Share News

AP CM Chandrababu: రైతు ఉత్పత్తులకు గ్లోబల్‌ బ్రాండ్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:10 AM

రైతు ఉత్పత్తులు గ్లోబల్‌ బ్రాండ్‌లా ఉండాలి. అరకు కాఫీకి ఇవాళ ఆ బ్రాండ్‌ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి.

AP CM Chandrababu: రైతు ఉత్పత్తులకు గ్లోబల్‌ బ్రాండ్‌

  • అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి.. రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక

  • పంటను వినియోగదారుకే అమ్మేలా చర్యలు

  • భూ రికార్డులు తారుమారు చేసిన జగన్‌

  • నచ్చనివాళ్ల భూమి నిషేధిత జాబితాలో..

  • సొంతదారుల హక్కులు నాడు పోగొట్టారు

  • అవన్నీ సరిచేస్తున్నాం.. సంజీవని తెస్తున్నాం

  • ‘రైతన్నా- మీకోసం’లో చంద్రబాబు వెల్లడి

  • ‘తూర్పు’లోని నల్లజర్ల సభలో నులకమంచంపై

  • కూర్చుని రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

శాస్త్రవేత్తలు గదుల్లో కూర్చుని పరిశోధనలు చేస్తున్నామంటే కుదరదు. రైతుల అనుభవాలను కూడా కలుపుకొని ప్రయోగాలు చేయాలి. నిజానికి, ప్రాక్టికల్‌ సైంటిస్ట్‌లు రైతులే. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల ఆదాయం వస్తుంది. దీనికోసం వినూత్న పద్ధతుల్లో విభిన్న పంటలు పండించాలి. చిత్తూరులో మామిడి పండుకు కవరు పెడితే, రేటు ఎక్కువ వచ్చింది. మేం (ప్రభుత్వం) రూపాయి ఇస్తే మీరు ఓ రూపాయి పెట్టుకోవాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.

- సీఎం చంద్రబాబు

రాజమహేంద్రవరం, నల్లజర్ల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతు ఉత్పత్తులు గ్లోబల్‌ బ్రాండ్‌లా ఉండాలి. అరకు కాఫీకి ఇవాళ ఆ బ్రాండ్‌ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఎక్కడో జరుగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రభావం మన రైతులపై కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం వస్తే మన రొయ్య ధర పడిపోయింది. అందువల్ల సమష్టిగా, వినూత్నంగా పనిచేయాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే రైతుల కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రణాళిక అమలు చేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని నల్లజర్లలో జరిగిన రైతన్నా-మీకోసం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నేను మంచి కన్సల్టెంట్‌ను పెట్టుకున్నా. ప్రపంచ పరిస్థితులను దానివల్ల ముందే గ్రహించగలుగుతున్నా. జఠిలమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికీ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుకు అండగా ఉండడానికీ పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం.

Untitled-1 copy.jpg


ఈ సూత్రాలపై అవగాహన కల్పించడం కోసమే ‘రైతన్నా- మీకోసం’ చేపట్టాం’’ అని సీఎం వివరించారు. రాష్ట్ర రైతులు తెలివైనవారని, నీరు ఎక్కడ ఉంటే అక్కడకెళ్లి వ్యవసాయం చేస్తారన్నారు. ‘‘వ్యవసాయంలో సంక్షోభం వస్తుంటుంది. అది లేకుండా చూసే బాధ్యత నాపై ఉంది. ఇప్పటికే కొంతవరకు నియంత్రించాం. సాగును లాభసాటి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రైతు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై దృష్టిపెట్టాలి. ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలి. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్ఎంఈని ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పండించిన పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. సమావేశంలో మంత్రులు కందుల దుర్గేశ్‌, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, తూర్పుగోదావరి కలెక్టర్‌ కీర్తి చేకూరి, స్ధానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


భూగర్భ జలాలు తగ్గాయి...

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1నాటికి 6.8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉంటే, తూర్పుగోదావరి జిల్లాలో 18 మీటర్ల లోతులో ఉన్నాయి. దానికి ఇక్కడి పరిస్థితులే కారణం. ఈ ఏడాది రిజర్వాయర్లలో 900 టీఎంసీల నీరు, 700 టీఎంసీల వరకు భూగర్భ జలాలున్నాయి. 20 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. వాటితో సాగునీరు, మంచినీరు, పరిశ్రమలకు నీటిఎద్దడి లేకుండా చేస్తాం. గోదావరి-కృష్ణా అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీరందుతుంది. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారతో అనుసంధానం చేస్తాం. పెన్నాకు కూడా తీసుకెళ్తాం. ఈ ఏడాది గోదావరి నీరు ఏడు వేల టీఎంసీలు సముద్రం పాలైంది. 1500 టీఎంసీల కృష్ణా నీరు వృఽథా అయింది. ఇందులో కనీసం 200 టీఎంసీలను వాడుకోగలిగితే కరువన్నమాటే వినపడదు.’’

