నాణ్యతకు తిలోదకాలు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:16 AM
మచిలీపట్నంలో నార్త్, సౌత మండలాల్లోని 102 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఆకుమర్రు మంచినీటి పథకం పనుల్లో నాణ్యతాప్రమాణాలను విస్మరిస్తున్నారు. రూ.2.40 కోట్లతో మేలో మరమ్మతులు చేపట్టిన నాలుగు ఫిల్టర్ బెడ్‌లలో రెండు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయకుంటే తాగునీటి కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు స్పందించి నాణ్యతాప్రమాణాలతో వీటిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతుల్లో కాంట్రాక్టర్ల నిర్వాకం
- మూలనపడిన ఆకుమర్రు మంచినీటి పథకం
- 102 గ్రామాలకు తాగునీటి సరఫరాకు ఇదే దిక్కు
- రూ.2.40కోట్లతో నాలుగు ఫిల్టర్‌బెడ్‌లకు మరమ్మతులు
- మేలో పనులు ప్రారంభం.. రెండు ఫిల్టర్ బెడ్‌ల పనులు కూడా పూర్తికాని వైనం
- త్వరితగతిన మరమ్మతులు చేయకుంటే తాగునీటికి కష్టాలే!
- నాణ్యమైన ఇసుకను వాడలేదని విమర్శలు
మచిలీపట్నంలో నార్త్, సౌత మండలాల్లోని 102 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఆకుమర్రు మంచినీటి పథకం పనుల్లో నాణ్యతాప్రమాణాలను విస్మరిస్తున్నారు. రూ.2.40 కోట్లతో మేలో మరమ్మతులు చేపట్టిన నాలుగు ఫిల్టర్ బెడ్‌లలో రెండు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయకుంటే తాగునీటి కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు స్పందించి నాణ్యతాప్రమాణాలతో వీటిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం నార్త్, సౌత మండలాల్లోని 34 పంచాయతీల పరిధిలోని 102 గ్రామాలకు తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద ఉన్న ఆకుమర్రు, మంగినపూడి మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆకుమర్రు మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్‌లు మూడేళ్ల క్రితమే మరమ్మతులకు గురయ్యాయి. దీంతో మంగినపూడి మంచినీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆకుమర్రు మంచినీటి పథకానికి సంబంధించిన నాలుగు ఫిల్టర్ బెడ్‌లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు రూ.2.40 కోట్ల నిధులను మంత్రి కొల్లు రవీంద్ర చొరవ తీసుకుని తీసుకువచ్చారు. ఈ ఏడాది మేలో ఈ ఫిల్టర్ బెడ్‌లకు మరమ్మతులు ప్రారంభించారు. అయితే నాలుగు ఫిల్టర్ బెడ్‌లకు గాను రెండింటిలోనే పనులు చేస్తున్నారు. మిగిలిన రెండింటిలో పనులు ఇంకా ప్రారంభించనేలేదు.
సోము కనస్ట్రక్షన్‌కు పనులు అప్పగిస్తే..
ఆకుమర్రు మంచినీటి పథకం నాలుగు ఫిల్టర్ బెడ్‌లకు పూర్తిస్థాయి మరమ్మతు పనులను చేసేందుకు కృష్ణాజిల్లాలోని కాంట్రాక్టర్‌లకు అర్హత లేకపోవడంతో రాజమండ్రికి చెందిన సోము కనస్ట్రక్షన్‌కు పనులు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పనులను దక్కించుకునేందుకు ప్రయత్నించి విఫలమైన కూటమికి చెందిన ఓ వ్యక్తి టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత తెరవెనుక చక్రం తిప్పాడు. తనకు ఈ పనుల్లో వాటా ఇవ్వాలని పట్టుబట్టి తీవ్రస్థాయిలో కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో రాజమండ్రికి చెందిన అసలు కాంట్రాక్టర్ రెండు ఫిల్టర్‌బెడ్ పనులను కూటమి నాయకుడికి అప్పగించారు. మిగిలిన రెండు ఫిల్టర్‌బెడ్‌ల పనులు అసలు కాంట్రాక్టర్ చేసేలా ఒప్పందం కుదిరింది.
ఇసుకలో నాణ్యత ఎంత?
