జీవచ్ఛవాలు!
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:40 AM
పచ్చని పల్లెలు.. ఎతైన కొండలు. ఎటు చూసినా పరవశించేలా ప్రకృతి అందాలు.. అంతటా ఆహ్లాదకర వాతారణం. ఇలాంటి పల్లెలో ఉంటే అసలు రోగాలే దరి చేరవు ఇది నాణేనికి ఒక వైపు. మరో వైపు కాలకూట విషాన్ని తలపించేలా ఉన్న తాగునీరే వారికి దిక్కు. ఫ్లోరోసిస్, సిలికా ఉన్నట్లు అనుమానిస్తున్న నీరు పచ్చని పల్లెలను రోగాల పాలుజేసింది. ఇంటికో కిడ్నీ రోగిని మిగిల్చింది. ఎందరో ప్రాణాలు హరిస్తోంది. అయినా ఇప్పటికీ అదే నీరు తాగాల్సిన దుస్థితిలో ఆయా పల్లెలు, గిరిజన తండాలు ఉన్నాయి. ఇదంతా ఎక్కడో ఉద్దానంలో అనుకుంటున్నారా.. కాదండి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో ప్రజలు జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. ఆయా గ్రామాల్లో, గిరిజన తండాల్లో ఉద్ధానం తరహాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. సంచలనంగా మారిన కిడ్నీ సమస్యపై ’ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం..
-ఎన్టీఆర్ జిల్లాలో మరో ఉద్ధానం!
-ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ వ్యాధి ఉధృతం
- నెలరోజుల వ్యవధిలో నలుగురు మృతి
- 40 ఏళ్లకే ముగిసిపోతున్న జీవితం
- అనుముల్లంకలో ఇంటికో కిడ్నీ రోగి
- అల్లాడిపోతున్న ఎ.కొండూరు తండాలు
- జీవం తీసేస్తున్న విష జలం
- ఫ్లోరోసిస్, సిలికా ఉన్నట్లు ఆరోపణ
- లేదంటూ నివేదికలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
- పూర్తికాని కృష్ణాజలాల పైపులైన్ పనులు
- సురక్షిత నీరు మరింత ఆలస్యం
- ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో అనేక విషయాలు వెలుగులోకి..
పచ్చని పల్లెలు.. ఎతైన కొండలు. ఎటు చూసినా పరవశించేలా ప్రకృతి అందాలు.. అంతటా ఆహ్లాదకర వాతారణం. ఇలాంటి పల్లెలో ఉంటే అసలు రోగాలే దరి చేరవు ఇది నాణేనికి ఒక వైపు. మరో వైపు కాలకూట విషాన్ని తలపించేలా ఉన్న తాగునీరే వారికి దిక్కు. ఫ్లోరోసిస్, సిలికా ఉన్నట్లు అనుమానిస్తున్న నీరు పచ్చని పల్లెలను రోగాల పాలుజేసింది. ఇంటికో కిడ్నీ రోగిని మిగిల్చింది. ఎందరో ప్రాణాలు హరిస్తోంది. అయినా ఇప్పటికీ అదే నీరు తాగాల్సిన దుస్థితిలో ఆయా పల్లెలు, గిరిజన తండాలు ఉన్నాయి. ఇదంతా ఎక్కడో ఉద్దానంలో అనుకుంటున్నారా.. కాదండి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో ప్రజలు జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. ఆయా గ్రామాల్లో, గిరిజన తండాల్లో ఉద్ధానం తరహాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. సంచలనంగా మారిన కిడ్నీ సమస్యపై ’ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం..
ఆంధ్రజ్యోతి-ఎ.కొండూరు/గంపలగూడెం:
ఎ.కొండూరు మండలంలో వరుస కిడ్నీ మరణాలు ఆ ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. నెలల వ్యవధిలోనే భరోత ధర్మ (40), బాణావతు రాముడు (65), బాణావతు కోటమ్మ (65), జరబల మంగ్య (43) అనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటూ మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 మంది కిడ్నీ రోగులు మరణించారని అధికారికంగా లెక్కలు వేస్తున్నా..అనధికారికంగా ఆ సంఖ్య మరింత ఉంటుందని బాధిత కుటుంబాలంటున్నాయి. ఎ.కొండూరు మండలంలో 37 ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలున్నాయి. వాటిలో 17 తండాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఎ.కొండూరు మండలంలో 175 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు. గంపలగూడెం మండలం వినగడప తండాలో 14 మంది, కొత్తపల్లిలో నలుగురు, కనుమూరులో ఎనిమిది మంది, అనుముల్లంకలో 22 మంది కిడ్నీ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలున్నాయి. కాని ఈ రెండు మండలాల్లో వేల సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రజాసంఘాలు, బాధిత కుంటుబాలు చెబుతున్నారు. గంపలగూడెం మండలంలో మరణాలు లేకున్నా వ్యాధిగ్రస్తులు మాత్రం కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ఇంటికొకరు చొప్పున ఉన్నారు. అనుముల్లంక మాజీ సర్పంచ్ మద్దాల ప్రసాద్‌తో పాటు ఆయన భార్య మరియమ్మ ఇద్దరు కిడ్నీ వ్యాధిగ్రస్థులే.