పామాయిల్‌ ఎన్టీఆరే తెచ్చారు

‘‘రాష్ట్రంలో మొదటి పామాయిల్‌ మొక్కను మలేసియా నుంచి ఎన్టీఆర్‌ తెచ్చారు. క్రమంగా దాని సాగు పెరిగింది. ఓ సమయంలో ధర పడిపోతే నేనే రాయితీ ఇచ్చి ప్రోత్సహించాను. పామాయిల్‌ సాగుకు మైక్రో న్యూట్రిషన్లు వాడాలి. ఒక పంటకు లాభం వస్తే అందరూ అదే వేస్తున్నారు. ఒకరు రైస్‌మిల్లు పెడితే అందరూ అవే పెడతారు. అది నష్టం. హెచ్‌డీ బర్గీ పొగాకు మొదట ఎవరూ కొనలేదు. తర్వాత డిమాండ్‌ ఉండడంతో అందరూ వేసేశారు. ఇవాళ కొనేవారు లేదు. కోకో ఫ్యాక్టరీలు పెరగాలి. మూడు నెలలకు ఒకసారి అందరికీ అన్ని వైద్య పరీక్షలు చేసేలా సంజీవని ప్రాజెక్టు తెస్తున్నాం. కుప్పం-చిత్తూరులో పూర్తి చేశాం. 2030 నాటికి ఎయిడ్స్‌రహిత రాష్ట్రం చేస్తాం.’’


జాబిల్లి రావే.. అంటే పనులు కావు

‘‘రెవెన్యూ ప్రక్షాళన చేయాలి. జగన్‌ ఆనాడు రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. ఆయన మాట వినకపోయినా, చెప్పినట్టు చేయకపోయినా, భూములు ఇవ్వమన్నప్పుడు ఇవ్వకపోయినా, వాటిని 22ఏలో చేర్చారు. సొంతదారులకు హక్కులు లేకుండా చేశారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఖజానా ఖాళీ అయింది. మేం, పవన్‌, బీజేపీ కూటమి ఏర్పడితే ప్రజలు అఖండ విజయం ఇచ్చారు. దాంతో మూడు, నాలుగు రెట్లు అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. అయితే, జాబిల్లి రావే...అంటూ చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పి ఇంట్లో కూర్చుంటే పనులు కావు. గతంలో వైసీపీ విధ్వంసం వల్ల రోడ్లు గుంతలు పడ్డాయి. పూడ్చాం. తుఫాన్‌ వల్ల మళ్లీ దెబ్బతిన్నాయి. సంక్రాంతిలోపు గుంతలన్నీ పూడ్చేటట్టు ఆదేశాలిచ్చాం.’’

చార్జీలు పెంచం

‘‘విద్యుత్‌ చార్జీలు పెంచం. గతంలో కూడా చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రైతు పొలాల్లోనూ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. సబ్‌ స్టేషన్లలోనూ ఉత్పత్తి చేస్తాం. మీరు, మేమూ కలిస్తే ఏదైనా సాధ్యమే. మన జీవితాలను మనమే మార్చుకోగలం.’’

నేను రైస్‌ తినను: చంద్రబాబు

‘‘మీరేమీ అనుకోకపోతే ఒకటి చెబుతాను. నేను రైస్‌ తినను. ఎవరు ఏమనుకున్నా లాంగ్‌టైమ్‌లో ప్రకృతి సేద్యమే మార్గం. రాయలసీమలో రాగి అన్నం తినేవారు. ఇటీవల అక్కడ కూడా తగ్గింది. అన్నం అందరికీ అలవాటయింది. ఎన్టీఆర్‌ కిలో 2 బియ్యంతో అందరూ రైస్‌ తినడం మొదలు పెట్టారు. ఒక పంట వరి వేసినా రెండో పంట హార్టికల్చర్‌ వేస్తే ఆదాయం పెరుగుతుంది. గోపాలపురం వంటి మెట్ట ప్రాంతాల్లో తృణధాన్యాలు, ఇతర పంటలు వేయడం లాభదాయకం. పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉండేవి. ఇవాళ పంజాబ్‌ నుంచి నెలకు రెండు రైళ్ల నిండా క్యాన్సర్‌ రోగులు ఢిల్లీకి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు.’’


డ్రిప్‌ పెంచండి.. దాణాకు సబ్సిడీ ఇవ్వండి

నల్లజర్లలో చంద్రబాబును కోరిన రైతులు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని రైతు బొబ్బి ధర్మారావు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వేదికలో సీఎం చంద్రబాబు నులక మంచంపై కూర్చుని రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు.

