CM Chandrababu Naidu: గట్టిగా తిప్పికొట్టండి!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:30 AM
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుట్రలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.....
జగన్ కుట్రలు శ్రుతి మించుతున్నాయ్
దళితులను రెచ్చగొట్టేందుకు అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు
లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు నకిలీ మద్యాన్ని తెరపైకి తెచ్చారు
పీపీపీల విషయంలోనూ వైసీపీ కుట్రలు
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని తమ పార్టీ సర్పంచితో తగులబెట్టించి, ఆ నెపాన్ని మనపై వేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. రూ.వేల కోట్ల మద్యంస్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నకిలీ మద్యాన్ని తమ పార్టీ నేతలతో తయారుచేయించి, దానిని మనపై నెట్టేందుకు సిద్ధమయ్యారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం విషయంలోనూ వైసీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారు. వీరి కుట్రలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడంలో వెనుకబడుతున్నాం. జగన్‌ను, వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తడబడుతున్నాం.
- చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుట్రలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాటిని సమర్థంగా అడ్డుకోవడంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ఇన్‌చార్జిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాలతోపాటు వైసీ పీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలపైనా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఒకప్పుడు వైసీపీ వైపు ఉన్న దళితులు క్రమేణా ఆ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో వారిని రెచ్చగొట్టేందుకు జగన్ పలు కుట్రలకు తెరదీశారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో దళితుల ఆరాధ్యదైవం అంబేడ్కర్ విగ్రహాన్ని తన పార్టీ సర్పంచితో తగులబెట్టించి, ఆ నెపాన్ని మనపై వేసేందుకు ప్రయత్నం చేశారు. ఇలాంటి నేర మనస్తత్వం ఉన్న వైసీపీని.. జగన్‌ను.. సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మనం తడబడుతున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ నియోజకవర్గ స్థాయి నేతను సస్పెండ్ చేశామని, కానీ వైసీపీ అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన తమ పార్టీ సర్పంచిపై కనీస చర్యలు తీసుకోకుండా ఆయనను వెనకేసుకొస్తోందని విమర్శించారు. ఈ విషయాన్ని దళితుల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉండగా, ఆ పనిచేయడంలో పూర్తిగా విఫలమయ్యామని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలో ఉండగా వైసీపీ నేతలు దళితులను హత్యలు చేయడమే కాకుండా, చంపేసిన దళితులను డోర్ డెలివరీ కూడా చేశారు. ఐదేళ్ల పాలనలో దళితులపై వైసీపీ చేసినన్ని అరాచకాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. మళ్లీ అధికారం కోసం దళితులను పావులుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కుట్రలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలి. పార్టీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి అంశాలపై నేతలకు సమాచారం.. సూచనలు అందిస్తుండాలి’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే..
‘‘ఐదేళ్ల పాలనలో లిక్కర్ స్కామ్‌తో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో వైసీపీ నేతలు చెలగాటమాడారు. మనం అధికారంలోకి రాగానే ఈ స్కామ్ గుట్టురట్టు చేశా ం. వైసీపీ నేతలు ఈ కేసులో వరుసగా జైలుకు పో తున్నారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నకిలీమద్యాన్ని వైసీపీ నేతలతో తయారుచేయించి, నెపాన్ని మనపై నెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇలాం టి విషయాల్లో మనం అప్రమత్తంగా ఉండాలి. ఏం జరుగుతుందో ప్రజలకు సవివరంగా వివరించాలి.’’
పీపీపీ విషయంలోనూ కుట్రలే..
‘‘మెడికల్ కాలేజీల పీపీపీ విధానం విషయంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని మనం సమర్థవంతం గా అడ్డుకోలేకపోతున్నాం. ప్రభుత్వం వాటిని నిర్మించాలంటే కనీసం పది, పదిహేనేళ్లు పడుతుంది. పీపీపీ విధానంలో రెండున్నరేళ్లలోనే పూర్తి చేయవచ్చు. అదే సమయంలో ప్రభుత్వం నిర్వహించిన దానికంటే ఈ విధానంలో 150 సీట్లు ఎక్కువగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అలాగే 70 శాతం వైద్యసేవలు పూర్తి ఉచితంగా అందివ్వగలుగుతాం. 33 ఏళ్ల తర్వాత కాలేజీ, ఆస్పత్రి భవనాలన్నీ ప్రభుత్వపరమవుతాయి. ఈ విషయాలన్నింటినీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాం. చిన్నపాటి కోడికత్తి గాయానికే జగన్ ఎక్కడికి వెళ్లారో ప్రజలందరికీ తెలుసు. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురైతే ఆమెను ఎక్కడ చేర్చారు? జగన్ కానీ, అవినాశ్ రెడ్డి తల్లి కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు ఎందుకు వెళ్లలేదు? కార్పొరేట్ ఆస్పత్రులకే ఎందుకు వెళ్లారు? వీరికి చిన్నపాటి గాయాలకు సైతం కార్పొరేట్ వైద్యం కావాలి. పేదలకు మాత్రం కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండకూడదా? ఈ విషయాలను బలమైన ఉదాహరణలతో ప్రజల్లోకి తీసుకెళ్లండి’’ అని చంద్రబాబు నిర్దేశించారు.
టీడీపీ కార్యాలయ భవనాల పరిశీలన
టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెండు భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. కొత్తతరం నాయకులను తయారుచేయడానికి ఈ భవనాల్లో చేస్తున్న ఏర్పాట్లను చంద్రబాబు సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణుల శిక్షణ తరగతులను త్వరగా పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కార్యాలయానికి వచ్చినవారికి చక్కని వసతి, వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కార్యాలయం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేస్తే, రాత్రిపూట బస చేసేవారు ఉదయాన్నే వాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. లైబ్రరీ, సమావేశ మందిరాల్లో ఏర్పాట్లనూ సీఎం పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.