ట్రాఫిక్ ఉల్లంఘనులకు‘క్లిక్’తో చెక్!
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:57 AM
-రాధా నగర్‌కు చెందిన రామరాజు బైక్‌పై ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెళ్లిన మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో అలా మాట్లాడుకుంటూనే ఇంటికి చేరుకున్నాడు. సరిగ్గా బైక్‌కు స్టాండ్ వేసి ఇంట్లోకి వెళ్లగానే ఆయన ఫోన్‌కు మెసేజ్ నోటిఫికేషన్ వెళ్లింది. ఇది చూడగానే రామరాజు షాక్ అయ్యాడు. -కృష్ణలంకకు చెందిన కిరణ్ హెల్మెట్ లేకుండా ఓ ఆదివారం తెగ తిరిగాడు. ట్రాఫిక్ పోలీసులు చూసినా అతడిని ఆపకపోవడంతో హెల్మెట్ డ్రైవ్‌ను ఆపేశారనుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత రూ.1,100 జరిమానా విధించినట్టు సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో నిర్ఘాంతపోయాడు. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాల్పడే వారికి సాంకేతికతను ఉపయోగిం చుకుని పోలీసులు విధిస్తున్న జరిమానాలు నగర వాసులను అప్రమత్తం చేస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు దోహదపడుతున్నాయి
నగరంలో రెడ్‌లైట్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాల ఏర్పాటు
ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఫొటోలు తీస్తున్న సాంకేతిక వ్యవస్థ
వాహనదారుడి సెల్‌కు ఫొటో, జరిమానా సమాచారం
పది రోజుల్లో 751 కేసులు నమోదు.. రూ.7.85 లక్షల జరిమానా
-రాధా నగర్‌కు చెందిన రామరాజు బైక్‌పై ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెళ్లిన మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో అలా మాట్లాడుకుంటూనే ఇంటికి చేరుకున్నాడు. సరిగ్గా బైక్‌కు స్టాండ్ వేసి ఇంట్లోకి వెళ్లగానే ఆయన ఫోన్‌కు మెసేజ్ నోటిఫికేషన్ వెళ్లింది. ఇది చూడగానే రామరాజు షాక్ అయ్యాడు.
-కృష్ణలంకకు చెందిన కిరణ్ హెల్మెట్ లేకుండా ఓ ఆదివారం తెగ తిరిగాడు. ట్రాఫిక్ పోలీసులు చూసినా అతడిని ఆపకపోవడంతో హెల్మెట్ డ్రైవ్‌ను ఆపేశారనుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత రూ.1,100 జరిమానా విధించినట్టు సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో నిర్ఘాంతపోయాడు. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాల్పడే వారికి సాంకేతికతను ఉపయోగిం చుకుని పోలీసులు విధిస్తున్న జరిమానాలు నగర వాసులను అప్రమత్తం చేస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు దోహదపడుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ):
విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు నెమ్మదిగా స్టైల్ మార్చుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనులకు విధించే జరిమానాలకు సాంకేతికతను జోడిస్తున్నారు. వీలైనంత వరకు జరిమానాలను నాన్ కాంటాక్ట్ విధానంలో విధించాలని భావిస్తున్నారు. ఇందుకోసం నగరంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు పని చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న వ్యూహం వాహనదారులకు అంతుబట్టడం లేదు. ఎక్కడా ఆపకుండా, ప్రశ్నించకుండా నేరుగా సెల్‌ఫోన్లకు జరిమానాలు పంపి వాహనదారులకు ఝలక్ ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతోంది. జరిమానాలు విధించిన తర్వాత వెంటనే చెల్లించాలని పోలీసులు చెప్పడం, తమ వద్ద అంత డబ్బులు లేవని వాహనదారులు వాదనలకు దిగడం ఒక పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులపై ఎదురు తిరిగే సరికి దాన్ని చూసి మిగిలిన వాహనదారులు ఎదురు తిరుగుతున్నారు. దీనితో పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆపేస్తున్నారు. పోలీస్ కమిషనర్ నిత్యం ఉదయం పూట అధికారులతో సెల్‌కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. క్షేత్రస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహిస్తున్న సమయంలో ఎదురవుతున్న సవాళ్లను ట్రాఫిక్ పోలీసులు వివరించారు. దీంతో కాంటాక్ట్ విధానం(పోలీసులు నిర్వహించే తనిఖీలు)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహిస్తున్నా సాంకేతికతను జోడించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు.