రోజుకు 12 మందికి డయాలసిస్
ఎ.కొండూరు డయాలసిస్ సెంటర్లో రోజుకు 12 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. వీరు కాకుండా విజయవాడ వెళ్లి ప్రైవేటుగా డయాలసిస్ చేయించుకునే రోగులు ఉన్నారు. ఇక్కడ డయాలసిస్ చేయించుకునే వారు మరణిస్తేనే కిడ్నీ మరణంగా నమోదు చేస్తున్నారు. అధికారిక లెక్కల్లో చూపుతున్నారు. బయట చనిపోయిన వ్యక్తులను అధికారిక లెక్కల్లో చేర్చడం లేదు. ఈ లెక్కన కిడ్నీ మరణాలు అధికంగా ఉన్నాయనేది వాస్తవం.
రోగుల బాధలు వర్ణణాతీతం
క్రానిక్ కిడ్నీ డిసిస్ సోకిన ఇంట్లో బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. స్టేజిని బట్టి పేషెంట్స్ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. సీరం క్రీయాటిన్ 2.0 దాటితే వారిని కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా పరిగణిస్తారు. ఐదు శాతం ఆ రోగికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఇలా డయాలసిస్‌కు వెళ్లే రోగి వెంట ఒక సహాయకుడు ఉండి తీరాల్సిందే. వ్యాధి తీవ్రతను బట్టి వారంలో ఒక్కొక్కరికి మూడు సార్లు, ఒక్కొక్కరికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. వారిని డయాలసిస్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు విధిగా ఒక సహాయకుడు ఉండి తీరాల్సిందే. ఈక్రమంలో ఇంటిళ్లిపాది వారంలో పని మానుకొని రోగిని డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ఆక్రమంలో బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ మరణ వార్త వినాల్సి వుస్తుందోనని మానసికంగా కుటుంబ సభ్యులు కుంగిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది కిడ్నీ వ్యాధికి ఎక్కువ సంఖ్యలో మందులు వాడిన వారు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీప్లానగర్ తండాలో వెలుగులోకి..
ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో 2017లో కిడ్నీ వ్యాధి పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చింది. ఒకేసారి ఇక్కడ 20 మందికి పైగా కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. దీంతో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోగుల కోసం ఒక ప్రత్యేక వైద్యశాల కావాలని, సురక్షిత మంచినీరు అందించాలని ఉద్యమాలు సాగాయి. మరో ఉద్ధానంలా మారకముందే ప్రభుత్వం స్పందించాలని ఉద్యమాలు సాగాయి. దశాబ్ద కాలం కావస్తున్నా ఇప్పటికీ రోగుల కోసం పూర్తిస్థాయిలో వైద్య సేవలు, సురక్షిత మంచినీరు అందడం లేదు.
కనుమరుగవుతున్న తరం
కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో 40 ఏళ్లు దాటిన వారు కిడ్నీ వ్యాధి ముదరిపోయి మరుసగా మృత్యువాత పడుతున్నారు. దీంతో ఒక తరం వారు ఇక మీదట కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో ఎంతో కొంత శాతం సీరం క్రియాటిన్ ఉండే ప్రమాదం లేకపోలేదనే వాదన ఉంది. కిడ్నీ వ్యాధిని, మరణాలను తగ్గించాలంటే విధిగా కిడ్నీ వ్యాధి నిర్ధారణ నిపుణులైన నెర్ఫాలజిస్ట్‌లతో ర్యాండమ్‌గా వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
కిడ్నీ వ్యాధికి అసలు కారణమేమిటి?
రెండు మండలాల్లో కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నీటి శాంపుల్స్ తీసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు భూగర్భ జలంలో ఫ్లోరోసిస్, సిలికా అనే మెటల్ కాని లేవని ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. ఎక్కడైతే ఫ్లోరోసిస్ అధికంగా ఉందని అధికారులు నివేదిక ఇచ్చారో అక్కడ కిడ్నీ కేసులు లేవని, ఎక్కడైతే ఫ్లోరోసిస్ లేదో అక్కడ కిడ్నీ కేసులు నమోదు అవుతున్నాయి. కిడ్నీ వ్యాధి ప్రబలేందుకు ఫ్లోరోసిస్ నీరు కారణం కాదా, ఆ నీటిలో సిలికా లాంటి విషం ఏమైనా ఉందా అనే ధర్మ సందేహం బాధిత కుటుంబాల నుంచి ప్రజా సంఘాల నుంచి వెలువడుతుంది. భూగర్భ జలం ఎందుకు విషతుల్యం అయ్యింది. గిరిజనులు, పల్లెల్లోని జనాన్ని ఎందుకు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మార్చింది, మృత్యువు ఘోష ఎందుకు వినిపిస్తుందనే విషయంపై లోతైన అధ్యాయనం చేయాల్సిన పరిస్థితి ఉంది.
కృష్ణాజలాలే పరిష్కారమా!
