ఎస్‌ఆర్ పురం ఎంఈవోపై చీటింగ్ కేసు
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:35 AM
శ్రీరంగరాజపురం ఎంఈవో సబర్మతిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ బుధవారం తెలిపారు.కుప్పం మండల విద్యాశాఖాధికారి షేక్ మహబూబ్ బాషాను విధులనుంచి సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల చేశారు.
గుడిపాల, జూన్ 18(ఆంధ్రజ్యోతి):శ్రీరంగరాజపురం ఎంఈవో సబర్మతిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ బుధవారం తెలిపారు.గుడిపాల మండలం బుచ్చన్నకండ్రిగ గ్రామానికి చెందిన సబర్మతిపై అదే గ్రామానికి చెందిన ప్రియాంక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రియాంకకు ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన సబర్మతి రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పి ముందుగా రూ.2.50 లక్షలు చెల్లించాలని కోరినట్లు తెలిపారు. దీంతో ఫోన్ పే ద్వారా గత సంవత్సరం రూ.1.55 లక్షలు,నేరుగా రూ.50 వేలు అందించిన ప్రియాంక ఎంతకూ ఉద్యోగం తీసివ్వకపోవడంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిందన్నారు.దీంతో సబర్మతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుప్పం ఎంఈవో సస్పెన్షన్
కుప్పం (ఆంధ్రజ్యోతి): కుప్పం మండల విద్యాశాఖాధికారి షేక్ మహబూబ్ బాషాను విధులనుంచి సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల చేశారు. కుప్పం పల్లార్లపల్లె వద్ద గల హాకింగ్స్ స్కూల్ విషయంలో తాను ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాకింగ్స్ స్కూల్‌లో తమ పిల్లలను కొనసాగించమని తల్లిదండ్రులను ఎంఈవో మహబూబ్ బాషా తప్పుదారి పట్టించారన్నారు. ఈ పాఠశాలకు గుర్తింపు లేదని చెప్పారు. ఆ పాఠశాల సీబీఎస్‌ఈ గుర్తింపును పొందుతోందని, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపును ఉపసంహరించుకోవడంపై ఎటువంటి ప్రభావం లేదని, వారి పిల్లలను అదే పాఠశాలలో కొనసాగించమని మహబూబ్ బాషా తల్లిదండ్రుల సమావేశంలో చెప్పినట్లు వీడియో క్లిప్పింగుల ఆధారంగా నిర్ధారించుకున్నట్లు ఆర్జేడీ పేర్కొన్నారు. ఇది తల్లిదండ్రులను తప్పుదారి పట్టించిందన్నారు. శాఖ పట్ల సమగ్రత లేకపోవడం, ఉన్నతాధికారుల పట్ల అవిధేయత, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మండల విద్యాశాఖాధికారి హోదాలో అధికారాలను దుర్వినియోగం చేయడం అనే కారణాలతో ఎంఈవో షేక్ మహబూబ్ బాషాను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమశిక్షణా చర్యలు ముగిసే వరకూ ఆయన సస్పెన్షన్‌లో కొనసాగుతారని తెలిపారు. కాగా గుడుపల్లె ఎంఈవో కె.శ్రీదేవికి, కుప్పం ఇన్‌చార్జి ఎంఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆర్జేడీ మంగళవారం తాజా ఉత్తర్వులు జారీ చేశారు.