18 Crore Scam: చెవిరెడ్డి పేరిట 18 కోట్ల వసూళ్లు
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:31 AM
వైసీపీ నేత, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పి గృహిణుల నుంచి ఓ మహిళ రూ.18కోట్ల మేర వసూళ్లు చేసిన ఘటన హైదరాబాద్‌లో గురువారం వెలుగు చూసింది.
కంటెయినర్ల వ్యాపారం అంటూ మాయ
పటాన్‌చెరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పి గృహిణుల నుంచి ఓ మహిళ రూ.18కోట్ల మేర వసూళ్లు చేసిన ఘటన హైదరాబాద్‌లో గురువారం వెలుగు చూసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో నివాసమున్న విద్య అనే మహిళ రెండేళ్ల క్రితం ఈ వసూళ్లకు పాల్పడింది. చెవిరెడ్డి పేరు చెప్పి కంటెయినర్ల వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మబలికింది. దీంతో మహిళలు రూ.లక్షల్లో డబ్బు, ఇంట్లోని బంగారం ఆమెకు ఇచ్చారు. ఈ విధంగా విద్య రూ.18కోట్ల మేర వసూలు చేసింది. తర్వాత విద్య సీతాఫల్‌మండీలోని ఇల్లు ఖాళీచేసి పటాన్‌చెరు ఏపీఆర్ గ్రాండియా కాలనీలోని విల్లాకు మకాం మార్చింది. గురువారం ఆమె ఇంటికి వెళ్లిన బాధిత మహిళలపై భర్త దిద్ది రాజశేఖర్, అతని సోదరులు రంజిత్, శివ, నిఖిల్, విద్య కుమారుడు అభి, పనిమనిషి స్వప్న కలిసి కట్టెలు, సుత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కళమ్మ తలకు బలమైన గాయమైంది. అనంతరం బాధితులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.