Education Department: టెన్త్ ప్రశ్నపత్రాల్లో మార్పులు
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:08 AM
పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. పరఖ్ రాష్ర్టీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా సవరించిన ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్లను విడుదల చేసినట్లు...
సృజనాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం
పరఖ్ సూచనలకు అనుగుణంగా సవరణ
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. పరఖ్ రాష్ర్టీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా సవరించిన ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్లను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా, పనితీరు ఆధారిత అవగాహనను పెంపొందించేలా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. అయితే ప్రశ్నలు, మార్కుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సృజనాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త బ్లూప్రింట్ ప్రకారం గణితం ప్రశ్నాపత్రంలో నాలెడ్జ్‌కు 20శాతం, అవగాహనకు 25ు, అప్లికేషన్‌కు 20శాతం, అనాలసి్‌సకు 15ు, ఎవాల్యుయేషన్‌కు 10 శాతం, సృజనాత్మకతకు 10ు వెయిటేజీ ఇచ్చారు. ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5, నాలుగు మార్కుల ప్రశ్నలు 8, రెండు మార్కుల ప్రశ్నలు 8, ఒక మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. అర్థమెటిక్ ప్రశ్నల్లో ఛాయిస్ తొలగించారు. క్లిష్టమైన ప్రశ్నలు 20 శాతం, సాధారణ స్థాయి ప్రశ్నలు 40ు, సులభమైన ప్రశ్నలు 40శాతం ఉండేలా మార్పులు చేశారు. సోషల్ స్టడీస్‌లో భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రంనకు 25 మార్కుల చొప్పున వెయిటేజీ ఇచ్చారు. తెలుగు సబ్జెక్టులో అవగాహన- ప్రతిస్పందనకు 24శాతం, వ్యక్తీకరణ - సృజనాత్మకతకు 44శాతం, భాషాంశాలకు 32 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఎనిమిది మార్కుల ప్రశ్నలు 7, లఘు ప్రశ్నలు 3, అతి లఘు ప్రశ్నలు 9, లక్ష్యాత్మక ప్రశ్నలు 14 ఇచ్చారు. కొత్త బ్లూ ప్రింట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పాఠశాలలకు సూచించిన పరీక్షల విభాగం అస్పష్టంగా ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి మార్పులు చేశారనేది వివరించకుండా సవరణలు చేసినట్లు తెలపడంతో ఉపాధ్యాయులు కూడా అయోమయానికి గురయ్యారు. చేసిన మార్పులను చెపితే... లక్షలాదిమంది విద్యార్థులకు ఉపయోగపడే సమాచారానికి విస్తృత ప్రచారం కల్పిస్తామంటూ మీడియా ప్రతినిధులు పలుదఫాలు అడిగినా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కనీసం స్పందించక పోవడం శోచనీయం. కాగా ఇప్పటికే ఈ ఏడాది టెన్త్ పరీక్షల మూల్యాంకనాన్ని పరీక్షల విభాగం అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేసింది.