AP CM Chandrababu: చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:10 AM
గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. చెత్తపై పన్ను వేసింది. మేం అధికారంలోకి రాగానే చెత్తపన్ను తొలగించాం. ఆ చెత్తను క్లీన్ చేసే బాధ్యతను తీసుకున్నాను
రౌడీయిజం, నేరాలు చేస్తే ఊరుకునేది లేదు
పల్నాడులో సీఎం చంద్రబాబు హెచ్చరిక
మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
2026 జూన్‌కు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్
ఉద్యమంలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
స్వచ్ఛాంధ్ర సేవలో ఐదు కోట్ల మంది భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపు
చెరువు వద్ద చీపురు పట్టి చెత్త తొలగింపు
మాచర్ల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. చెత్తపై పన్ను వేసింది. మేం అధికారంలోకి రాగానే చెత్తపన్ను తొలగించాం. ఆ చెత్తను క్లీన్ చేసే బాధ్యతను తీసుకున్నాను. రాష్ట్రంలో చెత్తనే కాదు, చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తా. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే ఊరుకునేది లేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మాచర్ల చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ కార్మికులతో కలసి చీపురు పట్టి తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమంలా అమలు చేస్తామని అన్నారు. స్వచ్చాంధ్ర సేవా కార్యక్రమంలో ఐదు కోట్ల మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పచ్చదనం పెంపులో ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. మున్సిపల్ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పరిశుభ్రమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. గత పాలకులు వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబరు 2వ తేదీ కంటే ముందుగానే 100 శాతం క్లియర్ చేశామని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో సమర్థంగా పనిచేసిన పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, ఆ శాఖ మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు. ‘‘పిల్లలకు, వృద్ధులకు హాస్టళ్లు పెట్టాం. ఇక నుంచి పశువులకు వసతి ఏర్పాటు చేస్తాం. షెడ్లు వేసి పశువులను వాటిలో ఉంచి గ్రాసం అందిస్తాం. ఈ పథకానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం’’ అని అన్నారు.

స్వచ్ఛాంధ్ర అవార్డులు
‘‘సర్క్యులర్ ఎకానమీలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టిస్తాం. చెత్త నుంచి కరెంటు, కంపోస్టు తయారు చేస్తున్నాం. కొంత చెత్తను రీ సైక్లింగ్‌కు పంపిస్తున్నాం. డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఎలక్ట్రికల్ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే విశాఖ, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హీ ేసవా ప్రచారం నిర్వహిస్తున్నాం. పారిశుధ్య కార్మికుల కోసం ఆరోగ్య, సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పట్టణ పారిశుధ్య కార్మికులు ఒక్కొక్కరికి రూ.కోటి బీమా పథకాన్ని ప్రారంభించాం. 16 విభాగాల్లో 52 రాష్ట్రస్థాయి, 1,421 జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. అక్టోబరు 2వ తేదీన సఫాయి మిత్రలు, అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీలు, స్వచ్ఛ వలంటీర్లను ఆయా జిల్లాల కలెక్టర్లు సత్కరించాలి’’ అని చంద్రబాబు అన్నారు.
ఆడబిడ్డలకు ఎన్నో కార్యక్రమాలు
‘‘కూటమిని 94 స్ట్రయిక్ రేట్‌తో గెలిపించారు. అది ప్రజలు చూపించిన చొరవ. అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఆదాయాన్ని పెంచుతాను. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాను. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. ఆడబిడ్డలకు తల్లికి వందనం అమలు చేశాను. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తానని మోసం చేసి, ఒక్క పిల్లవాడికే ఇచ్చారు. ఇప్పుడు ఇంటిలో ఏడుగురు పిల్లలు ఉంటే ఆ ఏడుగురికి తల్లికి వందనం వచ్చిందని చెబితే నేను చాలా అనందపడ్డాను. జనాభా తగ్గిపోతూ ఉంది. పిల్లలు భారం అనుకుంటున్నారు. అందుకే రూ.15,000 ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో పిల్లలే ఆస్తి. 65 లక్షల మంది పిల్లలకు 10 వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చిన కార్యక్రమం తల్లికి వందనం. ఆడబిడ్డలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. మహిళలు పనులకు ఉచితంగా వెళ్లే పరిస్థితి కల్పించాను. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాం. ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని అమలు చేశాం. మహిళల కోసం అనేక కార్యక్రమాలు ఇచ్చాం. ఉద్యోగాలు, విద్యలో ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చాం. నిన్నటి వరకు 50 శాతానికి పరిమితమైన అభివృద్ధి వంద శాతం సాధించే పరిస్థితి వచ్చిందంటే దానికి ఆడబిడ్డల కృషి ఉంది. మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.
