Share News

రావణ వాహనంపై చంద్రఘంట

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:29 PM

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

   రావణ వాహనంపై  చంద్రఘంట
రావణ వాహనంపై శ్రీస్వామిఅమ్మవార్లు

శ్రీశైలంలో వైభంగా దసరా ఉత్సవాలు

శ్రీశైలం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు బుధవారం భ్రమరాంబికా అమ్మవారు చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనమిచారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఈ అలంకరణలో అమ్మవారు దశ భుజాలను కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపిణిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మస్తకంపై అర్ధచంద్రుడు అలరాడుతున్న కారణంగా ఈ దేవిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. ఈ దేవిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ దేవిని ఆరాధించడం వల్ల సౌమ్యం, వినమ్రత కలుగుతాయని వేదపండితులు తెలిపారు. అమ్మవారికి బిల్వ దళాలతో శాసో్త్రక్తంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో పూజించారు. మహామంగళ హారతులు ఇచ్చారు. అమ్మవారి క్షేత్రంలో కుమారి పూజలు నిర్వహించారు.

భ్రమరాంబికా అమ్మవారిని చంద్రఘంట అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి ఆది దంపతులు బయలుదేరగా ఉత్సవమూర్తుల ఎదుట కోలాటాలు, చెక్కభజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి భాజా భజంత్రీలు, బ్యాండ్‌ వాయిద్యాల నడుమ అమ్మవారులు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమలో ఆలయ ఈఓ శ్రీనివాసరావు, ఆలయ అధికారులు దదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాల్లో భాగంగా ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద సాయంత్రం తెనాలికి చెందిన ఎన.వరలక్ష్మి కల్యాణి బృందం నిర్వహించిన భక్తిరంజని, రాత్రి విజయనగరం జిల్లాకు చెందిన ఎం.ఎస్‌. సుప్రియ బృందం, నంద్యాల కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

నేడు కూష్మాండదుర్గ అలంకరణ : దసరా ఉత్సవాల్లో నాలుగో రోజు గురువారం అమ్మవారు కూష్మాండ దుర్గగా భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శివయ్యతో కలసి అమ్మవారు కైలాస వాహనంపై క్షేత్ర వీధుల్లో విహరిస్తారు.

Updated Date - Sep 24 , 2025 | 11:29 PM