Chevireddy Bhaskar Reddy Land Scam: దోపిడీలో దోపిడీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:35 AM
దోపిడీలో కొత్త రకం దోపిడీ! ఇలా కూడా దోచుకోవచ్చా అని విస్తుపోయేలా నిలువు దోపిడీ! వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మాత్రమే ఇది సాధ్యం! మద్యం ముడుపుల్ని ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంచిన ఆయన..
తిరుపతిలో చెవిరెడ్డి మార్క్ నయా దందా!
36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే
మద్యం సొమ్ముతో అర్చకుడి ఆస్తి కొనుగోలు
అర్చకుడి భార్యకు 24 లక్షలే చెల్లింపు
మిగిలిన 2.69 కోట్లకు గాను అనుచరులకు ఆమే అప్పు ఉన్నట్టుగా నోటు తయారీ
వారి పేరిట డొల్ల కంపెనీలు సృష్టించి బదిలీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దోపిడీలో కొత్త రకం దోపిడీ! ఇలా కూడా దోచుకోవచ్చా అని విస్తుపోయేలా నిలువు దోపిడీ! వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మాత్రమే ఇది సాధ్యం! మద్యం ముడుపుల్ని ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంచిన ఆయన.. గతంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా, టీటీడీ పాలకమండలి సభ్యుడిగా, తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(తుడా) చైౖర్మన్‌గా పనిచేసి.. ఏడుకొండల నుంచి కింది వరకూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారుల కోసం ఆంధ్రా నుంచి ఆఫ్రికా వరకూ రూ.వందల కోట్ల ఆస్తులు పోగేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి కుటుంబ ఆస్తిపై కన్నేశారు. వారిపై ఒత్తిడి తెచ్చి తిరుపతి శివారున ఉన్న రూ.36 కోట్ల విలువ చేసే 2.93 ఎకరాలను రూ.2.93 కోట్లకే కొన్నారు. మద్యం ముడుపుల సొమ్ముతో ఈ భూమిని కొన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజా విచారణలో బయటపడింది. లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(పెద్ద కుమారుడు) పేరు వచ్చేలా సీఎంఆర్ ఇన్‌ఫ్రా పేరిట 2023 ఏప్రిల్‌లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ కంపెనీలో ఆథరైజ్డ్ సిగ్నేచర్ అఽథారిటీగా ఉన్న చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి కొనుగోలు లావాదేవీల డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. ఆదాయపు పన్ను శాఖకు లెక్క చెప్పాల్సి వస్తుందని.. కొనుగోలు చేసిన 2.93 ఎకరాల భూమిని 73.25 సెంట్ల చొప్పున 4 భాగాలుగా విభజించి 4 డాక్యుమెంట్లలో రిజిస్టర్ చేయించుకున్నారు. అర్చకుడి భార్యకు రూ.2.93 కోట్లు చెల్లించాలి. అయితే ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.6 లక్షలు మాత్రమే సీఎంఆర్ ఇన్‌ఫ్రా ఖాతా నుంచి చెల్లించినట్లు చూపించారు. అర్చకుడి భార్య ఖాతాలోకి రూ.24 లక్షలు బదిలీ చేశారు. మిగిలిన సొమ్ము ఒక్కో డాక్యుమెంటుకు రూ.67.25 లక్షల చొప్పున.. 4 డాక్యుమెంట్లకు కలిపి మొత్తం 2.69 కోట్లకు రేణుకతో నాలుగు నోట్లు రాయించుకున్నారు. చెవిరెడ్డి బంధువులు, అనుచరులు, సన్నిహితులు, పొరుగింటి వ్యక్తులకు ఆమె అప్పు ఉన్నట్లు చూపించి, వారికి చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు.
