Share News

PVN Madhav: స్వదేశీ ఉద్యమంతో ఆంక్షలకు చెక్‌

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:33 AM

అమెరికా ఆంక్షలు మన ఆత్మ గౌరవం ముందు తల వంచాల్సిందే. స్వదేశీ నినాదంతో సొంత ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం....

PVN Madhav: స్వదేశీ ఉద్యమంతో ఆంక్షలకు చెక్‌

  • మన ఉత్పత్తులు మనమే కొనుగోలు చేద్దాం

  • ‘ఖాదీ సంత’లకు వెళ్దాం... దేశాభివృద్ధికి తోడ్పడదాం: మాధవ్‌

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘అమెరికా ఆంక్షలు మన ఆత్మ గౌరవం ముందు తల వంచాల్సిందే. స్వదేశీ నినాదంతో సొంత ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం. ఖాదీ సంతల్లో మన నేతన్నల వస్త్రాలు తీసుకుందాం. వికసిత భారత్‌ పరాయి దేశంపై ఆధార పడదని చాటి చెబుదాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి(అక్టోబరు 2) సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 90 రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో ‘ఖాదీ సంత’లు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంతలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేశ్‌ నాయుడు, మట్టా ప్రసాద్‌, అడ్డూరి శ్రీరామ్‌ తదితరులతో కలసి మాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘భారత దేశ ఖ్యాతి బీజేపీ పాలనలో విశ్వవ్యాప్తమయింది. కార్గిల్‌ యుద్ధ సమయంలో తుపాకులు కూడా విదేశాల నుంచి కొనాల్సి వచ్చింది. వాజపేయీ పోఖ్రాన్‌తో మనశక్తి చాటితే... మోదీ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో మన బ్రహ్మోస్‌ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. కాంగ్రెస్‌ పాలకులు విదేశాలపై ఆధారపడటం వల్ల మన దేశం బలహీనంగా ఉండేది. అమృతకాలంలో ఉన్న మన దేశం 2047నాటికి ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికా బద్ధంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలపై అమెరికా సుంకాల ప్రభావం లేకుండా చేయడానికి స్వదేశీ ఉద్యమాన్ని చేపడదాం. ఖాదీని పక్కన పెట్టడం వల్ల దేశం నష్టపోయింది. చిన్న బొమ్మలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మనకు అవసరమా? ప్రతి ఖాదీ సంతలో వంద స్టాళ్లు ఏర్పాటు చేశాం. వాటిలో స్థానిక ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవ ఉద్యమంలో పాల్గొనాలి. స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని మాధవ్‌ పిలుపునిచ్చారు.

షర్మిల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాధవ్‌ ఆరోపించారు. ‘ఆలయాలు వద్దు... మరుగు దొడ్లు ముద్దు’ అంటూ ఆమె హిందువులను తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. చర్చిలు, మసీదుల నిర్మాణాల విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయగలరా? అని ప్రశ్నించారు. హిందువులు సౌమ్యులు కదా! అని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ అంటే అర్థం ఏంటో కూడా తెలియని పీసీసీ అధ్యక్షురాలు దేశ సేవలో వందేళ్లు పూర్తి చేసుకొంటున్న గొప్ప సంస్థ గురించి మాట్లాడటం వినడానికే విడ్డూరంగా ఉందని మాధవ్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - Oct 02 , 2025 | 03:33 AM