SIT Investigation: చాముండ సోదరులు.. మహా ముదుర్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:45 AM
జగన్ హయాంలో జరిగిన భారీ మద్యంకుంభ కోణంలో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ప్రజలు, డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసిన రూ.కోట్ల ముడుపులను హవాలా చేసిన...
ఇద్దరిపైనా బంగారం స్మగ్లింగ్ కేసులు
ముంబై చేరుకున్న సిట్ బృందం
చేతన్ పట్టుబడితే హవాలా గుట్టు రట్టు!
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన భారీ మద్యంకుంభ కోణంలో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ప్రజలు, డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసిన రూ.కోట్ల ముడుపులను హవాలా చేసిన ‘చాముండ’ బులియన్ సోదరులు చేతన్ కుమార్, రోణక్ కుమార్ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులుగా తేలింది. రాజ్ కసిరెడ్డి గ్యాంగ్‌తో సంప్రదింపులు జరిపి వంద కోట్ల హవాలాకు ఒప్పందం కుదుర్చుకుని రూ.78 కోట్లు వైట్ మనీగా మార్చిన చేతన్ కుమార్‌ను సిట్ అధికారులు విచారణకు పిలవడం.. ఆరోగ్యం బాగా లేదంటూ అతడు తన తమ్ముడు రోణక్ కుమార్‌ను విజయవాడకు పంపడం.. ఇక్కడ హవాలా గుట్టు మొత్తాన్నీ అనిల్ చోఖ్రా (షెల్ కంపెనీల సృష్టికర్త) విప్పేశాడని అతడికి తెలియడం.. వెంటనే ముంబైకి పారిపోయే ప్రయత్నం చేయడం.. ఆ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో రోణక్‌ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అతడి సెల్‌ఫోన్ ఓపెన్ చేయించి చూడగా.. అందులో కేంద్ర ఏజెన్సీ డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) విచారణకు పిలిచిన నోటీసులు కనిపించాయి. ఇవేంటని అడిగినా రోణక్ బయట పెట్టలేదు. దీంతో సిట్ అధికారులు ముంబైలోని డీఆర్‌ఐ అధికారులను సంప్రదించగా.. ఇద్దరిపైనా స్మగ్లింగ్ కేసులున్నాయని.. అవి విచారణ నిమిత్తం అతడికి తాము జారీ చేసిన నోటీసులని వారు వెల్లడించారు.
చాముండ బులియన్ యజమాని జస్‌రాజ్‌కు దుబాయ్‌లో ఉన్న లింకులు, అతడి కుమారులైన చేతన్, రోణక్ వారసత్వ స్మగ్లింగ్, హవాలా గురించిన వివరాలు కూడా తెలియజేశారు. దీంతో వైసీపీ లిక్కర్ ముఠాతో సంబంధాలు నెరిపిన ఈ సోదరులు బంగారం స్మగ్లింగ్ కూడా చేస్తారని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఒక బ్రాండ్ మద్యాన్ని వైసీపీ హయాంలో సరఫరా చేసిన లిక్కర్ వ్యాపారులు.. ముంబైలో వందల కిలోల బంగారం కొనుగోలు చేసినట్లు బిల్లులు లభించాయి. ఈ కోణంలోనూ ఆరా తీస్తున్న సిట్ బృందం గురువారం సాయంత్రం ముంబైకి చేరుకుంది. అక్కడ చేతన్ కుమార్ పట్టుబడితే బంగారం గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.