Share News

CM Chandrababu: రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:11 AM

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. రాజకీయ మూర్ఖులే అలా మాట్లాడతారు. వీళ్లు ఎప్పటికీ బాగుపడరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నేతలపై మండిపడ్డారు

CM Chandrababu: రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు

  • పెట్టుబడులపై ఇష్టమొచ్చినట్లు వాగుతున్నారు

  • భవిష్యత్‌లో బ్రాండ్‌ ఏఐగా ఆంధ్రా

  • వైకుంఠపాళితో జీవితాలు బాగుపడవు

  • 22 మంది ఎంపీలు ఉండడంతో కేంద్రంలో పనులన్నీ అవుతున్నాయి

  • ఉద్యోగులూ.. స్మార్ట్‌గా పనిచేయండి

  • సాయంత్రం 6 తర్వాత పనిచేయొద్దు

  • పున్నమి ఘాట్‌ దీపావళి వేడుకల్లో సీఎం

అమరావతి/విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. రాజకీయ మూర్ఖులే అలా మాట్లాడతారు. వీళ్లు ఎప్పటికీ బాగుపడరు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో కృష్ణా నది పున్నమి ఘాట్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖకు 15 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి వచ్చిందన్నారు. ‘ఏ అంటే ఆంధ్రప్రదేశ్‌.. రానున్న రోజుల్లో బ్రాండ్‌ ఏఐ గా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుంది. ఏఐలో విశాఖపట్నం హెడ్‌క్వార్టర్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు. పదేళ్లలో ఈ రంగంలో ఊహించనంత అభివృద్ధి జరుగుతుందని.. అన్ని రంగాల్లో పెనుమార్పులొస్తాయన్నారు. ‘వైజాగ్‌ ఏఐ హబ్‌ నుంచే ప్రపంచం మొత్తానికీ సేవలు అందించాలి. యువత ఏఐ నేర్చుకుని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ సేవలందిస్తున్న ప్రతి ప్రాంతానికీ ఈ డేటా సెంటర్‌తో అవసరం ఉంటుంది. దీనిని ఉపయోగించుకోవాలనుకునే వారు వైజాగ్‌లో సంస్థలు పెడతారు. కేబుల్‌ను సింగపూర్‌ వరకు తీసుకెళ్లి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారు’ అని చెప్పారు. జీఎ్‌సటీ 2.0 సంస్కరణలతో వినియోగదారులు, చిరువ్యాపారులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. వీటిపై దసరా నుంచి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు.


2019-24 మధ్య పండుగలే జరుపుకోలేని పరిస్థితులున్నాయని చెప్పారు. ఒకప్పుడు దసరా అంటే కోల్‌కతా, మైసూరు గుర్తొచ్చేవని.. ఈసారి దసరా అంటే విజయవాడ కూడా గుర్తొచ్చేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని.. ఇందుకు ‘వైబ్రెంట్‌ విజయవాడ’కు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, రాష్ట్ర జీఎ్‌సటీ కమిషనర్‌ అహ్మద్‌ బాబు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), ప్రభుత్వ విప్‌ యార్లగడ్ద వెంకట్రావు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్‌, గద్దే రామమోహనరావు, మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


నరకాసురుడికి ప్రజలే బుద్ధి చెప్పారు

సమాజాన్ని అతలాకుతలం చేసిన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామతో వచ్చి వధిస్తే.. రాష్ట్రంలోని నరకాసురుడికి ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో 94 శాతం స్ర్టైక్‌ రేట్‌తో మా కూటమిని గెలిపించారు. రాష్ట్రంలో ఇక వైకుంఠపాళి వద్దు. అది ఉంటే మన జీవితాలు బాగుపడవు. 22 మంది ఎంపీలు ఉండడం వల్ల కేంద్రంలో అన్ని పనులూ అవుతున్నాయి. 16 నెలల్లో మళ్లీ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాం. రికార్డు స్థాయిలో పింఛన్లు, స్త్రీశక్తి, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, అన్న క్యాంటీన్లు, దీపం-2, ఆటోడ్రైవర్లకు సాయం అందించాం. అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. రూ.50-60 వేల కోట్ల విలువైన పనులను మూడేళ్లలో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ పెడుతున్నాం. వైజాగ్‌ను ఏఐ హబ్‌గా అభివృద్ధి చేయడానికి తొలి అడుగు పడింది.

స్వర్ణాంధ్ర నంబర్‌ వన్‌గా ఉండాలి..

2047నాటికి భారత్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. అందులో స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ నంబర్‌ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. అది తప్పకుండా సాధ్యమవుతుంది. విజయవాడలో ఉండేవాళ్లు ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీతో పుట్టిన వాళ్లు పేదరికంలో ఉన్నారు. అలాంటి వారి బాధ్యతను పీ-4 కార్యక్రమం కింద తీసుకోవాలి.


ఉద్యోగులూ ఆరు తర్వాత పని చేయొద్దు

ఆ ఐదేళ్లలో ఎక్కడ చూసినా అప్పులే. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో బాగా సహకరించారు. ఎన్ని కష్టాలున్నా వారికి దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసమే డీఏ విడుదలకు నిర్ణయించాం. హెల్త్‌కార్డులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చాం.

పోలీసులకు సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ ఇచ్చాం. ఉద్యోగులూ.. ఒకప్పుడు అందరం హార్డ్‌వర్క్‌ చేసేవాళ్లం.. ఇప్పుడు స్మార్ట్‌ వర్క్‌ చేయాల్సిన అవసరం ఉంది. సాయంత్రం 6 తర్వాత పనిచేయొద్దు. విపత్తు సమయాల్లోనే ఎక్కువ పనిచేయండి. శని, ఆదివారాలు ఇంటి వద్దే నచ్చిన పనులు చేసుకుని సోమవారం నుంచి ఉత్సాహంగా పనిచేయండి.

దీపావళి వేడుకల్లో చంద్రబాబు దంపతులు

పున్నమిఘాట్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో చంద్రబాబు బాణసంచా కాల్చే కార్యక్రమాన్ని రిమోట్‌తో ప్రారంభించారు. భార్య భువనేశ్వరితో కలిసి బాణసంచా వెలుగులను ఆస్వాదించారు. ఆ వెలుగులను తన మొబైల్‌ ఫోన్‌లో బంధించారు. మధ్యమధ్యలో చిన్నారులను పలుకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు.

Updated Date - Oct 20 , 2025 | 04:12 AM