Chandrababu: సినిమాల్లోలాగా బయటా చంపేస్తారా
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:37 AM
జగన్‌లాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తులతోనే ముప్పు అని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జగన్ తీరుపై మండిపడ్డారు.
రప్పా రప్పా నరుకుతా.. అనడం సినిమా డైలాగ్ అట!
అందులో తప్పేముందని జగన్ అంటున్నారు.. ఇలాంటి మానసిక స్థితి ఉన్న వారితోనే ముప్పు
వీరి నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ యాత్రలు
కొట్టండి.. నరకండి.. చంపండి.. వార్ డిక్లేర్.. వంటి నినాదాలను సమాజం అంగీకరించదు
బెట్టింగ్ ప్రాణానికి ఉన్న విలువ.. వైసీపీ చేతుల్లో చనిపోయినవారికి లేదా?
జగన్ తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్
‘‘రప్పా రప్పా నరుకుతా.. అనేది సినిమా డైలాగ్ అని జగన్ చెబుతున్నారు. సినిమా డైలాగులు చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో మనుషులను చంపేస్తారు. అలాగని నిజజీవితంలోనూ చంపేస్తారా.? చంపేసి తప్పేంటని అంటారా..? రేప్ చేసినా తప్పు లేదు.. బాబాయ్‌ని చంపేసినా తప్పులేదనే వారికి ఏం చెప్పాలి?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): జగన్‌లాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తులతోనే ముప్పు అని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జగన్ తీరుపై మండిపడ్డారు. రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు ఉన్నాయన్నారు. ప్రపంచం గర్వించేలా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేను పక్కదారి పట్టించేలా రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. ఇష్టానుసారంగా భయోత్పాతం సృష్టిస్తామంటే కుదరదు. అలాంటి వారి పట్ల చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకప్పుడు నేరగాళ్లను కలవాలంటే రాజకీయ నాయకులు భయపడేవాళ్లు. ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేస్తున్నారు. చంపేయండి.. పొడిచేయండి.. నరికేయండి.. రప్పా రప్పా నరికేస్తాం.. వార్ డిక్లేర్డ్.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం.. వంటి పోకడలు ఎప్పుడైనా చూశామా? దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ, రాజకీయ పార్టీకీ ఈ తరహా పోకడలు లేవు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరం.’’ అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
బెట్టింగ్‌లు చేసేవాళ్లకు విగ్రహాలా?
‘‘గంజాయి బ్యాచ్.. బెట్టింగ్ బ్యాచ్.. రౌడీయిజం చేసేవారికి విగ్రహాలు పెట్టడం అనేది కొత్త సంస్కృతి. వైసీపీ వాళ్లు ఇలాంటి విధానాలు తీసుకొస్తున్నారు. రౌడీయిజం చేసేవారు హీరోలు.. శాంతిభద్రతలను పరిరక్షించేవారు హీరోలు కాదనే సంస్కృతి తీసుకొస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. వైసీపీ హయాం లో గంజాయి బ్యాచ్‌లను పెంచి పోషించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి ఉత్పత్తిపై ఉక్కుపాదం మోపాం. ఎవరైనా సాగు చేస్తుంటే మక్కెలిరగగొడుతున్నాం. ఈగల్ టీంలను పెట్టి గంజాయి బ్యాచ్‌లను లేకుండా చేస్తున్నాం. వెధవ పనులు చేయబట్టే ప్రజలు 11 సీట్లు కట్టబెట్టి జగన్‌కు బుద్ధి చెప్పారు.’’
చట్టమంటే లెక్కలేనితనమా?
‘‘వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటే ఇలాగే వ్యవహరించామా? జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా... ఇరుకు సందుల్లో ఎక్కువ మంది వెళ్లలేరని, వంద మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దానిని భేఖాతరు చేసి దౌర్జన్యపూరితంగా వెళ్లి అక్కడ మీటింగ్‌లు పెట్టడమే కాకుండా తొక్కిసలాటకు కారణమయ్యారు. పైగా చట్టమంటే లెక్కలేనితనంగా పోలీసులను తిట్టారు. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా? రాజకీయ నాయకుడు అంటే ఓ హుందాతనం ఉండాలి. అది లేకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ప్రజలు హర్షించరు. పరామర్శలకు వెళుతుంటే మేమేమీ అడ్డుకోవడం లేదు.. వారు ఇష్టమొచ్చినట్లు చేసి, గొడవలు సృష్టించి తిరిగి ప్రభుత్వాన్నే తప్పుబడుతున్నారు. పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించేవారిని ఏమనాలి? పరామర్శ యాత్రల్లో వారుచేసే అరాచకాన్ని అడ్డుకుంటే.. మమ్మల్ని చూసి భయపడుతున్నారు అని అంటున్నారు. నాలుగేళ్ల తర్వాత కదా ఆయనను చూసి భయపడాల్సింది.’’