ఆర్‌ఎల్‌వీడీలతో వాదనలకు చెక్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో సేఫ్టీ ప్రాజెక్టును పోలీస్ అధికారులు పట్టాలు ఎక్కించారు. ప్రభుత్వం నిధులపై ఆధారపడకుండా దాతల విరాళాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని కొన్ని కూడళ్లలో ఆర్‌ఎల్‌వీడీ(రెడ్‌లైట్ వైలేషన్ డిటెక్షన్) కెమెరాలను ఏర్పాటు చేశారు. బెంజ్‌సర్కిల్, డీసీపీ బంగ్లా, పీసీఆర్, పడవలరేవు సెంటర్ వివిధ కూడళ్లలో ఈ ఆర్‌ఎల్‌వీడీ సీసీ కెమెరాలను అమర్చారు. అన్ని సీసీ కెమెరాల మాదిరిగానే ఈ ఆర్‌ఎల్‌వీడీ కెమెరాలను ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఈ సీసీ కెమెరాల నుంచి వచ్చే లైవ్‌ను వీక్షించడానికి ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ నియమించారు. వీడియో వాల్‌పై లైవ్‌ను పరిశీలించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి ఫొటోలను తీస్తున్నారు. వాటి ద్వారా జరిమానాలను విధిస్తున్నారు. రెడ్ సిగ్నల్ ఉల్లంఘించిన సీసీ కెమెరాల ద్వారా హెల్మెట్ ధరించకపోయినా, ఒకే వాహనంపై ముగ్గురు ప్రయణించినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా ఫొటోలు తీస్తున్నారు. రవాణా శాఖ డేటా పోలీసు శాఖకు అనుసంధానం కావడంతో జరిమానా విధించగానే వాహనదారుల ఫోన్ నంబర్లకు ఆ సందేశం వెళ్లిపోతుంది. పోలీసులు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఈ చలాన్ పెండింగ్‌లో ఉందని చెప్తే వాహనదారులు ఎదురు తిరుగుతున్నారు. ఈ పరివాహన్ యాప్‌లో ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను వాహనదారులు సెల్‌ఫోన్లలోనే చూపిస్తున్నారు. దీంతో వాహనదారులకు నోటి నుంచి మాట రావడం లేదు. ఉల్లంఘన ఎక్కడ జరిగింది, ఏ సమయానికి జరిగింది, ఏ తరహా ఉల్లంఘన చేశారో వాహనం నడిపిన వ్యక్తి ఫొటోతోపాటు వాహనం నంబరు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు ఉండడంతో మరోమాట లేకుండా జరిమానాలు చెల్లిస్తున్నారు. ఈ ఆర్‌ఎల్‌వీడీ కెమెరాల ద్వారా పది రోజుల్లో మొత్తం 751 కేసులు నమోదు చేసి రూ.7.85లక్షల జరిమానా విధించారు.
ఇంకా మార్పు రావాలి : ఏవీఎల్ ప్రసన్నకుమార్, ట్రాఫిక్ అదనపు డీసీపీ
నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ వల్ల వాహనదారుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. 90శాతం మంది ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్‌ను ధరిస్తున్నారు. ఇంకా సెల్‌ఫోన్ డ్రైవింగ్, స్టాప్‌లైన్ ఉల్లంఘనలు చేస్తున్నారు. ఈ రెండు నిబంధనలను వాహనదారులు పాటించేలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాలను నడిపే వారు నంబర్ ప్లేట్ కనపడకుండా నిమ్మకాయలు కడుతున్నారు. కొంతమంది పోస్టర్లు అడ్డు పెడుతున్నారు. కొంతమంది నంబర్ ప్లేట్‌లను ఇష్టం వచ్చినట్టు ఏర్పాటు చేసుకుంటున్నారు. బోర్డు కొన్ని అక్షరాలను చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఉంటున్నాయి. ఇలాంటి ఉల్లంఘనలను ఉపేక్షించం.