Share News

CM Chandrababu: ఆ తప్పులు పునరావృతం కావు

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:33 AM

సింగపూర్‌తో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ చేసిన తప్పులను పునరావృతం కానివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: ఆ తప్పులు పునరావృతం కావు

  • జగన్‌ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దడానికే సింగపూర్‌ వచ్చా

  • ఆ దేశ మంత్రి లాంగ్‌తో చంద్రబాబు

  • మాకు మీ సహకారం కావాలి

  • గ్రీన్‌ ఎనర్జీ, డేటా సెంటర్లకు సహకరించండి

  • హౌసింగ్‌, సబ్‌ సీ కేబుల్‌ రంగాల్లో కలసి పనిచేసేందుకు సింగపూర్‌ సంసిద్ధత

అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): సింగపూర్‌తో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ చేసిన తప్పులను పునరావృతం కానివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకే తమ బృందం సింగపూర్‌కు వచ్చిందని స్పష్టం చేశారు. గ్రీన్‌ ఎనర్జీ రంగం, డేటా సెంటర్ల ఏర్పాటులో సింగపూర్‌ సహకారాన్ని కోరారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు సోమవారం ఆ దేశ విద్యుత్‌, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి టాన్‌ సీ లాంగ్‌, ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ భారీ ప్రాజెక్టులను చేపడుతోందని, ఇందులో సింగపూర్‌ సహకారాన్ని ఆశిస్తున్నామని మంత్రి టాన్‌ సీ లాంగ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, ట్రాన్స్‌మిషన్‌ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్‌ కంపెనీలు భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమది స్నేహపూర్వక ప్రభుత్వమని తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటులో సింగపూర్‌ సహకారం కావాలని కోరారు. ‘లాజిస్టిక్‌ రంగంలో సింగపూర్‌ బలంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో పోర్టుల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. ఈ రంగాల్లో రాష్ట్రానికి సింగపూర్‌ చేయూత అవసరం. మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వాణిజ్య విభాగాల్లో సింగపూర్‌ సహకరించాలి’ అని కోరారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్‌ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై టాన్‌ సీ లాంగ్‌తో చంద్రబాబు సమీక్షించారు. రికార్డులను సరిచేసేందుకు సింగపూర్‌కు వచ్చినట్లు సీఎం వెల్లడించారు. సింగపూర్‌ను చూశాకే హైదరాబాద్‌లో రాత్రి సమయంలో రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం వివరించారు. ఏపీలో నవంబరులో విశాఖపట్నంలో జరగనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని టాన్‌ సీ లాంగ్‌ను ఆహ్వానించారు.


ఏపీతో కలిసి పనిచేస్తాం: సింగపూర్‌

గృహ నిర్మాణం, సబ్‌ సీ కేబుల్‌ రంగాల్లో ఏపీతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రంగాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్‌ మంత్రి టాన్‌ సీ లాంగ్‌ స్పష్టం చేశారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ప్రపంచ బ్యాంకుతో కలసి పనిచేస్తున్నామని వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌ వచ్చినప్పుడు చంద్రబాబుతో కలసి చర్చించిన విషయాలను లాంగ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 04:35 AM