ముందు ఇంకా భయంకరంగా వ్యవహరిస్తారు
‘‘జగన్ లాంటివారు రోడ్డుమీదకు వస్తే మున్ముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అధికారం కోసం ఇంకా భయంకరంగా వ్యవహరిస్తారు. పొదిలిలో 40 వేల మందితో పొగాకు రైతుల పరామర్శకు ఎలావెళతారు?. అంతమందిని ఎందుకు సమీకరించారు? లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలనే కదా? అంతమందితో మార్కెట్‌యార్డుకు వెళ్లి పొగాకు తొక్కేస్తే ఏమవుతుంది? ప్రజలకూ వాస్తవాలు తెలియాలనే ఇంతలా మాట్లాడాల్సి వస్తోంది. మన ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటే ఎన్నిసార్లు విచారిస్తాం. ఒక నాయకుడిని ఎన్నుకునే సమయంలో కాస్తయినా ఆలోచించమా? గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. రాజకీయాల్లో ఉన్నాం.. వదిలేయాలంటే అది కరెక్టేనా?. ఈ ఆలోచనాధోరణి మారాలి. లేకుంటే రాష్ట్రానికి రక్షణ లేకుండా పోతుంది. మీరు (వైసీపీ నేతలను ఉద్దేశించి) మారండి. మారితే సమాజం ఆమోదిస్తుంది. తప్పుడు పనులు చేసి సమాజాన్ని అతలాకుతలం చేస్తానంటే కుదరదు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవడం మా విధానం కాదు.. చట్టపరంగానే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కుప్పంలో జరిగినదానికి సిగ్గుపడుతున్నా: చంద్రబాబు
కుప్పంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టి హించించిన ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నా సొంత నియోజకవర్గంలో జరిగిన దానికి సిగ్గుపడుతున్నా. డబ్బులు ఇవ్వకపోతే చెట్టుకు కట్టేసి కొడతారా? వైసీపీ నేతలను చూసి అలాంటి వారు స్ఫూర్తి పొందుతున్నారు.. కుప్పంలో గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు.. వైసీపీ వారు రాజకీయంగా.. సామాజికంగా సమస్యగా తయారవుతున్నారు. ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. ప్రజలు ఇలాంటివాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే సమాజానికే నష్టం. ఎవరికీ రక్షణ ఉండదు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సినిమాల్లోలాగా బయటా
‘‘సత్తెనపల్లి నియోజకవర్గంలో అసలు జరిగిందేంటి? జగన్ అధికారంలో ఉన్నప్పుడే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శిస్తానంటూ బయలుదేరడమేంమిటి? పరామర్శకు వెళ్లే సమయం లో వైసీపీ వారి వాహనాలు కిందపడి ఒకరు.. తొక్కిసలాటలో మరొకరు చనిపోతే, వారిని పట్టించుకోరు. పరామర్శించరు. బెట్టింగ్ ప్రాణానికున్న విలువ, మీ చేతిలో చనిపోయినవారి ప్రాణాలకు లేదా..?’’
‘‘ఊళ్లో దొంగలు ఉంటే ఆ ఊరి అబ్బాయికికానీ, అమ్మాయికికానీ మన పిల్లలను ఇచ్చి పెళ్లి చేస్తామా? రాష్ట్రం పరిస్థితి కూడా అంతే. గత ఐదేళ్లూ రాష్ట్రాన్ని దొంగల రాజ్యంగా చేశారు. పారిశ్రామికవేత్తలు ఇటువైపు చూడటం మానేశారు. గత ప్రభుత్వ ముద్ర పోగొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఏడాది లో 5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో అరాచకాలకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుని తీరుతాం. ప్రజలు నిలదీస్తే సమాధానం ఇస్తాం. అన్యాయం జరిగితే సరిచేస్తాం. వైసీపీ వారు నిలదీస్తే తాట తీస్తాం.’’
- చంద్రబాబు