CM Chandrababu: కలిసి పనిచేసి కష్టాన్ని ఎదుర్కొన్నాం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:41 AM
మొంథా తుఫానును టీం స్పిరిట్‌తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా అదే స్ఫూర్తి కొనసాగించాలని మొంథా తుఫాను ఫైటర్ల అభినందన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నారు.
ఇదే స్ఫూర్తితో విపత్తులను ఎదుర్కొందాం
అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు అద్భుతం
సాంకేతికతను వినియోగించి‘మొంథా’ నష్టాన్ని తగ్గించాం
తుఫాను ఫైటర్లందరికీ ధన్యవాదాలు: చంద్రబాబు
137 మందికి మెమొంటోలు,ప్రశంసా పత్రాల అందజేత
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫానును టీం స్పిరిట్‌తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా అదే స్ఫూర్తి కొనసాగించాలని మొంథా తుఫాను ఫైటర్ల అభినందన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో తుఫాను సమయంలో విశేషసేవలు అందించిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశం. ఈసారి తుఫాను నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ప్రజలందరి తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని సీఎం అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కితాబునిచ్చారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే...
సాంకేతిక సాయంతో అధిగమించాం
రాష్ట్రానికి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి రాయలసీమకు కరువు, రెండోది కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్థ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈ రోజు రాయలసీమలో కరువు లేకుండా చేశాం. గతంలో హరికేన్ వచ్చింది. ఉభయగోదావరి జిల్లాల్లో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగాం. ఈసారి మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఓ బృందాన్ని సిద్ధం చేశాం. వారంతా అద్భుతంగా పనిచేశారు. వీలైనంత వరకు ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూశాం.
టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఆలయ బోర్డు మెంబర్ ఏవీరమణ, టీడీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ రాజశేఖర్, నేతలు పర్చూరి కృష్ణ, వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం
డ్రోన్ల ద్వారా తుఫానులో చిక్కుకున్న వారి ప్రాణాలు కూడా కాపాడాం. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని, ఓ ప్రార్థనా మందిరంలో చిక్కుకున్న 15 మందిని కూడా కాపాడగలిగాం. అంతా కలిసి చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. 602 డ్రోన్లను ముందస్తుగానే సిద్ధం చేసుకున్నాం. ముందస్తు జాగ్రత్తగా కాల్వల పూడికలు, అడ్డంకులు తొలగించాం. అందుకే భారీ వర్షాలు కురిసినా నీరు అంతా కిందికి సులువుగా ప్రవహించింది. తద్వారా వరద ముప్పు తగ్గింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారు. సీఎస్ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతా కలిసి ప్రజలను కాపాడటంలో సఫలీకృతులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసులు అంతా బాగా పనిచేశారు. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్ఫూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రజలు కూడా ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. వారి సహకారం కూడా ప్రభుత్వానికి అవసరం.
త్వరలో గ్రామస్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థ
గతంలో ఏఅంశం చెప్పాలన్నా గ్రామాల్లో టాంటాం వేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు పంపామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో రాజధాని నుంచే గ్రామస్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో సీఎస్ విజయానంద్, మంత్రులు అనిత, దుర్గేష్, వాసంశెట్టి సుభాశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.