Share News

YS Sharmila: గుడులు కట్టాలని ఎవరడిగారు

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:28 AM

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే చంద్రబాబు మద్దతుతోనేనని, అయితే.. మిత్రధర్మం ముసుగులో చంద్రబాబు ఆర్‌ఎస్ఎస్‌వాదిగా మారిపోయారని...

YS Sharmila: గుడులు కట్టాలని ఎవరడిగారు

  • బాబు ఆర్‌ఎస్ఎస్‌వాదిలా మారిపోయారు: షర్మిల

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే చంద్రబాబు మద్దతుతోనేనని, అయితే.. మిత్రధర్మం ముసుగులో చంద్రబాబు ఆర్‌ఎస్ఎస్‌వాదిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. దళితవాడల్లో టీటీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరడిగారని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. టీటీడీ చాలా పవిత్రమైన గుడి కాదని ఎవరన్నారని, టీటీడీ దగ్గర డబ్బులెక్కువ ఉంటే.. దళిత వాడల్లో గుడులకు బదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ హాస్టళ్లలో 200 మంది విద్యార్దులకు ఒకే బాత్రూమ్‌ ఉన్న పరిస్థితులు ఉన్నాయని, అలాంటిచోట్ల టీటీడీ డబ్బులతో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దళితవాడల్లో ఐదువేల గుడులు కడితే పూజారులుగా ఎస్సీలను నియమిస్తారా అని ప్రశ్నించారు. దళితవాడల్లో గుడులు కట్టాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

రూ.15,780 కోట్ల భారం మోపి.. 923 కోట్లే తగ్గిస్తారా?

గోరంత చేసి కొండంతలుగా చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనని షర్మిల విమర్శించారు. కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత 15 నెలల్లో ప్రజలపై రూ.15,780 కోట్ల ట్రూఅప్‌ భారాన్ని మోపారని ఆరోపించారు. ఇప్పుడు ట్రూడౌన్‌తో తగ్గిన భారం రూ.923 కోట్లు మాత్రమేనని అన్నారు. 2024-25లో సర్దుబాటు పేరిట అదనంగా దోచిన రూ.923 కోట్లను ఈఆర్‌సీ మందలించడంతో తిరిగి చెల్లించారని షర్మిల తెలిపారు. అయితే, అది కూటమి ప్రభుత్వం వచ్చాక తగ్గించిన మొత్తంగా చంద్రబాబు డబ్బాకొట్టుకోవడం, సమర్థత, అనుభవం వంటి మాటలు చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు.

Updated Date - Sep 30 , 2025 | 05:29 AM