ACB Court: చెవిరెడ్డికి బెయిల్‌పై ఏమంటారు
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:32 AM
మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులను కోర్టు వివరణ కోరింది.
సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ప్రశ్న
కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
విజయవాడ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులను కోర్టు వివరణ కోరింది. దీనిపై ఏమంటారని ప్రశ్నించింది. తనకు మధ్యంతర లేదా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మరోవైపు, ఇంటి నుంచి వచ్చే భోజనం వారాలను మార్పు చేయాలని చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. చెవిరెడ్డికి ఇంటి నుంచి వారంలో మూడు రోజులపాటు భోజనాన్ని అందించేందుకు కోర్టు అనుమతించింది. కోర్టు నిర్దేశించిన వారాల్లో కాకుండా మంగళ, గురు, ఆదివారాల్లో భోజనాన్ని అనుమతించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
చెవిరెడ్డిని తేలేం
చెవిరెడ్డికి రిమాండ్ పొడిగింపు విషయంలో ఆయనను వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరుస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు ఏసీబీ కోర్టు 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఆ రోజున నిందితులందరినీ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే, చెవిరెడ్డిని కోర్టుకు తీసుకురాలేమని, ఆయనను వర్చువల్‌గా హాజరుపరుస్తామని, అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
బాలాజీ, నవీన్ బెయిల్‌పై 29న తీర్పు
గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మద్యం కుంభకోణం కేసు నిందితులు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ బెయిల్ పిటిషన్‌పై తీర్పును 29న వెలువరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. వీరి బెయిల్ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగిశాయి. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్, నిందితుల తరఫున మన్మధరావు వాదనలు వినిపించారు.
రాచమల్లుపై కేసు కొట్టివేత
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రొద్దుటూరులో అన్నక్యాంటీన్ ఏర్పాటు చేస్తుండగా.. అధికారుల విధులకు ఆటంకం కలిగించి, ధర్నా చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితోపాటు మరో 27 మందిపై నమోదు చేసిన ఈ కేసులో విచారణ పూర్తవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.