16 మంది పేర్లతో 8 డొల్ల కంపెనీలు
దోచుకున్న సొమ్మును డొల్ల కంపెనీల ఆదాయంగా చూపించడంలో మాస్టర్ డిగ్రీ పొందిన జగన్ బాటనే... ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి అనుసరించారు. 16 మంది బంధువులు, అనుచరులు, సన్నిహితులను ఎంపిక చేసుకుని తన ఇంటి అడ్రస్ అయిన తుమ్మలగుంట చిరునామాతో ఏప్రిల్ 2021 నుంచి 2023 మధ్యలో లత ఆగ్రో సర్వీసెస్, శోభా డెవలపర్స్, జితేంద్ర ఇన్‌ఫ్రా, వినయ్ ఇన్‌ఫ్రా, హరీశ్ సర్వీసెస్, కుర్రా డెయిరీ సర్వీసెస్, బీవన్ సర్వీసెస్, నవీన్ ఇన్‌ఫ్రా పేరిట 8 డొల్ల కంపెనీలు సృష్టించారు. వీటికి రేణుక బకాయి ఉన్నట్టు డాక్యుమెంటు రాయించుకున్నారు. వాటి ఖాతాల్లోకి రూ.33 లక్షల చొప్పున రూ.2.69 కోట్లు సీఎంఆర్ ఇన్‌ఫ్రా ఖాతా నుంచి జమ చేశారు. ఆమె బకాయి చెల్లించినట్లు ‘లెక్క’ సరిచేశారు. చెవిరెడ్డి మద్యం ముడుపుల సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికే ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
డ్రైవర్, పనోడూ...
డొల్ల కంపెనీలకు యజమానులు ఎవరా అని ఆరా తీసిన సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అక్రమ సొమ్మును సక్రమ సంపాదనగా చూపించుకోవడానికి చెవిరెడ్డి వేసిన ఎత్తుగడలో ఏకంగా తన డ్రైవర్, సహాయకుడు, బంధువులు, పొరుగింటి వారిని కంపెనీలకు యజమానుల్ని చేశారు. లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన నవీన్ కృష్ణ(ఏ-36)తో పాటు శిరీష అనే మరో మహిళ డైరెక్టర్లుగా నవీన్ ఇన్‌ఫ్రా ఏర్పాటైంది. మరో కంపెనీ లతా ఆగ్రోస్‌కు చెవిరెడ్డి మరదలు సునంద, బంధువు లత డైరెక్టర్లు. శోభా డెవలపర్స్‌కు పొరుగింట్లో ఉండే లోకేశ్ రెడ్డి, శోభారాణి యజమానులు. జితేంద్ర ఇన్‌ఫ్రా డైరెక్టర్లుగా చెవిరెడ్డికి సోదరుడయ్యే జితేంద్ర రెడ్డి, ఆయన తల్లి కుమారి ఉన్నారు. బీవన్ కంపెనీకి సన్నిహితుడు బీవన్ రెడ్డి, ఆయన తల్లి నాగేశ్వరి డైరెక్టర్లు. కుర్రా డెయిరీ సర్వీసెస్‌కు మేనల్లుడు ముని శంకర్ రెడ్డి, మామ జశ్వంత్ యజమానులు. హరీశ్ సర్వీసె్‌సకు డైరెక్టర్లుగా డ్రైవర్ హరీశ్ కుమార్ రెడ్డి, నమ్మకమైన పనోడు మహేశ్వర రెడ్డి ఉన్నారు. వినయ్ ఇన్‌ఫ్రా డైరెక్టర్లు బోడపాటి వినయ్, హేమంత్ ఇద్దరూ చెవిరెడ్డి అనుచరులేనని దర్యాప్తులో వెల్లడైంది. వీరిని ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరు. మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెవిరెడ్డి ఇంకా ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారు? ఎన్ని వందల కోట్లు సంపాదించారు? ఏయే దేశాల్లో పెట్టుబడులు పెట్టారనే దానిపై సమగ్ర సమాచారాన్ని సిట్ సేకరిస్తోంది.
అంకణం కొనే శక్తి లేకున్నా..
తిరుపతి పరిసరాల్లో నివాస స్థలాలు అంకణాల రూపంలో క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రతి అంకణం 36 చ.అడుగులు. తిరుచానూరు పరిసరాల్లో అంకణం ఖరీదు కనీసం 2 లక్షలు. అలాంటి చోట పాతిక వేల జీతానికి పనిచేసే డ్రైవర్ ఒక కంపెనీ స్థాపించి వందల అంకణాలు ఎలా కొనుగోలు చేశాడో? అర్చకుడి భార్యకు లక్షలాది రూపాయలు అప్పుగా ఇచ్చి కోట్లాది రూపాయల విలువ చేసే భూమి రిజిస్టర్ చేయించుకున్నారు. సిట్ దర్యాప్తులో ఇలాంటి లీలలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో!