించొద్దు

  • మద్యంపై ఫేక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టండి

  • పోలీసు, ఎక్సైజ్‌ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని ఏమాత్రం ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నకిలీతో ప్రజల ప్రాణాలు హరించే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అలాంటి మద్యం తయారీ కేంద్రాలుగానీ, తయారుచేసే వ్యక్తులు కూడా ఉండకూడదని స్పష్టంచేశారు. నకిలీ మద్యం వ్యవహారంపై పోలీసు, ఎక్సైజ్‌ శాఖలతో బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ములకలచెరువు కేసులో ఇప్పటివరకూ 21 మందిని నిందితులుగా గుర్తించామని, అందులో ఇప్పటివరకూ 12 మందిని అరెస్టు చేశామని అధికారులు వివరించారు. ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం వ్యవహారంలో 12 మందిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఎంకు వివరించారు. ములకలచెరువు వ్యవహారంపై రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు. నకిలీ మద్యం రాష్ట్రమంతటా ఉందంటూ ప్రజల్ని భయపెడుతున్నారని, ప్రతి మూడు సీసాల్లో ఒక నకిలీ అని ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని మంత్రులు అర్థంచేసుకుని, ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. నకిలీ మద్యం కారణంగానే అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు అంటూ ప్రచారం చేస్తున్నారని, ప్రతి ఆరోపణపైనా విచారణ జరపాలని అధికారులకు స్పష్టంచేశారు. అవసరమైతే మృతికి కారణాలను సైంటిఫిక్‌ విధానంలో తెలుసుకుని వాస్తవాలు వెల్లడించాలన్నారు. ఏది నిజమో చెప్పడంతో పాటు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారాలు చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ మద్యంతో చనిపోయారని ఎవరైనా అంటే దానికి రుజువులు అడగాలని, తప్పుడు ప్రచారం అని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మీడియాలోనైనా, సోషల్‌ మీడియాలోనైనా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దన్నారు.


వైసీపీ డ్రామాలు మర్చిపోవద్దు

2019లో వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఆడిన డ్రామాలు మర్చిపోద్దని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం సూచించారు. ప్రజలను నమ్మించేందుకు వైసీపీ వాళ్లు చేసే తప్పుడు ప్రచారాలను మంత్రులు తిప్పికొట్టాలన్నారు. ఈ విషయంలో మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. వైసీపీ గత చరిత్ర, రాజకీయ కుట్రలను ప్రజల్లో పెట్టి ఎండగట్టాలన్నారు. ప్రతి ఘటన, సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుండటంతో విమర్శలు చేయడానికి వైసీపీకి కారణాలు దొరకడం లేదని, అందుకే తప్పుడు ప్రచారాలతో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలన్నీ అమలుచేయడంతో వేరే కారణాలు దొరక్క వైసీపీ ఫేక్‌ ప్రచారాలను నమ్ముకుందన్నారు. ఏది మంచి, ఏది చెడో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 04:07 AM