పేదలకు ఎంతో సంక్షేమం
‘‘రైతులందరికీ అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తాం. పైసా అవినీతి లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. నైపుణ్యాభివృద్ధి ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరో తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నెలకు రెండు రోజులలో.. ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండోది పేదల సేవలో పాల్గొంటా. కొంత మంది మాటలు చెబుతుంటారు.. ఏమీ అమలు చేయరు. ఎటువంటి చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా.. చరిత్ర తిరిగి రాయాలన్నా నాకే సాధ్యం’ అని అన్నారు.
త్వరలో సంజీవని ప్రాజెక్టు
‘‘ప్రజలు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. యోగా డే ద్వారా 30 రోజులు యోగా శిక్షణ ఇచ్చాం. 3.20 లక్షల మందితో విశాఖలో నిర్వహించిన యోగా రికార్డు సాధించింది. త్వరలోనే సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాను. యూనివర్శల్ హెల్త్ తీసుకొస్తాను. దీనిలో ధనిక, పేద తేడా లేకుండా అందరికి రూ 2.50 లక్షల బీమా చేయిస్తాం. పేదవారి అందరికీ ఎన్‌టీఆర్ వైద్య సేవ కింద రూ.25 లక్షల వరకు ఆరోగ్య ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. నాడు హనుమంతుడు సంజీవని ఔషధం తీసుకొచ్చి లక్ష్మణుడుని కాపాడారు. పేదల ఇంటి దగ్గరనే వైద్యం అందించే విధంగా సంజీవనిని అమలు చేయబోతున్నాం. 2047కు ఏపీలో 50 శాతం గ్రీన్ కవర్ ఉండాలన్నదే లక్ష్యం. రానున్న నాలుగేఽళ్లలో 31 నుంచి 37 శాతానికి గ్రీన్ కవర్ పెంచాలి. స్వచ్ఛమైన గాలి కోసం చెట్లు పెంచే బాధ్యత మనందరిది’’ అని చంద్రబాబు అన్నారు.
మాచర్లకు చంద్రబాబు వరాలు
‘‘చాలా కాలం తర్వాత మాచర్లకు స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నికల ముందు వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు. గతంలో ఇక్కడ చాలా అరాచకాలు జరిగాయి. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. పల్నాడులో ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి.. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ఇక్కడి నేతలకు పట్టింది. ఇకనైనా ఆ నేతలు పద్ధతులు మార్చుకోకపోతే వారిని ప్రజాస్వామ్యం క్షమించదు. మాచర్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. పల్నాడు జీవనాడి వరికపూడిశెల.. 60 ఏళ్ల చిరకాల కోరికను సఫలీకృతం చేసే బాధ్యత తీసుకుంటాను. 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇక్కడకు మిరప బోర్డును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తా. పల్నాటి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు వైద్య శిబిరాన్ని సందర్శించారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల విలువైన చెక్కును అందించారు.
రెండు బంగారు కుటుంబాల దత్తత
చంద్రబాబు సమక్షంలో రెండు బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. మాచర్ల 11 వార్డుకు చెందిన బత్తుల నీలావతిని బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. పీ4 కింద దత్తత తీసుకోవడానికి కేసీపీ సంస్థ మార్గదర్శిగా నిలిచింది. మాచర్లకు చెందిన షేక్ నజీరున్‌ను మరో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. దుర్గికి చెందిన విత్తన కంపెనీ యజమాని యాగంటి వెంకటేశ్వర్లు మార్గదర్శిగా నిలిచారు. ఆ కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. వారి పిల్లలను చదివించాలని మార్గదర్శులకు సూచించారు.
