SIT Investigation: కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్టు
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:58 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో మరో నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఢిల్లీలో రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంఽధిని (39) శుక్రవారం రాత్రి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో...
కెమికల్ వ్యాపారి అజయ్ అదుపులోకి
కల్తీ నెయ్యిలో వాడిన రసాయనాలు
ఈయనే సరఫరా చేసినట్టు నిర్ధారణ ‘తిరుమల లడ్డూ కల్తీ’ కేసులో ఏ16
రేపు కస్టడీ పిటిషన్ వేయనున్న సిట్
తిరుపతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో మరో నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఢిల్లీలో రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంధిని (39) శుక్రవారం రాత్రి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించగా, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అజయ్‌కుమార్‌ను కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలంటూ సిట్ ఽఅధికారులు సోమవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అదేరోజున టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న కస్టడీ కోసం ఇదివరకే సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఆయిల్స్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని అయిన అజయ్ కుమార్... భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌కు నకిలీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాలు సరఫరా చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దక్షిణ కొరియా నుంచి ఢిల్లీకి చెందిన ప్రధాన డిస్ట్రిబ్యూటర్ ఈ రసాయనాలను దిగుమతి చేసుకోగా, వారి వద్ద అజయ్‌కుమార్ తన సంస్థ పేరిట కొనుగోలు చేసినట్టు సిట్ కనుగొంది. మోనో గ్లిజరయిడ్స్, అసిటిక్ యాసిడ్, ఈస్టర్ వంటి రసాయనాలను భోలేబాబా డెయిరీ డైరెక్టర్లకు ఆయన సరఫరా చేశారని, ఆ రసాయనాలతో తయారైన నెయ్యినే వైష్టవి, ఏఆర్ డెయిరీ పేరుతో టీటీడీకి సరఫరా చేశారని సిట్ గుర్తించింది. మొత్తం మీద భోలేబాబా డెయిరీ తయారు చేసిన నకిలీ నెయ్యిలో 90 శాతానికిపైగా పామాయిల్ కలిపినట్టు గుర్తించారు.
కాగా, అజయ్‌కుమార్‌కు, పొమిల్ జైన్, విపిన్ జైన్‌లకు మధ్య రసాయనాల సరఫరాకు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉన్న బంధాన్ని నిర్ధారించే ఆధారాలను సిట్ సేకరించినట్టు సమాచారం. వాటి ఆధారంగానే మూడురోజుల క్రితం ఢిల్లీలో అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారని, అక్కడి సిట్ కార్యాలయంలో విచారించారని తెలిసింది. అనంతరం శుక్రవారం రాత్రి అరెస్టు చేసి అప్పటికప్పుడు నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించి రిమాండు నిమిత్తం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. కల్తీ నెయ్యి కేసులో ఆయనను ఏ16గా రిమాండు రిపోర్టులో పేర్కొంది.