Share News

నకిలీ పింఛన్లకు చెక్‌!

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:25 AM

వైకల్యం లేకున్నా ఉన్నట్లుగా చూపి, సదరం క్యాంపుల్లో నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకుని దివ్యాంగుల పింఛను పొందుతున్న అక్రమార్కులకు ప్రభుత్వం చెక్‌ పెడుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకుని పింఛను పొందుతున్న వారి వివరాలను సేకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించింది. ఈ ప్రత్యేక బృందాల సర్వేలో జిల్లాలో నాలుగు వేల మందికి పైగా వైకల్యం లేకున్నా దివ్యాంగుల పింఛను పొందుతున్నట్లుగా రుజువైంది. దీంతో ఆయా పింఛనుదారులకు ప్రభుత్వం ఇటీవల నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా మీకున్న వైకల్యాన్ని నిరూపించుకోవాలని, అందుకు తగిన సర్టిఫికెట్లను సమర్పించేలా వెసులుబాటును కల్పించింది. నోటీసులు అందుకున్న వారిలో రెండు శాతం మంది వాస్తవంగా వైకల్యంతో ఇబ్బందులు పడేవారు ఉన్నట్లు సమాచారం.

నకిలీ పింఛన్లకు చెక్‌!

- జిల్లాలో 4 వేల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ

- నెలరోజుల్లోగా వైకల్యం నిరూపణకు అవకాశం

- 1400 మందికి వృద్ధాప్య పింఛనుగా మార్పు

- నోటీసులు అందుకున్న వారిలో చెవుడు ఉన్నట్టు సదరం సర్టిఫికెట్లు తెచ్చుకున్నవారే అధికం

- జిల్లా వ్యాప్తంగా పింఛనుదారుల సంఖ్య 2,36,400

వైకల్యం లేకున్నా ఉన్నట్లుగా చూపి, సదరం క్యాంపుల్లో నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకుని దివ్యాంగుల పింఛను పొందుతున్న అక్రమార్కులకు ప్రభుత్వం చెక్‌ పెడుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకుని పింఛను పొందుతున్న వారి వివరాలను సేకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించింది. ఈ ప్రత్యేక బృందాల సర్వేలో జిల్లాలో నాలుగు వేల మందికి పైగా వైకల్యం లేకున్నా దివ్యాంగుల పింఛను పొందుతున్నట్లుగా రుజువైంది. దీంతో ఆయా పింఛనుదారులకు ప్రభుత్వం ఇటీవల నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా మీకున్న వైకల్యాన్ని నిరూపించుకోవాలని, అందుకు తగిన సర్టిఫికెట్లను సమర్పించేలా వెసులుబాటును కల్పించింది. నోటీసులు అందుకున్న వారిలో రెండు శాతం మంది వాస్తవంగా వైకల్యంతో ఇబ్బందులు పడేవారు ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా వ్యాప్తంగా 2,36,400 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇందులో దివ్యాంగుల కోటాలో పింఛను పొందేవారు 36 వేల మంది వరకు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల కోటాలో పింఛన్‌ను నెలకు రూ.6 వేలకు పెంచింది. దీంతో గతంలో సదరం క్యాంపుల్లో దళారుల ప్రమేయంతో వైకల్యం ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు దివ్యాంగుల కోటాలో పింఛను తీసుంటున్నారు. ఈ అంశంపై పలు ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం గత ఆరేడు నెలలుగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, దివ్యాంగుల పింఛను పొందుతున్న వారి వివరాలు, వారు నిజంగా వైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారా లేదా అనే అంశంపై నిజనిర్ధారణ చేయించింది. ప్రత్యేక వైద్య బృందాల పరిశీలనలో జిల్లాలో నాలుగు వేల మందికిపైగా వైకల్యం లేకున్నా ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకుని దివ్యాంగుల పింఛను పొందుతున్నట్లుగా రుజువైంది. దీంతో వీరందరికీ మీకున్న వైకల్యానికి సంబంధించిన అన్ని పత్రాలను మళ్లీ చూపాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో చెవుడు ఉన్నట్లుగా చూపి దివ్యాంగుల పింఛను తీసుకుంటున్న వారే అధికంగా ఉన్నట్లు అఽధికారులు చెబుతున్నారు.

పొరపాటున పింఛను ఆపితే.. తర్వాత బకాయిలతో సహా చెల్లింపు

వాస్తవంగా వైకల్యంతో బాధపడుతూ ప్రత్యేక వైద్య బృందాలు ఇచ్చిన నివేదికలో పొరపాట్లు దొర్లి పింఛను ఆపివేస్తే, పూర్తిస్థాయిలో సర్టిఫికెట్లు సమర్పించిన అనంతరం పాతబకాయిలతో సహా పింఛను ఇచ్చేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని అధికారులు పేర్కొంటున్నారు. దివ్యాంగుల పింఛను పొందేందుకు అర్హత లేనివారి వయసు 60 సంవత్సరాలు దాటితే వారికి వృద్ధాప్య పింఛను ఇచ్చేలా వెసులుబాటును కల్పించారు. ఇలా జిల్లాలో 1400 మందికి దివ్యాంగుల పింఛను బదులుగా, వృద్ధాప్య పింఛను ఇస్తామని కూడా నోటీసులో పేర్కొన్నారు. ఉదాహరణకు మోపిదేవి మండలంలో 980 మంది దివ్యాంగుల పింఛను పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందాల పరిశీలనలో 529 మంది దివ్యాంగుల పింఛను పొందేందుకు అర్హులని తేల్చారు. మిగిలిన వారిలో 118 మందికి 60 సంవత్సరాలు నిండడంతో వారికి దివ్యాంగుల పింఛనుకు బదులుగా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులని నివేదికను ఇచ్చారు. మరో 335 మందికి ఎటువంటి అర్హతలు లేవని నిర్ధారించారు. అయితే తమ పింఛను నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చారని, తాము ఏం చేయాలని నోటీసులు అందుకున్న వారు సచివాలయాలకు, ఎంపీడీవో కార్యాలయ అధికారులకు ఫోన్‌ చేసి మరీ అడుగుతున్నారు. వీరిలో చెవుడు అని చూపి పింఛను పొందుతున్నవారే అధికంగా ఉన్నారని, ఫోన్‌లో తమతో మాట్లాడేటపుడు వారికి అన్ని మాటలు సక్రమంగానే వినపడుతున్నాయని అధికారులు, సచివాలయ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దళారుల వద్దకు పరుగులు

దివ్యాంగుల పింఛన్లు ఇప్పిస్తామని, ఆధార్‌ కార్డులలో వయసును పెంచి వృద్ధాప్య పింఛన్లు వచ్చేలా చేస్తామని గతంలో దళారులు పలువురి నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారు. సదరం క్యాంపులలో వైకల్యం శాతం అధికంగా ఉన్నట్లుగా సర్టిఫికెట్లు జారీ చేయిస్తామని చెప్పి, సదరం క్యాంపులలో పనిచేసే వైద్యులతో కుమ్మక్కై వైకల్యం లేకున్నా, అధికశాతం ఉన్నట్లుగా చూపి సదరం సర్టిఫికెట్లను మంజూరు చేయించారు. చెవుడు ఉన్నట్లుగా అధికశాతం సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇందుకోసం దళారులు ఒక్కొక్కరి నుంచి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. గతంలో సదరం క్యాంపులు నిర్వహించిన సమయంలో దళారుల ద్వారా సర్టిఫికెట్లు పొందిన వారు ఇప్పుడు తమ పింఛను కొనసాగేలా చూడాలని వారి చుట్టూ తిరుగుతున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 01:25 AM