Chief Minister Chandrababu Naidu: అన్ని పంటలకూ మద్దతు
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:43 AM
రాష్ట్రంలో రైతులు పండిస్తున్న అన్ని పంటలకు మద్దతు ధర దక్కాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు...
అడ్డంకులు లేకుండా కొనుగోళ్లు, చెల్లింపులు
గోనె సంచుల సరఫరాలో లోపాలు ఉండొద్దు
పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులపై కేంద్రంతో సంప్రదింపులు
అరటి, జొన్న ధరలపై సమస్యలను అధిగమించాలి
ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో మాట్లాడండి
వ్యవసాయ, పౌరసరఫరాల సమీక్షలో చంద్రబాబు
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు పండిస్తున్న అన్ని పంటలకు మద్దతు ధర దక్కాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటల సాగులో రైతులు ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రబీ సీజన్‌లో 50.75 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం రూ.13,451 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కొనుగోలు చేశాక రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలి. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు గోనె సంచులను అందించాలి’ అని ఆదేశించారు.
సమీక్ష నుంచే కేంద్ర కార్యదర్శికి ఫోన్
పత్తి కొనుగోళ్లలో సీసీఐ తెచ్చిన కొత్త విధానాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో సమీక్ష సమావేశం నుంచే కేంద్ర టెక్స్‌టైల్స్ కార్యదర్శి నీలం రావుతో చంద్రబాబు మాట్లాడారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎదురవుతున్న సమస్యను వివరించారు. కొత్తగా తెచ్చిన విధానాల వల్ల రాష్ట్రంలో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నందున సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం అధికారులకు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ‘పత్తి కొనుగోళ్ల అంశంలో ఎదురవుతున్న ఇబ్బందులపై నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరపాలి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు ఈ బాధ్యతలు అప్పగించాలి. అరటి, జొన్న ధరలపై సమస్యలను అధిగమించాలి. స్థానిక ట్రేడర్లు, ఎగుమతిదారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలి. ధాన్యం కొనుగోళ్లపైనా రైస్ మిల్లర్లతో సంప్రదింపులు జరపాలి. భారీ వర్షాలు వచ్చే అవకాశముంటే రైతులను అలర్ట్ చేయడంతోపాటు పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని దిశానిర్దేశం చేశారు.