Share News

Mobile Monitoring Service App: ఉపాధిలో దొంగ మస్టర్లకు చెక్‌

ABN , Publish Date - Oct 20 , 2025 | 05:23 AM

ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకు ఇక చెక్‌ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలతో పాటుఎన్‌ఎంఎంఎస్ యాప్‌తో అక్రమాలను కట్టడి చేయనున్నారు.

Mobile Monitoring Service App: ఉపాధిలో దొంగ మస్టర్లకు చెక్‌

  • ఎన్‌ఎంఎంఎస్ యాప్‌తో అక్రమాల కట్టడి

  • పని ప్రాంతానికి వస్తేనే మస్టర్‌ నమోదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకు ఇక చెక్‌ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలతో పాటు ఎన్‌ఎంఎంఎస్ యాప్‌తో అక్రమాలను కట్టడి చేయనున్నారు. గతంలో మన రాష్ట్రం టీసీఎస్‌ ద్వారా అభివృద్ధి చేసిన ఎన్‌ఆర్‌జీఏ సాఫ్ట్‌వేర్‌ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ వచ్చిన తర్వాత అందులోని లోపాలను ఆసరా చేసుకుని దొంగ మస్టర్లు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ దొంగ మస్టర్లను కట్టడి చేయడం అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా దొంగ మస్టర్ల నమోదుతో గ్రామాల్లో ఉపాధి పనుల వాతావరణం దెబ్బతింది. అప్పట్లో మండల కార్యాలయాల్లో కూర్చొని మస్టర్లు నమోదు చేయడం ద్వారా శ్రామికులు క్షేత్రస్థాయిలో పనికి రావడం మానేశారు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రామికులతో తిరిగి ఉపాధి పనులు చేయించడం కష్టంగా మారింది. దొంగ మస్టర్ల వ్యవహారం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దొంగ మస్టర్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు కేంద్రం దొంగ మస్టర్ల కట్టడికి ఎన్‌ఎంఎంఎస్(నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీసు) యాప్‌ను అమల్లోకి తెచ్చింది. సిబ్బంది ఈ యాప్‌ ద్వారా పని ప్రదేశాల్లో శ్రామికుల ఫోటోలు తీస్తారు. ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా కూలీలు ఆ రోజు పనికి హాజరైనట్లు గుర్తిస్తుంది. దీంతో శ్రామికుడికి ఆ రోజు వేతనం మంజూరవుతుంది. ఈ యాప్‌లో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీస్తారు.


నకిలీ జాబ్‌కార్డుల కట్టడి

ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు నకిలీ జాబ్‌కార్డుల కారణంగానే ఎక్కువ దొంగ మస్టర్లు నమోదవుతున్నాయి. చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి వంద రోజుల పని కల్పిస్తారు. గ్రామాల్లో కొన్ని చోట్ల ఆయా కుటుంబసభ్యుల్లో ఒకరినో, ఇద్దరినో వేరు చేసి సింగిల్‌ జాబ్‌కార్డులను క్రియేట్‌ చేస్తారు. తద్వారా ఆ కార్డులకు కూడా వంద రోజుల పని అవకాశం ఏర్పడుతుంది. దీంతో పనులు చేయకుండానే మస్టర్లు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధంగా ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రాజకీయపార్టీల కార్యకర్తలు అక్రమాలకు పాల్పడి ఉపాధి పథకం స్ఫూర్తిని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ జాబ్‌కార్డుల కట్టడికి శ్రీకారం చుట్టింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సూచనల మేరకు రాష్ట్ర సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో సోషల్‌ ఆడిట్‌ రంగంలోకి దిగి 5,400 పంచాయతీల్లో ఉన్న నకిలీ జాబ్‌కార్డులను ఏరివేసింది. సుమారు 50 వేలకు పైగా నకిలీ జాబ్‌కార్డులను రద్దు చేశారు. దీంతో అక్రమాలకు అడ్డాగా ఉన్న సింగిల్‌ జాబ్‌కార్డుల బెడద తగ్గింది.


ఉపాధి శ్రామికులకు ఈ-కేవైసీ

రాష్ట్రంలో ఉపాధి పథకంలో పనిచేసే ప్రతి శ్రామికుడి ఉపాధి జాబ్‌కార్డును ఈ-కేవైసీ చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. ప్రతి జాబ్‌కార్డును ఆయా శ్రామికుడి ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేస్తారు. దీంతో ఫేస్‌ రికగ్నిషన్‌కు సులభంగా ఉంటుంది. శ్రామికుడి ఫోటో తీయగానే.. ఆ ఫోటోతో ఆధార్‌ లింక్‌ అయి, హాజరును గుర్తిస్తుంది. దీంతో కచ్చితంగా గ్రామంలో ఉంటూ పనికి వచ్చిన శ్రామికుడికే మస్టర్‌ నమోదవుతుంది. దొంగ మస్టర్లు వేయాలన్న ప్రయత్నాలకు చెక్‌ పడుతుంది. ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియను ఫీల్డ్‌ అసిస్టెంట్ల ద్వారానే చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఎన్‌ఎంఎంఎస్ ద్వారా ఫోటోలు తీసి హాజరును గుర్తిస్తారు. దీంతో దొంగ మస్టర్లపై వస్తున్న ఫిర్యాదుల వెల్లువ తగ్గుతుందని భావిస్తున్నారు. దొంగ మస్టర్ల కట్టడికి సోషల్‌ ఆడిట్‌ విభాగం ఇప్పటికే డేగ కళ్లతో తనిఖీలు చేపడుతోంది.

Updated Date - Oct 20 , 2025 | 05:23 AM