సామ, దాన, దండోపాయాలతో పనులు దక్కించుకున్న వ్యక్తి ఈ పనులు సక్రమంగా చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఈ ఫిల్టర్ బెడ్‌లలోని ఇటుకలు, కంకర ఇతరత్రా మెటీరియల్ మొత్తాన్ని వెలికితీసి, శుభ్రం చేసి మళ్లీ అమర్చాల్సి ఉంది. కంకర, ఇటుకలు పాతవేపెట్టినా, నీరు ఫిల్టర్ అయ్యేందుకు కీలకమైనది ఇసుక. చీరాల నుంచి మొదటి రకం నాణ్యత కలిగిన ఇసుకను వాడాలనే నిబంధన ఉంది. అయితే సబ్ కాంట్రాక్టుకు పనులు చేస్తున్న వ్యక్తి నాణ్యతలేని ఇసుకను వాడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రకం నాణ్యతతో ఉన్న ఇసుకను వాడకుండా, రెండోరకం ఇసుకను 40శాతం, మూడోరకం ఇసుకను 60శాతం మేర వాడారనే విమర్శలున్నాయి. పూర్తిస్థాయిలో నాణ్యతతో ఉన్న ఇసుకను ఫిల్టర్‌బెడ్‌లలో వాడితే కనీసంగా ఏడెనిమిది సంవత్సరాలపాటు ఫిల్టర్‌బెడ్‌లు సక్రమంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. నాణ్యత లేని ఇసుకను వాడితే రెండు, మూడు సంవత్సరాలకే ఫిల్టర్‌బెడ్‌లు పనితీరు పడిపోతుందని పేర్కొంటున్నారు. రెండు ఫిల్టర్ బెడ్‌ల పనులు తుది దశలో ఉండగా, వాటిని క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇంకా పరిశీలించలేదని, వారి పరిశీలన తర్వాతనే వీటిని వినియోగంలోకి తెస్తారని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం
గత వైసీపీ ప్రభుత్వంలో తరకటూరులోని ఆకుమర్రు మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్‌లు పాడైపోయినా వీటికి కనీస మరమ్మతులు చేయించకుండా జాప్యం చేశారు. అప్పట్లో రూ. 45 లక్షలతో ఈ పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. రూ.45 లక్షలకు సంబంధించిన పనులను తొమ్మిది పనులుగా విభజించి నామినేషన్ పద్ధతిన కేటాయించారు. ఈ పనులను ప్రారంభించి సక్రమంగా చేయకపోవడంతో అప్పటి కలెక్టర్ రంజిత బాషా ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన నిపుణులతో ఈ పనులను తనిఖీ చేయించారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం పనులను రద్దు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఫిల్టర్‌బెడ్‌లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర రూ.2.40 కోట్ల నిధులను తీసుకువచ్చారు. అయితే రెండోసారి ఈ పనులు నాణ్యతతో చేయడం లేదనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. మూడు నెలల్లో ఈ నాలుగు ఫిల్టర్‌బెడ్‌ల పనులను పూర్తిచేయాల్సి ఉండగా, గత ఐదున్నర నెలలుగా రెండు ఫిల్టర్‌బెడ్‌ల పనులు కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం. ఆకుమర్రు మంచినీటి పథకం ద్వారా 58 గ్రామాలకు తాగునీటిని అందించే కీలకమైన పనులను అసలు అనుభవమే లేని కాంట్రాక్టరుతో చేయించడం ఒక ఎత్తయితే, పనుల్లో నాణ్యత పాటించకపోవడంలో మరో కోణం ఇమిడి ఉందనే విమర్మలు ఉన్నాయి. అసలు పనులే ప్రారంభించని మరో రెండు ఫిల్టర్‌బెడ్‌లకు సంబంధించిన పనులు ఎప్పటికి ప్రారంభిస్తారు. ఎవరు ఈ పనులు చేస్తారు... ఎప్పటికి పూర్తిచేస్తారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆకుమర్రు మంచినీటి పథకం పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న మంగినపూడి మంచినీటి పథకం ద్వారా మూడు సంవత్సరాలకుపైగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మంగినపూడి మంచినీటి పథకం ద్వారా 102 గ్రామాలకు తాగునీటిని ఫిల్టర్ చేస్తుండటంతో ఆ పథకంపై పెనుభారం పడి అది కూడా మూలనపడే పరిస్థితికి చేరుకుంది.