Vizag Steel: ఉక్కు సంకల్పం!
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:38 AM
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్‌ఐఎన్‌ఎల్....
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నారని ప్రతిపక్షాలు నానాయాగీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సాయంతో అదిప్పుడు ప్రగతి దిశగా పయనిస్తోంది. అటు కేంద్రంలోని మోదీ సర్కారు, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానికి అండగా నిలుస్తున్నాయి. గత 17 నెలల్లో రెండూ కలిపి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అందించడం గమనార్హం.
17 నెలలు.. రూ.15 వేల కోట్లు
విశాఖ ఉక్కుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సాయమిది
దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకూ ఇవ్వనంతగా చేయూత
17 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 48 నుంచి 80 శాతానికి పెంపు
జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాల పాలవుతున్నా పట్టించుకోని వైనం
పైగా భూముల అమ్మకానికి యత్నం
కూటమి ప్రభుత్వం రాగానే.. ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు
మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు
కేంద్రం నుంచి 11,400 కోట్ల సాయం
రూ.2,400 కోట్ల విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
నిరంతరాయంగా కరెంటు, నీటి సరఫరా
రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తుల కొనుగోలు
ఇంత చేస్తున్నా వైసీపీ విష ప్రచారం
కార్మికుల జీవితాలతో చెలగాటం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఆవిర్భవించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. అది అధికారంలోకి వచ్చే నాటికి స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాలతో ఆర్థిక సంక్షోభంలో ఉంది. దానిని ఆదుకునేందుకు 17 నెలల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకూ ఇవ్వని స్థాయిలో రూ.వేల కోట్ల ఆర్థిక సాయాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సాధించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరమవుతుందన్న విపక్షాల ప్రచారాన్ని తప్పు అని రుజువు చేస్తూ.. దానిని పురోగతి దిశగా నడిపిస్తోంది. కర్మాగారాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ఇప్పటికే రూ.11,440 కోట్లు ఇవ్వగా.. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఆర్థిక సహకారం అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేవలం 17 నెలల్లో ప్లాంట్ పునర్వైభవానికి అందిన సాయం అక్షరాలా రూ.15 వేల కోట్లు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతర సంప్రదింపులతో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా చూడాలన్న కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో పలుమార్లు సమావేశమై ఆర్థిక సహకారం అందేలా చూశారు. స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించడానికి 2024లో రూ.500 కోట్ల ఈక్విటీని, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సుగా రూ.1,140 కోట్లను కేంద్రం రుణంగా విడుదల చేసింది. ఈ ఆర్థిక చేయూతతో అప్పటి వరకు ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుండగా.. 2024 అక్టోబరులో రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయడం ప్రారంభమైంది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం 49 నుంచి 67 శాతానికి పెరిగింది. చంద్రబాబు సంప్రదింపుల మేరకు కేంద్రం మరోమారు రూ.9,800 కోట్లను ఈక్విటీ రూపంలో విడుదల చేసింది. గతంలో తీసుకున్న రూ.1,140 కోట్ల రుణాన్ని ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే మొత్తం రూ.11,400 కోట్లు ఆర్థిక సాయం చేసిందన్న మాట. దీంతో గత నెలనాటికి ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 80 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రోజుకు 16,322 టన్నుల హాట్‌మెటల్‌ను ఉత్పత్తి చేయగలుగుతోంది.
28 వేల మంది ఉద్యోగులకు భరోసా..
విశాఖ ఉక్కు కర్మాగారం 1992లో ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైంది. 2001-02లో లాభాల దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. 2005-06లో దాని సామర్థ్యం 6.3 మిలియన్ టన్నులకు.. ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నులకు పెరిగింది. నవరత్న కంపెనీ హోదాతో 2014-15లో రూ.12,958 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అయితే ముడిసరుకు లభ్యత లేకపోవడంతో 2022 నుంచి స్టీల్ ప్లాంట్ సామర్థ్యం తగ్గుతూ వచ్చింది. మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నే్‌సలు ఉండగా, తొలుత రెండు బ్లాస్ట్ ఫర్నే్‌సలు, ఆ తర్వాత ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేసే పరిస్థితికి వచ్చింది. నష్టాల కారణంగా నాడు ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా కుదించుకుంది. అయితే నాడు ప్లాంట్ ఎంత తీవ్ర నష్టాల్లో ఉన్నా వైసీపీ సర్కారు కనీసం స్పందించలేదు. పైగా స్టీల్‌ప్లాంట్ భూములు అమ్మేందుకు ప్రయత్నాలు చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల భద్రతే లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభించింది. అక్కడ 13 వేల మంది రెగ్యులర్, 15 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో రాజకీయ సంప్రదింపులు జరిపి.. కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా నిలువరించింది. స్టీల్ ప్లాంట్ రెండేళ్లపాటు బకాయి పడిన రూ.2,400 కోట్ల విద్యుత్ బకాయిలను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఈక్విటీలుగా మార్చి ప్లాంట్‌పై భారాన్ని తగ్గించింది. ఇప్పటికీ రూ.200 కోట్లకుపైగా విద్యుత్ బిల్లులు బకాయిపడినా నిరంతరం కరెంటు సరఫరా జరిగేలా చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించి.. అమలు చేస్తోంది.
గతంలోనూ ఆదుకుంది టీడీపీయే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు సంక్షోభానికి గురైనా దానిని ఆదుకుంటూ వస్తున్న ఘనత టీడీపీకే దక్కుతుంది. సుమారు 25 ఏళ్ల క్రితం ప్లాంట్ సంక్షోభానికి గురైన సమయంలో.. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు రూ.2,800 కోట్లు ఇప్పించి ఆదుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా సంక్షోభం తలెత్తినప్పుడు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బందులు రాకుండా గంగవరం పోర్టు నుంచి నిరంతరం సరఫరా జరిగేలా చూసిన ఘనత కూడా చంద్రబాబుదే. ఈ వాస్తవాలను మరుగునపరుస్తూ తప్పుడు ప్రచారాలతో వైసీపీ విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల పేరుతో విశాఖ స్టీల్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని.. మోదీ ప్రభుత్వ సహకారంతో మరింత బలోపేతం చేస్తామని కూటమి పెద్దలు స్పష్టం చేస్తున్నారు.