Agiripalli: జనంతో సీఎం మమేకం
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:33 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగిరిపల్లిలో 'పీ4' కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. సెలూన్ కార్మికులు, రైతులు, గొర్రెల కాపరులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు జనంలో సామాన్యుడిలా కలిసిపోయారు. కుల వృత్తులతో జీవనం సాగిస్తున్న వారితో మాట కలిపారు. వారి పనుల్లో ఉన్న కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో శుక్రవారం ‘పీ4’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు... బత్తుల జగన్నాథానికి చెందిన సెలూన్‌కు వెళ్లారు. అక్కడి కుర్చీలో కూర్చుని జగన్నాథంతో, ఆయన కుమారుడితో మాట్లాడారు. ఆధునాతన పరికరాలు కొనగలిగే స్తోమత లేదని వారు చెప్పడంతో... అప్పటికప్పుడే వారికి కొన్ని పరికరాలను అందించారు. ఆగిరిపల్లికి చెందిన రైతు కోటయ్య, గొర్రెల కాపరి శివయ్య ఇళ్లకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారికి ఆదాయం గురించి ఆరా తీశారు. తరతరాలుగా ఇదే వృత్తిలో ఉన్నామని, పెద్దగా ఆదాయం లేదని వారు తెలిపారు. అక్కడే ఉన్న చిన్నారిని... ఏం చదువుతున్నావు అని చంద్రబాబు ప్రశ్నించారు. పెద్దయ్యాక ఏం చేస్తావని అడిగారు. ‘మీలాగే సీఎం అవుతాను’ అని ఆ అమ్మాయి బదులివ్వడంతో... ‘బాగా చదువుకుని వృద్ధిలోకి రా’ అని దీవించారు. అక్కడే... గొర్రె పిల్లను ఎత్తుకున్నారు. పశువులకు పచ్చిక అందించారు. పీ-4 సభా వేదిక కుమ్మరి కులస్తులతో మాట్లాడి... కొద్దిసేపు కుమ్మరి చక్రం కూడా తిప్పారు.
- ఆగిరిపల్లి, ఆంధ్రజ్యోతి