పెనుమత్స సుబ్బరాజు (దేవరపల్లి, యర్నగూడెం సొసైటీ అధ్యక్షుడు): గతంలో మా ప్రాంతంలో 250 అడుగుల్లో నీరు పడేది. ఇప్పుడు 400 అడుగులు బోర్లు వేయాల్సి వస్తోంది. ఉద్యానవన పంటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీరందిస్తే నీరు ఆదా అవుతుంది.

సీఎం: నువ్వు ఏ పంటలు పండిస్తున్నావు?

సుబ్బరాజు: పామాయిల్‌, కోకో సాగు చేస్తూ అంతర్‌ పంటగా మిరియాలు వేస్తున్నాను.

గుంటముక్కల వేణు (రైతు, నల్లజర్ల): వ్యవసాయంతోపాటు కాజు పరిశ్రమను నిర్వహిస్తున్నాను. దీనిద్వారా రూ.2కోట్ల టర్నోవర్‌ ఉంటోంది. ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆయిల్‌ఫాంలో అరటి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాను. (వేణును సీఎం అభినందించారు)

మార్ని మురళీ (రైతు, నల్లజర్ల): అయిల్‌ఫాం చెట్ల గెలలు కోసేందుకు కూలీలు రావడం లేదు. ఆ చెట్లను తొలగించే ప్రక్రియకు ప్రభుత్వ సాయం అవసరం. నూతన మిషనరీ ఏర్పాటుచేసి చెట్లను నిర్వీర్యం చేయాలి.

సీఎం: (అధికారులతో) మలేసియా నుంచి కొత్త మిషనరీ తీసుకువచ్చే ఏర్పాటు చేయండి.

పాతూరి రమేశ్‌ (రైతు, అచ్చన్నపాలెం): ఆయిల్‌ఫాం తోటలో విద్యుత్‌ వైర్లు ఉండడం వల్ల గెలలు కోసే సమయంలో షాక్‌కు గురై రైతులు, రైతు కూలీలు మృతి చెందుతున్నారు. విద్యుత్‌ వైర్లు తొలగించి కేబుల్స్‌ వేయాలి.

సీఎం: కేబుళ్లు వేయడం ఖర్చుతో కూడిన పని. విద్యుత్‌ లైన్లు పక్కకు మార్చాలంటే, అందుకయ్యే వ్యయంలో రైతులు విద్యుత్‌ శాఖకు 25 శాతం చెల్లిస్తున్నారు. ఆ భారం తగ్గించడానికి యత్నిస్తాం.

గన్నిన సుబ్బారావు (రైతు, నల్లజర్ల): నాకు ఉన్న రెండు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. బస్తా రూ.2,500 వరకు ధర పలుకుతుంది. పశువుల దాణాపై సబ్సిడీ అందించాలి.

సీఎం: పురుగుమందులు,ఎరువుల వినియోగంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి.అధికంగా వాడితే క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది.


చంద్రన్న.. రైతన్న!

నులక మంచంపై కూర్చొని.. కుటుంబ సభ్యుడిగా కుశలమడుగుతూ..

రాజమహేంద్రవరం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు తీరులో ఈసారి ఏదో మార్పు కనిపిస్తోంది. పెద్ద సభలు.. వేలల్లో జన సమీకరణ.. పెద్ద పెద్ద మైక్‌ సెట్లు.. గంటల తరబడి ప్రసంగాలు.. ఇలాంటి వాటికి స్వస్తి పలికారని అనిపిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఇటీవలకాలంలో నిర్వహిస్తున్న సమావేశాలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతు బోబ్బి ధర్మరావు వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వేదిక నిర్వహించి ముఖ్యమంత్రి మంచంపై కూర్చుని రైతులతో ముఖముఖి నిర్వహించారు. ఓ చెట్టు కింద నులక మంచంపై సీఎం కూర్చున్నారు. సుమారు 3 గంటలు జరిగిన ఈ కార్యక్రమంలో గంటన్నర ఆయన 75 ఏళ్ల వయసులో అలాగే కూర్చుని రైతులతో మాట్లాడారు. రైతులు కూర్చోడానికి కూడా నులక స్టూల్స్‌ని కడప నుంచి రప్పించారు. ప్రకృతి ఒడిలో.. రైతన్నలతో మమేకమయ్యే విధంగా కలెక్టర్‌ కీర్తి చేకూరి చొరవ తీసుకొని ఏర్పాట్లు చేయించారు. రాష్ట్రంలో ఇలా సీఎం సభా వేదికను రూపుదిద్దడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.

Untitled-1 copy.jpg

Updated Date - Dec 04 , 2025 | 06:14 AM