Gopannapalem PET College: ఆయాస.. ప్రయాసల్లో వ్యాయామ విద్య
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:55 AM
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన ప్రభుత్వ వ్యాయామ కాలేజీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ఒక్కటే!
‘గోపన్నపాలెం’ పీఈటీ కళాశాల అభివృద్ధి పాట్లు
సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్న వైనం
శిథిలావస్థలో హాస్టళ్లు, పలు ఇతర భవనాలు
అధ్యాపకుల కొరత.. విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు
400 సీట్లు ఉన్నా.. 50 లోపే భర్తీ
రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ కళాశాల దుస్థితి ఇదీ..
ఏలూరు జిల్లాలోని శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల... రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పీఈటీ కాలేజీ ఇదొక్కటే! ఐదు దశాబ్దాలుగా వ్యాయామ విద్యలో విద్యార్థులను సానపట్టే కేంద్రంగా బాసిల్లింది. నేడు అభివృద్ధికి నోచుకోక పాట్లు పడుతోంది. కాలేజీలోని హాస్టళ్లు, భోజనశాల, వంటగది వంటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. సరిపడా అధ్యాపకులు లేక 400 సీట్లు ఉన్న కాలేజీలో విద్యార్థుల సంఖ్య 45కు పడిపోయింది. దాతలు సమకూర్చే వనరులే ఆయువుగా ప్రస్తుతం కొనసాగుతోంది.
(ఏలూరు-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన ప్రభుత్వ వ్యాయామ కాలేజీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ఒక్కటే! ఇక్కడ బీపీఈడీ, డీపీఈడీ చదవితే ప్రభుత్వ కొలువు గ్యారెంటీ అనేలా ఉండేది గత పరిస్థితి. 1967లో విజయవాడలో ఆంధ్రా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా ప్రైవేట్‌గా ఉన్న ఈ కళాశాలను గోపన్నపాలేనికి మార్చారు. 1970 దశకంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు 200 సీట్ల వరకు అడ్మిషన్లు ఇచ్చేవారు. డిమాండ్ పెరగడంతో 1995 తర్వాత 400సీట్లకు పెంచారు. అప్పట్లో బాగా క్రీడల్లో రాణించిన ఉద్దండుల పిల్లలకు కూడా సీట్లు దక్కని స్థితి ఉండేది. ఈ కాలేజీ అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో కూడా క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఖ్యాతి గడించింది. కానీ ఇప్పుడు కళాశాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. హాస్టళ్లు, భోజనశాలు, వంటగది వంటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. దాతల సహకారంతోనే వసతులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. 400 సీట్లు భర్తీకి అవకాశం ఉన్నా.. విద్యార్థుల సంఖ్య 45కు పడిపోయింది. మరోవైపు అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.
హయ్యర్‌కు మారడమే శాపం
2020లో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యాపాలసీ ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావడం ఈ కాలేజీకి శాపంగా మారింది. తదనంతర సంస్కరణల ఫలితంగా 2022 నుంచి ఇక్కడున్న అధ్యాపకులు ఇతర కళాశాలలకు బదిలీ, ప్రమోషన్‌పై వెళ్లిపోయారు. గతంలో ప్రిన్సిపాల్‌ను మినహాయిస్తే 8 మంది అధ్యాపకులు ఉండేవారు. ఇప్పుడు పీడీ ర్యాంకులో ఉన్న ఒక్కరు మాత్రమే ఉన్నారు. రూ.28 వేల వేతనంతో గెస్ట్ లెక్చరర్లు కొద్ది నెలలుగా బోధిస్తున్నారు. వీరికి జీతాల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. 14మంది కింది స్థాయి సిబ్బందికి ఇద్దరే పనిచేస్తున్నారు.
400 సీట్లకు 45 మంది చేరిక
2010 నుంచి ప్రైవేట్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులివ్వడంతో ప్రైవేట్ కాలేజీలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు కారణాలతో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ కాలేజీలో 10 శాతానికి పడిపోయింది. కేవలం శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల నుంచి మాత్రమే అదీ కొంత మంది విద్యార్థులే ఇక్కడ చదువుకుంటున్నారు. కరోనా తర్వాత చేరికలు 50 సీట్లకు దాటలేదు. బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 36 మంది, డిప్లమో ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 9 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. కొద్ది వారాల్లో వీరంతా శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా పీ సెట్ నిర్వహించి మూడు నెలలు అవుతున్నా కళాశాలలో అడ్మిషన్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. వసతి గృహాలు, భోజనం చేసే రూమ్, టాయిలెట్లు సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త హాస్టల్ భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఇదే సమయంలో ఇప్పటికే సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ మండల అఽధ్యక్షుడు మిల్లుబాబు పిలుపునకు దాతలు స్పందించారు. క్యాడ్‌బరీ (కోకో విత్తన సంస్థ) రూ.30 లక్షల వ్యయంతో భోజనశాలను ఏర్పాటు చేసింది. ఇంకా ఓపెన్ జిమ్, వాటర్ ప్యూరిపైర్ ఫ్లాంట్ పలు ఇతర సదుపాయాలను పలువురు దాతలు కల్పించారు. మరోవైపు బాలికలకు హాస్టల్ నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ ఎంపీ ల్యాండ్స్ నుంచి రూ.25 లక్షలు ప్రకటించారు. ప్రభుత్వం ఏలూరు జిల్లాకు కేటాయించిన బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిపాలన భవనాలను ఇక్కడ ఏర్పాటు చేసే యోచనలో ఉండటంతో హాస్టల్ నిర్మాణ ప్రతిపాదనకు బ్రేక్ పడింది.
ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం
అధ్యాపకులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం హాస్టల్ నిర్మించి వసతులు కల్పిస్తే పేద విద్యార్థులకు నెలకు రూ.5 వేల భారం తగ్గుతుంది. ఇటీవల ఎమ్మెల్యే చింతమనేని చొరవతో పెదపాడులో మూతపడిన హాస్టళ్ల స్థానంలో ఈ కళాశాలకు హాస్టల్ మంజూరు చేయించడానికి కలెక్టర్‌కు సిఫారసు చేశారు. త్వరలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి విద్యా శాఖ మంత్రి లోకేశ్ కృషి చేస్తారని ఆశిస్తున్నాం.
- డాక్టర్ సాపట్ల నతానియేల్, ప్రిన్సిపాల్
మెస్ చార్జీలు భారంగా ఉన్నాయి
నేను బీపీఈడీ రెండో సంవత్సరం చదువుతున్నాను. మా లాంటి పేద విద్యార్థులు బీపీఈడీ చేయాలంటే ఇదొక్కటే ప్రభుత్వ కళాశాల దగ్గరలో ఉంది. మాకు మెస్ చార్జీలు భారంగా ఉన్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్ కింద వసతులు కల్పిస్తే రాబోయే విద్యార్థులకు ఎంతో మేలు.
- బి.దసరాజు, బీపీఈడీ విద్యార్థి, శ్రీకాకుళం
మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలి
మా కళాశాలకు విశాలమైన స్థలం ఉంది. 16 మంది బాలికలు ఇరుకైన ఒక్క గదిలోనే బస చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలను మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. మాలాంటి విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించి పూర్తి చేయాలి.
- దివ్య, బీపీఈడీ విద్యార్థిని