Share News

చకచకా రేషన్‌

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:15 AM

మొంథా తుఫాను నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ముందస్తుగా పౌరసరఫరాల శాఖ అధికారులు నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో చౌక దుకాణాలకు బియ్యం, పంచదార సరఫరా చేశారు. ఎన్టీర్‌ జిల్లాలో 957 డిపోలకు మొత్తం 4,298 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 134 మెట్రిక్‌ టన్నుల పంచదార తరలించారు. విజయవాడ నగరం, జిల్లా వ్యాప్తంగా నిత్యావసరాల పంపిణీ ప్రారంభించారు.

చకచకా రేషన్‌

- ఉమ్మడి కృష్ణాజిల్లాలో డిపోలకు బియ్యం, పంచదార సరఫరా

- లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించిన డీలర్లు

- మధ్యాహ్నానికి 40 శాతం డోర్‌ డెలివరీ పూర్తి

- అదనంగా గ్యాస్‌ సిలిండర్లను సిద్ధం చేయాలని ఏజెన్సీలకు ఆదేశాలు

- డీజిల్‌, పెట్రోల్‌ నిల్వలు పెంచాలని బంకుల నిర్వాహకులకు సూచన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

మొంథా తుఫాను నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ముందస్తుగా పౌరసరఫరాల శాఖ అధికారులు నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో చౌక దుకాణాలకు బియ్యం, పంచదార సరఫరా చేశారు. ఎన్టీర్‌ జిల్లాలో 957 డిపోలకు మొత్తం 4,298 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 134 మెట్రిక్‌ టన్నుల పంచదార తరలించారు. విజయవాడ నగరం, జిల్లా వ్యాప్తంగా నిత్యావసరాల పంపిణీ ప్రారంభించారు. 65 సంవత్సరాల పైబడిన వారికి ఇంటికే నిత్యావసరాలు డోర్‌ డెలివరీ చేస్తున్నారు. మధ్యాహ్నానికి 40 శాతం మేర డోర్‌ డెలివరీ పూర్తి చేశారు. కృష్ణా జిల్లాలో 1,059 రేషన్‌ డిపోలకు పూర్తిగా నిత్యావసరాల సరఫరా జరిగింది. ఆయా డిపోల పరిధిలో ఉదయం నుంచి నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. మధ్యాహ్నం నాటికి 41 శాతం మేర లబ్ధిదారులకు అందించారు. కృష్ణాజిల్లాలో మొత్తం 69,680 మంది వృద్ధులకు డోర్‌ డెలివరీ చేపట్టాల్సి ఉండగా.. మధ్యాహ్నం నాటికి 23,309 మందికి పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా మండలాల పరిధిలో తహసీల్దార్లు బియ్యం కోరితే ఇవ్వాల్సిందిగా రేషన్‌ డీలర్లకు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు పాపారావు, మోహన్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. డీలర్లకు అవసరమైనంత తాము తిరిగి డెలివరీ చేస్తామని తెలిపారు.

- ఎల్‌పీజీ డీలర్లు తగిన సంఖ్యలో గ్యాస్‌ సిలిండర్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా రెండు జిల్లాల సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు గ్యాస్‌ ఏజెన్సీలన్నింటికీ ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్‌ ఏజెన్సీల దగ్గర ఎంతెంత నిల్వలు ఉన్నాయో తెలుసుకుని ఆ మేరకు రిజర్వులో ఉంచాలని సూచించారు.

- అత్యవసర సమయాల్లో ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా అదనంగా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉంచాల్సిందిగా రెండు జిల్లాల్లోని పెట్రోల్‌ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బంకుల వారీగా ఆయిల్‌ నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయిల్‌ కంపెనీల నుంచి మరింతగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. బంకుల్లో ఎంత మేర ఆయిల్‌ నిల్వలు ఉన్నాయో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 01:15 AM