Share News

CM Chandrababu: అలా కాదు.. ఇలా చేయండి

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:16 AM

మంచీచెడులు చర్చిస్తూ.. తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషిస్తూ వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న భేటీలు కొనసాగుతున్నాయి.

CM Chandrababu: అలా కాదు.. ఇలా చేయండి
CM Chandrababu Naidu

  • ఎమ్మెల్యేలకు బాబు దిశానిర్దేశం..

  • వారితో కొనసాగుతున్న భేటీలు

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): మంచీచెడులు చర్చిస్తూ.. తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషిస్తూ వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న భేటీలు కొనసాగుతున్నా యి. ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించారు. ఉత్తమ పద్ధతులు ఆచరిస్తున్న ప్రజాప్రతినిధుల నుంచి ఆ వివరాలూ తీసుకుంటున్నారు. బాగా చేస్తున్నారంటూ అభినందిస్తున్నారు. సుమారు గంటపాటు జరుగుతున్న భేటీల్లో ప్రతి అంశాన్నీ వివరించి సరిచేసుకోవాల్సిన అంశాలను నిర్మొహమాటంగా వివరిస్తున్నారు. ఓ మంత్రితో భేటీలో.. ‘తొలిసారి ఎమ్మెల్యేవైనప్పటికీ యువకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మంత్రి పదవి ఇచ్చాను.

కానీ మీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. మీది కీలకమైన నియోజకవర్గం.. ప్రత్యర్థి కూడా బలమైనవాడే. అలాంటిచోట మరింత సమర్థంగా పనిచేయకపోతే చాలాకష్టం. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మార్చుకోవాలి. లేకుంటే రాజకీయంగా చాలా ప్రభావం పడుతుంది’ అని చంద్రబాబు వివరించారంటే ఆయన క్షేత్రస్థాయి నుంచి ఎంత పకడ్బందీగా వివరాలు తెప్పించుకుంటున్నారో అర్థమవుతోంది. సీనియర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకూ మినహాయింపు లేదు. వారి ప్లస్సులు.. మైనస్సులనూ సీఎం వివరిస్తున్నారు. మంగళవారం నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, మామిడి గోవిందరావుతో సమావేశమయ్యారు.

Updated Date - Jul 23 , 2025 | 08:25 AM