అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:06 AM
అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
టీజీవీ కళాక్షేత్రంలో చంద్రబాబు జన్మదిన వారోత్సవాలు
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ‘చంద్రబాబు వజ్రోత్సవ జన్మదిన వారోత్సవాలు’ రెండోరోజు సోమవారం కొనసాగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బైరెడ్డి శబరి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ నేతలు చంద్రబాబు జన్మదినోత్సవాన్ని ఒక్కరోజు జరిపి అలసిపోయారని, కానీ కర్నూలు కళాకారులు వారం రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత ఐదేళ్లుగా కళాకారులకు ఎలాంటి పురస్కారాలు, సత్కారాలు లేవని, ఈ ఏడాది చంద్రబాబు కళాకారులను గుర్తించారన్నారు. కళాకారులను గౌరవిస్తే ప్రభుత్వం క్షేమంగా ఉంటుందని అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు, కళారత్న పురస్కార గ్రహీత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవ వారోత్సవాలు అవధానంతో ప్రారంభించామని చెప్పారు. యువ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంటులో రాష్ట్రంలోని రంగస్థల కళాకారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అనంతరం బైరెడ్డి శబరి ఇటీవల కందుకూరి పురస్కారాలు అందుకున్న రంగస్థల నటులు గాండ్ల లక్ష్మన్న, జీవీ శ్రీనివాసరెడ్డిలను ఘనంగా సత్కరించారు. అలాగే నాటక టెక్నీషియన్లు అయిన హార్మోనిస్టు బలరాముడు, తబలిస్టు మహేష్, కీబోర్డు ప్లేయర్ శ్రీనివాసాచారి, మేకప్‌మెన శ్రీనివాసులు, సురభి సంతోష్‌లను సత్కరించారు.
ఫ అలరించిన ‘జగదేక సుందరి సామా’
టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన ‘జగదేక సుందరి సామా’ పౌరాణిక పద్య నాటకం అసాంతం అలరించింది. పత్తి ఓబులయ్య, దివంగత నాటక రచయిత పల్లేటి కులశేఖర్ సంయుక్తంగా రాసిన ఈ నాటకానికి పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. అలనాటి చింతామణి నాటకాన్ని మరపిస్తూ ఈ సామా నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నాటకంలో ఇటీవల కోర్టు సినిమాలో నటించి పేరుతెచ్చుకున్న సురభి ప్రభావతి, హసీనా, జీవీ శ్రీనివాసరెడ్డి, సంగా ఆంజనేయులు, కె. బాలవెంకటేశ్వర్లు, రాజారత్నం, మహమ్మద్ మియా, గాండ్ల లక్ష్మన్న నటించారు. నాటకంలోని వివిధ సన్నివేశాల్లో సాగే పద్యాలకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.
ఫ నేడు ఏపీ నాటక అకాడమీ ఛైర్మన రాక
టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగుతున్న చంద్ర బాబు జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం ‘శ్రీకృష్ణ కమలపాలిక’ పద్య నాటక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ నాటక అకాడమీ చైర్మన గుమ్మడి గోపాలకృష్ణ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని కళాకారులు తమ సమస్యలను ఛైర్మనకు వినతిపత్రాల ద్వారా వివరించవచ్చని కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు.