Chandrababu Slams Jagan: పెట్టుబడులు రాకుండా జగన్ కుట్రలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:35 AM
రాష్ట్రానికి పెట్టుబడులతో కంపెనీలు వస్తుండటంపై మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దుయ్యబట్టింది.....
వోల్ట్ సన్ అనామక కంపెనీ కాదు
ఆర్జే కార్ప్ గ్రూప్‌లో ఇదీ ఓ భాగం
ఆర్జే గ్రూప్ టర్నోవర్ రూ.90,000 కోట్లు
ప్రభుత్వ పాలసీల్లో భాగంగానే రాయితీలు
జగన్ పత్రికలో తప్పుడు రాతలు: ప్రభుత్వం
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులతో కంపెనీలు వస్తుండటంపై మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దుయ్యబట్టింది. వోల్ట్ సన్ ల్యాబ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడాన్ని తప్పుపడుతూ జగన్ పత్రికలో రాసిన కథనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే, వాటిని అడ్డుకునేలా కుట్రల పార్టీ వైసీపీ కుట్రలు కొనసాగిస్తూనే ఉందని సోమవారం ప్రభుత్వం ఒక ప్రకటనలో విమర్శించింది. వోల్ట్ సన్ ల్యాబ్ ఏదో అల్లాటప్పా సంస్థ కాదని, ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరింది. కేవలం భూముల కోసమో? లేక ఇతర అవసరాల కోసమో స్థాపించిన సంస్థ అంతకంటే కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రవి జైపురియా నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్జే కార్ప్ గ్రూప్‌నకు మంచి పేరుందని, ఇందులో వోల్ట్ సన్ ల్యాబ్ కూడా భాగమని వివరించింది. రూ.90,000 కోట్ల టర్నోవర్ గల ఆర్జే కార్ప్ సంస్థ రాష్ట్రంలో 37 ఎకరాల కోసం వోల్ట్ సన్ ల్యాబ్‌ను స్థాపించిందంటూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జే కార్ప్ గ్రూప్‌లో భాగమైన వోల్ట్ సన్ ల్యాబ్ ఏదో అనామక కంపెనీ కాదని స్పష్టం చేసింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఎంపీఎ్‌సఈసీలో రూ.1743 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15వ తేదీన ఉత్తర్వు జారీ చేసినట్లు వివరించింది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగా వేగవంతంగా ప్రాజెక్టు పూర్తిచేయడానికి రాయితీలను ప్రకటించినట్లు పేర్కొంది. వోల్ట్ సన్ సంస్థ 2 గిగావాట్ల సమగ్ర సౌర ఉత్పత్తి మాడ్యూల్‌ను తయారు చేస్తుందని వివరించింది. ఇంత మంచి పేరున్న సంస్థతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందం చేసుకున్నామని తెలిపింది. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా చెల్లుబాటు కావని తాజాగా విశాఖ సదస్సులో పెట్టుబడుల ఒప్పందాలు తేల్చి చెప్పాయని వెల్లడించింది. కియ, గూగుల్ లాంటి సంస్థలకు ఇచ్చే రాయితీలపైనా జగన్ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేసింది. తాజాగా వోల్ట్ సన్ ల్యాబ్ విషయంలోనూ ఇదే తరహాలో పెట్టుబడులకు అడ్డుపడేలా కుట్ర పన్నారని ధ్వజమెత్తింది.
వివిధ రంగాల్లో ప్రావీణ్యం
ఆర్జే కార్ప్ సంస్థకు ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, రియల్ ఎస్టేట్ తదితర రంగాలతో పాటు పెప్సికో బాట్లింగ్ భాగస్వామిగా, కేఎ్‌ఫసీ, పిజ్జాహట్, కాస్టాకాఫీ వంటి ప్రధాన క్యూఎ్‌సఆర్ బ్రాండ్‌లను ఫ్రాంచైజీ రూపంలో నడిపే సంస్థగా పాపులారిటీ ఉందని ప్రభుత్వం వివరించింది. వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ (వీబీఎల్) అనేది ఆర్జే గ్రూప్‌నకు ప్రధాన సంస్థ అని పేర్కొంది. దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా ఈ గ్రూప్ సంస్థేనని స్పష్టం చేసింది. జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరున్న ఈ గ్రూప్ పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టిందని వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం కోసం పలు దేశాలు వివిధ పాలసీలను అమలు చేస్తున్నాయని.. అయితే రాష్ట్రానికి మేలు జరగకుండా, కంపెనీలు రాకుండా, భయపెట్టేలా జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించింది. నిర్మాణాలు చేపట్టేందుకు ఎలా ముందుకొస్తారో చూస్తామంటూ కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.