Y S Jagan Supporters: అన్న వస్తే అరాచకమే
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:57 AM
అన్న పరామర్శలకు వస్తాడు. అన్నను చూడగానే తమ్ముళ్లు ఆగరు. సందర్భం ఏదైనా సీఎం... సీఎం... నినాదాలే వినిపిస్తాయి.
జగన్ పర్యటనలో కార్యకర్తల అత్యుత్సాహం
భవానీపురంలో మాజీ సీఎం పర్యటన
పరామర్శలో సీఎం.. సీఎం.. నినాదాలు
కార్యకర్తలను తోసేసిన భద్రతా సిబ్బంది
ఇళ్ల కూల్చివేతపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటన
విజయవాడ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): అన్న పరామర్శలకు వస్తాడు. అన్నను చూడగానే తమ్ముళ్లు ఆగరు. సందర్భం ఏదైనా సీఎం... సీఎం... నినాదాలే వినిపిస్తాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడ పర్యటించినా ఇదే తీరు. మంగళవారం విజయవాడ భవానీపురంలోని జోజీనగర్‌కు జగన్ విచ్చేశారు. ఇటీవల ఇక్కడ ఇళ్లు కూల్చివేసిన 42 కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఇళ్లు కూల్చేసిన స్థలంలోనే బాధితులు నిరసన దీక్ష చేస్తున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన జగన్.. అక్కడి నుంచి నేరుగా జోజినగర్‌కు చేరుకుని సుమారు అరగంటపాటు వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న నాయకులతో జోజినగర్‌కు భారీగా కార్యకర్తలను తరలించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని శిబిరం వద్దకు చేరుకున్నారు. జగన్ బాధితులను పరామర్శిస్తుంటే నాయకులు, కార్యకర్తలు మాత్రం సీఎం...సీఎం... అంటూ నినాదాలు చేశారు. తోపులాటలో కార్యకర్తలు జగన్ వాహనంపై పడడంతో ఆయన భద్రతా సిబ్బంది వారిని తోసేశారు. కొంతమంది కార్యకర్తలపై చేయి చేసుకున్నారు.
నేతల నగదు, సెల్ఫోన్లు చోరీ..
జగన్ పర్యటనలో పలువురు నేతల నగదు, సెల్ఫోన్లు చోరీ అయ్యాయి. కరెంటు ఆఫీసు రోడ్డులో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్య నేతలు, ప్లాట్ల యజమానులు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే శిబిరం వద్దకు అనుమతించారు. అయినా, కార్యకర్తలు తోసుకుంటూ శిబిరం వద్దకు చేరుకునే క్రమంలో కొందరు నేతల నగదు, సెల్‌ఫోన్‌లు చోరీకి గురయ్యాయి. ఓ వ్యాపారికి చెందిన రూ.35 వేల నగదు, మరో నలుగురి సెల్‌ఫోన్లు తస్కరణకు గురయ్యాయి.
కూల్చివేతలో కేశినేని చిన్ని పాత్ర: జగన్
బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల కూల్చివేత వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడి పాత్ర ఉందని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కుటుంబాలకు సుప్రీంకోర్టు ఈనెల 31 వరకు ఊరటను ఇచ్చినప్పటికీ ప్రభుత్వ పెద్దలు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇళ్లను కూల్చివేశారన్నారు. పోలీసులు ప్రైవేటు పార్టీకి మద్దతు తెలిపారని ఆరోపించారు. ఈ ఇళ్లకు వీఎంసీ అనుమతి ఇవ్వడంతోపాటు బ్యాంకులు రుణాలు ఇచ్చాయన్నారు. వేరొకరి స్థలంలో ఇళ్లు నిర్మిస్తే అనుమతులు, రుణాలు, విద్యుత్, కుళాయి కనెక్షన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌ను రెండుసార్లు కలిసినా వారికి న్యాయం జరగలేదన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే విచారణ జరుగుతుందన్నారు.
అగ్రిగోల్డ్ ఇప్పుడు వద్దులే
జోజీనగర్‌కు వచ్చిన జగన్‌కు తన సమస్యను చెప్పుకొనేందుకు అగ్రిగోల్డ్ బాధితురాలు ప్రయత్నించారు. అయితే.. అగ్రిగోల్డ్ ఇప్పుడు వద్దులే అంటూ ఆమె విజ్ఞప్తిని జగన్ తిరస్కరించారు. ఆమె వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ‘అగ్రిగోల్డ్ సమస్యా... టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు వద్దులే’ అని జగన్ వ్యాఖ్యానించారు.