Share News

Chief Minister Chandrababu: గంటకు 5,500 మందికి శ్రీవారి దర్శనం

ABN , Publish Date - Sep 26 , 2025 | 08:06 AM

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లో ఏర్పాటు చేసిన ఏఐ ఇటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గురువారం ప్రారంభించారు.

Chief Minister Chandrababu: గంటకు 5,500 మందికి శ్రీవారి దర్శనం

  • డిజిటల్‌ కంటెంట్‌లో శ్రీవారి చరిత్ర: సీఎం

  • చంద్రబాబుతో కలసి పీఏసీ-5ను ప్రారంభించిన రాధాకృష్ణన్‌

తిరుమల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లో ఏర్పాటు చేసిన ఏఐ ఇటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గురువారం ప్రారంభించారు. ఐసీసీ సెంటర్‌ పనితీరును అధికారులు, సిబ్బంది వారికి వివరించారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌, బిహేవియర్‌ అనాలసిస్‌ అమలులో ఉందని, గంటకు 4,500 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు ఏఐ, క్వాంటమ్‌ రెడీ అనలిటిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో దర్శనం కోసం ఎంతమంది వేచిఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్‌ నిర్వహణ కోసం చర్యలు చేపడుతున్నామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ గంటకు 5 వేల నుంచి 5,500 మంది దర్శనం చేసుకునే అవకాశాలపై దృష్టి సారించడం ద్వారా వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని సూచించారు. డిజిటల్‌ కంటెంట్‌లో శ్రీవారి చరిత్ర, కథలు, వైభవం వంటివి ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏడుకొండలపై 95శాతానికిపైగా గ్రీనరీ ఉండాలన్నారు.


శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం

తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, సీఎం చంద్రబాబు గురువారం ఉదయం దర్శించుకున్నారు. మహద్వారం వద్ద ఆలయ అర్చక బృందం, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వీరికి ఇస్తికాఫల్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయకమండపంలో రాధాకృష్ణన్‌, చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించగా, శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లు, చిత్రపటాన్ని చైర్మన్‌, ఈవో అందజేశారు. అనంతరం తిరుమలలో నూతనంగా రూ.105కోట్లతో నిర్మించిన వేంకటాద్రి యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ-5)ను సీఎం చంద్రబాబుతో కలసి ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ భక్తురాలికి ఉపరాష్ట్రపతి స్వయంగా లాకర్‌ కేటాయించారు. ఆలయ పోటులో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రసాదం తయారీ సార్టింగ్‌ యంత్రాన్ని రిమోట్‌ మోడ్‌లో ప్రారంభించారు.


వ్యర్థాలు వేస్తే రూ.5 బహుమతి

తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ కొత్త పంథాను ఎంచుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పీఏసీ5లో తొలిసారిగా‘రెక్టైమ్‌ ఏస్‌’ ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌లో కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన తర్వాత యంత్రంలో కనిపించే రింగ్‌లో టెట్రా ప్యాకెట్లు,స్నాక్స్‌ ప్యాకెట్లు వంటి వ్యర్థాలను వేయాలి. ఈవ్యర్థాలు రీసైక్లింగ్‌ కావడంతో పాటు భక్తులకు ప్రోత్సాహకంగా రూ.5 లభిస్తుంది.


ఐసీసీ సెంటర్‌తో తిరుమలపై మరింత నిఘా!

భక్తులకు మెరుగైన దర్శనం, నిరీక్షణ సమయం తగ్గింపు, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటు.. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా అధునాతన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)ను తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లోని 25వ కంపార్టుమెంట్‌లో ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, దర్శనానికి సరైన సమయాన్ని లెక్కకట్టడం, దర్శనానికి వచ్చే భక్తుల పూర్తి వివరాల నమోదు చేయడం, హెడ్‌ కౌంట్‌ వంటి వాటికి ఈవ్యవస్థ ఉపయోగపడనుంది. దేశవ్యాప్తంగా ఆలయాల్లో ఈస్థాయి సమీకృత నిఘా వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారి.

Updated Date - Sep 26 , 2025 | 08:09 AM