ఎ.కొండూరు మండలంలోని 37 కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాలకు ఇబ్రహీంపట్నం ఫిల్టర్ బెడ్స్‌లో శుద్ధి చేసిన కృష్ణా జలాలు సరఫరా చేయడమే శాశ్వత పరిష్కారమా అంటే అవుననే వాదన వినిపిస్తోంది. ఇందుకు జలజీవన్ మిషన్ కింద రూ.50 కోట్ల నిధులతో పైపులైన్ పనులు పూర్తి చేసి, ఆరు తండాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు పూర్తి చేసి ట్రయిల్ రన్స్ వేశారు. అయితే తాగునీరు కలుషితమై వస్తుండటంతో మళ్లీ ట్యాంకర్ల ద్వారానే తాగునీరు కుదప నుంచి ప్రభావిత ప్రాంతాలకు సరఫరా చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు రెండు మూడు రోజులకొకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మళ్లీ విషతుల్యమైన తాగునీరు తాగాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆయా తండా వాసులు వాపోతున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా కృష్ణాజలాలు సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో తాగునీరు అందడంలేదని ఆరోపిస్తున్నారు. పైపులైన్ పనులకు ఎన్‌ఎస్‌పీ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతులు ఇవ్వడంలో జాప్యం కారణంగా పనులు కొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ఈక్రమంలో పైపులైన్ పనులు పూర్తయ్యేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
కిడ్నీ మరణాలపై అధ్యయనం
ఎ.కొండూరు మండలంలో వరుసగా జరుగుతున్న కిడ్నీ మరణాలపై అధ్యాయనం చేసేందుకు మూడు రోజుల క్రితం రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) అడిషనల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి ఈ ప్రాంతానికి వచ్చారు. కిడ్నీ బాధితులు, మృతుల కుటుంబాలను సందర్శించారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు తాగే నీటి శ్యాంపిల్స్ సేకరించారు. పూర్తిస్తాయిలో నీటి సరఫరా చేయడం లేదని, తాగునీరు శుభ్రంగా ఉండటం లేదని బాధితులు, తండా వాసులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ఐసీఎంఆర్‌కు కలెక్టర్ వినతి:
వరుస కిడ్నీ మరణాలపై స్పందించిన కలెక్టర్ జి.లక్ష్మీశ, జిల్లా వైద్యాధికారి సుహాసిని ఐసీఎంఆర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి గల కారణాలు పూర్తిగా అధ్యాయనం చేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నట్లు సమాచారం.
జీవం ఉండగానే నరకం
జీవించి ఉండగానే నరకం చూస్తున్నా. వయస్సు 59. భార్య రమణ (53) కిడ్నీ వ్యాధితో మృతి చెందింది. నా కుమారుడి సాయంతో డయాలసిస్ సెంటర్‌కు వస్తున్నా. ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోవడం లేదు. రక్తం కొనుగోలు చేసుకోవాలి. ప్యాకెట్ రూ.1,700, రెండు ప్యాకెట్లు కొనుగోలు చేసుకోవాలి. విజయవాడ నుంచి రక్తం తెచ్చుకోవాలి. వారంలో రెండు సార్లు డయాలసిస్‌కు వస్తున్నా. ఎప్పుడు పోతానో తెలియదు. పగోనికి కూడా ఈ వ్యాధి రాకూడదు.
-మాదాసు సత్యనారాయణ, కోమటికుంట
ఏం తినలేం
నాకు 50 ఏళ్లు. ఏం తినలేం. దాహం వేసినా నీరు తాగలేం. రోజుకు అర లీటరు నీరు మాత్రమే తాగాలి. ఏం తినాలన్నా ఆంక్షలే. జామ, బొప్పాయి, ఆపిల్ మితంగా తినాలి. ఉప్పు కారం లేకుండా చప్పిడి తిండి తినాల్సిన దుస్థితి. నా భర్త సాయంతో డయాలసిస్ సెంటర్‌కు వస్తున్నా. డయాలసిస్ చేయించుకోవడం కంటే పోతేనే మంచిదనిపిస్తుంటుంది.
-కొమ్ము సులోచన, పోలిశెట్టిపాడు
రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం
డయాలసిస్ సెంటర్‌కు వచ్చే రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇక్కడ కాకుండా విజయవాడ వెళ్లి డయాలసిస్ చేయించుకునే వారికి వాహనాన్ని ఏర్పాటు చేశాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కిడ్నీ వ్యాధి సోకే ప్రమాదం లేకపోలేదు. ఆర్‌డబ్ల్యూఎస్ వారు ఇచ్చిన నివేదికల్లో కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో సిలికా అనే పదార్థం లేదని ఉంది. కిడ్నీ వ్యాధికి ఫ్లోరోసిస్ నీరే కారణం అని చెప్పలేం. ఫ్లోరోసిస్ అధికంగా ఉన్న చోట అసలు కిడ్నీ కేసులే లేవు. మరి ఎందుకిలా అనే విషయాలపై పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది.
-డాక్టర్ స్వాతి, ఎ.కొండూరు పీహెచ్‌సీ