Guntur: మెడికల్ కాలేజీలపై వైసీపీ ర్యాలీలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:29 AM
మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరసన ర్యాలీలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
గుంటూరులో అంబటి రాంబాబు రచ్చ
బారికేడ్లు తోసేసి.. కానిస్టేబుళ్లను మోచేత్తో నెట్టేసి దౌర్జన్యం
ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులపై దురుసు ప్రవర్తన
గుంటూరు/అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరసన ర్యాలీలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అనంతపురం, శింగనమల, కడప, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, సత్తెనపల్లి, గుంటూరు, విజయనగరం, పుంగనూరు, తిరుపతి తదితర నియోజకవర్గాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం మహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మోస్తరుగా ర్యాలీలు జరిగాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు విడుదల చేసిన ఉత్తర్వును రద్దు చేసుకోవాలని, ప్రభుత్వమే నేరుగా వైద్యకళాశాలలను నిర్వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా, గుంటూరులో ర్యాలీ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులపై తన ప్రతాపం చూపిస్తూ దౌర్జన్యం చేశారు. పట్టాభిపురంలోని స్వామి థియేటర్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వైసీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసి అడ్డొచ్చిన పోలీసులను తన మోచేతితో నెట్టేశారు. ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులకు వేలు చూపిస్తూ ‘ఆపటానికి నువ్వెవరు... ఏం చేస్తావ్’ అంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా ముందుకు సాగారు.